తుమ్మిడిహెట్టి - సుందిళ్లకు సీఎం గ్రీన్సిగ్నల్..గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల తరలింపు ప్రపోజల్‌‌‌‌కు ఓకే

తుమ్మిడిహెట్టి - సుందిళ్లకు సీఎం గ్రీన్సిగ్నల్..గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల తరలింపు ప్రపోజల్‌‌‌‌కు ఓకే
  • అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలనిఅధికారులకు ఆదేశం
  • సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల రిపేర్ల బాధ్యత ఏజెన్సీలదేననిమరోసారి తేల్చి చెప్పిన సీఎం 
  • కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ లేఖపైనా ఆరా
  • అన్ని డ్యామ్‌‌‌‌ల స్టేటస్ రిపోర్ట్‌‌‌‌లు సిద్ధం చేయాలని సూచన

హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని గ్రావిటీ ద్వారా తరలించాలనే ఇంజినీర్ల ప్రతిపాదనకు సీఎం రేవంత్​రెడ్డి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని  నీటిపారుదల శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అదే విధంగా రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి నివేదికలను తయారు చేయాలన్నారు. ప్రాజెక్టుల వారీగా అనాలసిస్​జరగాలని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌‌‌లోని తన నివాసంలో మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డితో కలిసి నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్​రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు అందేలా చూడాలన్నారు. కాంగ్రెస్​  హయాంలో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కాలువలను వాడుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు

సుందిళ్ల బ్యారేజీకి రిపేర్లు పూర్తి చేసి, తుమ్మడిహెట్టి నుంచి నీటిని గ్రావిటీ ద్వారా సుందిళ్లకు తెచ్చి, ఇక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసేలా అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. అంతకుముందు తుమ్మిడిహెట్టి- నుంచి సుందిళ్లను లింకు చేసే ప్రాజెక్టు ఆర్థికంగా, సాంకేతికంగా, పర్యావరణపరంగా అత్యుత్తమ ప్రత్యామ్నాయమని అధికారులు సీఎంకు వివరించారు. ఈ కొత్త అలైన్‌‌‌‌మెంట్ ద్వారా ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు 10- శాతం నుంచి 12 శాతానికి, భూసేకరణ వ్యయం సగానికి సగం తగ్గుతుందని, తద్వారా సర్కారుపై సుమారు రూ.1,500 నుంచి రూ.1,600 కోట్ల భారం తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. 

పాటిల్​ లేఖపైనా చర్చ.. 

కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవల్యూషన్ (సీడీఎస్ఈ) కి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఇటీవల రాసిన లేఖపై సీఎం రేవంత్​రెడ్డి అధికారులతో చర్చించారు. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలను అధికారులకు వివరించి, అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల వారీగా సమగ్రమైన వివరాలతో అనాలసిస్​ జరగాలన్నారు.  రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌‌‌‌లపైనా స్టేటస్ రిపోర్ట్‌‌‌‌లను తయారు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిస్థితిపైనా సమీక్షించారు. బ్యారేజీల మరమ్మతులకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇందుకు సంబంధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని అధికారులకు చెప్పారు. ప్రాజెక్టుల వారీగా రూపొందించే పూర్తిస్థాయి నివేదికల ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా  నిర్ణయించారు. సమావేశంలో ఇరిగేషన్​ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, స్పెషల్​సెక్రటరీ ప్రశాంత్​పాటిల్ తదితరులు పాల్గొన్నారు.