మెడికల్ కాలేజీలతో.. గురుకులాల అనుసంధానం

మెడికల్ కాలేజీలతో.. గురుకులాల అనుసంధానం
  • స్టూడెంట్ల కోసం తరచూ వైద్య శిబిరాలు
  • హాస్టళ్లను కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు సందర్శించాలి: సీఎం రేవంత్​రెడ్డి
  • ఆహార నాణ్యతను తెలుసుకునేందుకు యాప్​ వాడాలి
  •  హాస్టళ్లలోని సౌకర్యాల వివరాలను డాష్​ బోర్డులో అప్‌‌లోడ్ చేయాలి
  • యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో అందేలా చూడాలని ఆదేశం
  • గురుకులాల్లో తక్షణ అవసరాలకు రూ.60 కోట్ల చెక్కులు అందజేత

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని..  ఇందుకోసం ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్​ కాలేజీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను హాస్టళ్లతో అనుసంధానించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తరచుగా వైద్య శిబిరాలు నిర్వహించాలని, అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండేలా 24 గంటల హాట్‌‌లైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. 

జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు హాస్టళ్లను సందర్శించి స్టూడెంట్లకు మెరుగైన సేవలు అందేలా చూడాలని ఆయన అన్నారు. హాస్టళ్లలో ఉంటున్న స్టూడెంట్లు, బోధన, బోధ నేతర సిబ్బందిని ఫేస్ రికగ్నిషన్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లపై సోమవారం కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో సీఎం రేవంత్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతను తెలుసుకునేందుకు యాప్‌‌ను వినియోగించాలని, సరైన పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. 

గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు కేటాయించిన రూ. 60 కోట్ల అత్యవసర నిధుల చెక్కులను ఈ సందర్భంగా సీఎం విడుదల చేశారు. డైట్ చార్జీలు, సిబ్బంది జీతాలు, మరమ్మతులు వంటి అత్యవసర పనులకు ఈ నిధులను వినియోగించుకోవాలన్నారు. 

మ్యాచింగ్​ గ్రాంట్​ను విడుదల చేయండి

సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో పూర్తిస్థాయి డేటాతో జవాబుదారీతనం ఉండాలని.. హాస్టళ్లలో సౌకర్యాలు, వసతుల వివరాలను డాష్​ బోర్డులో అప్‌‌లోడ్ చేయాలని అధికారులకు సీఎం రేవంత్​ స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లకు స్కాలర్‌‌షిప్‌‌లు, సిబ్బంది జీతాలు , డైట్ చార్జీలు , నిర్మాణ ఖర్చులు, ఇతర ఖర్చులు, బకాయిల చెల్లింపు, హాస్టళ్ల నిర్వహణకు అయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపుకు అవసరమైన మొత్తానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని సీఎస్​ రామకృష్ణారావు, స్పెషల్​ సీఎస్​ సబ్యసాచి ఘోష్‌‌ను ఆదేశించారు. 

హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో అందేలా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, పోటీ పరీక్షలకు స్టూడెంట్లు సిద్ధం కావడానికి ఎడ్ టెక్ ఉపయోగించుకోవాలని, వారికి అందించే సేవలను సోషల్ మీడియా ద్వారా తెలియజేసి, తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 

సమీక్షకు ముందు సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ హాస్టళ్లలోని పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్,  అడ్లూరి లక్ష్మణ్ కుమార్​, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.