ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీల్లా ఉస్మానియా:సీఎం రేవంత్రెడ్డి

ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీల్లా ఉస్మానియా:సీఎం రేవంత్రెడ్డి
  • ప్రపంచంతో పోటీపడేలా వర్సిటీని అభివృద్ధి చేస్తం: సీఎం రేవంత్​రెడ్డి
  • ఓయూకు ఏమిచ్చినా.. ఎంతిచ్చినా తక్కువే
  • డిసెంబర్​లో మళ్లీ వస్త.. ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెడ్దం
  • అప్పుడు క్యాంపస్​లో ఒక్క పోలీసునూ పెట్టొద్దు
  • ఇది ప్రజాప్రభుత్వం.. నిరసన తెలిపేవాళ్లను తెలపనివ్వండి
  • కేసీఆర్​కు మళ్లీ అధికారం ఇస్తే ఓయూను ప్లాట్లు చేసి అమ్మేస్తడు
  • హెచ్​సీయూలో ఏనుగులు, సింహాలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేశారు
  • రాష్ట్రంలో ఏనుగులు, సింహాలు లేవు.. 
  • ఉన్న మానవమృగాలు కూడా ఫామ్​హౌస్​లోనే ఉన్నయ్​
  • వాళ్ల ఇంటిల్లిపాది మంత్రులు కావొచ్చు.. కానీ కోదండరాం ఎమ్మెల్సీగా ఉండొద్దా?
  • కోదండరాంను 15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీ చేస్తం
  • ఆరు నెలల్లో 40వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన
  • ఓయూలో హాస్టళ్ల భవనాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
  • ఠాగూర్​ ఆడిటోరియంలో జరిగిన సభలో ప్రసంగం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయంగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత చేసినా తక్కువే అవుతుంది. ప్రపంచంతో పోటీ పడేలా ఆక్స్​ఫర్డ్, స్టాన్​ఫర్డ్ యూనివర్సిటీల స్థాయిలో ఓయూను తయారు చేస్తం. ఎవరో లక్ష కోట్లు పెట్టి కట్టింది(కాళేశ్వరం) కూలింది.. పోయింది..లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయాయి.. ఓయూ కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయలేమా? సర్కారేమీ అంత దరిద్రంగా లేదు..’’ అని తెలిపారు. 

రాష్ట్రంలోని వర్సిటీలన్నింటినీ చదువులకే కాకుండా సామాజిక చైతన్య వేదికలుగా మార్చాలన్న ఆలోచనతో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటున్నదని తెలిపారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో కొత్త హాస్టల్ భవనాలు, లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దుందుభి, భీమ హాస్టళ్ల భవనాలను ప్రారంభించారు. సీఎం ఫెలోషిఫ్​ పథకాన్ని కూడా ప్రారంభించారు. వర్సిటీ పరిసరాలను ఆయన పరిశీలించగా.. వాటి గురించి ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం  వివరించారు. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. 

ఓయూను అద్భుతమైన వర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇంజనీరింగ్ నిపుణులు, విద్యాశాఖ అధికారులతో ఒక కమిటీని నియమించి సమగ్రమైన అంచనాలు రూపొందించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ కీలక పాత్ర పోషించిందని సీఎం రేవంత్​గుర్తుచేశారు. ‘‘ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న ఎంతో మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు, నాయకులు ఓయూ నుంచి వచ్చినవారే. 

తెలంగాణ సమాజానికి సమస్యలున్నా, సంక్షోభం వచ్చినా మొదట చర్చ జరిగేది ఉస్మానియా వర్సిటీలోనే. 1917లో నిజాం సర్కార్‌‌ ప్రారంభించిన ఓయూ.. 1930 నాటికి వందేమాతరం పాటతో ధిక్కార స్వరం వినిపించింది. సాయుధ రైతాంగ పోరాటం, తొలి మలిదశ తెలంగాణ ఉద్యమాలకు అండగా నిలిచింది. పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి, గద్దర్, జార్జి రెడ్డి వంటి ఎందరో గొప్ప నాయకులను ఈ గడ్డ అందించింది” అని తెలిపారు. 

ఎంతో ఘన చరిత్ర కలిగిన ఓయూను కాలగర్భంలో కలిపేయాలన్న కుట్ర గత ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్​ సర్కారు ఓయూకు పూర్వవైభవం కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నదని తెలిపారు. ఉస్మానియా వర్సిటీ 108  ఏండ్ల చరిత్రలో  దళితుడు వీసీ కాలేదని, కానీ ప్రస్తుతం కుమార్​ను ఆయన నైపుణ్యం గుర్తించి వీసీగా నియమించామని చెప్పారు. ఉద్యమకారులకు, సామాజిక వర్గాలకు సర్కారులో పలు అవకాశాలిచ్చామని తెలిపారు. దేశజనాభాలో 35 ఏండ్ల లోపు వయసున్న యువత 65 శాతం ఉందని, యువత శాసనసభకు పోటీ చేయాలంటే 25 ఏండ్ల వయోపరిమితిని 21 ఏండ్లకు ఎందుకు తగ్గించకూడదో ఆలోచన చేయాలని ఆయన సూచించారు.  

కేసీఆర్​కు మళ్లీ అధికారం ఇస్తే ఓయూను ప్లాట్లు చేసి అమ్మేస్తడు

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో పంచడానికి భూములు లేవని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చినా.. ఉస్మానియా యూనివర్సిటీని లేఔట్లు వేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటారని మండిపడ్డారు.  “వాళ్లంతా ఇప్పటికే అబద్దాలను సోషల్ మీడియా ద్వారా అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్​ సెంట్రల్ వర్సిటీలో ఏనుగులు, సింహాలు ఉన్నాయని.. మేం చంపుతున్నట్టు సోషల్ మీడియాలో పెట్టారు. 

తెలంగాణలో ఏనుగులు, సింహాలు అనేటివే లేవు. మానవరూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి. అవి ఫామ్ హౌస్​లో ఉన్నాయి. వాటిని నిర్బంధించేందుకు వలలు వేయండి” అని అన్నారు. ఎవరూ అపోహలకు లోనుకావొద్దని, అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామని, అబద్ధాలను నమ్మొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘‘అభివృద్ధిని కొందరు జీర్ణించుకోలేక ప్రతిదానికి అడ్డుపడ్తున్నరు. అలాంటి వాళ్లు తెలంగాణ సమాజానికి ముసుగేసుకున్న చెదలాంటి వాళ్లు. 

వాళ్లు ఉస్మానియా వర్సిటీని ఉంచకూడదని, సామాన్యులెవరూ చదువుకోవద్దని కోరుకునే వాళ్లు” అని మండిపడ్డారు. 2034 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా ఎదగాలంటే విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. చదువు ఒక్కటే ఈ సమాజాన్ని మార్చగలదన్నారు. ‘‘జనం గొర్రెలు, చేపలు పెంచుకోవాలి.. రాజ్యాలు ఏలడం దొరలకే సొంతమనే ఫిలాసఫీతో వారు ఉన్నారు” అని బీఆర్​ఎస్​ నేతలపై మండిపడ్డారు. తాను వారిలా కాదని, తెలంగాణ పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలని కోరుకునేవాడినని ఆయన చెప్పారు.

పరిశోధనలకు వేదికలు కావాలి

యూనివర్సిటీలు చదువులకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనలకు వేదిక కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సైద్ధాంతిక పరమైన భిన్నాభిప్రాయాలపై చర్చలు జరగాలన్నారు. వర్సిటీల్లో సిద్ధాంతపరమైన పోరాటాలు, సామాజిక చైతన్య ఉద్యమాలు లేని కారణంగా చిన్న చిన్న కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ సేవిస్తూ, వ్యసనాల బారిన పడేందుకు కారణమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకునే వయసులో ఇతర వ్యసనాలకు లోనైతే దారి తప్పుతామన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కరించేందుకు తాను ఓయూకు వచ్చానని, ఈ క్రమంలో ఈ పర్యటనను వ్యతిరేకించడంతో అభివృద్ధిని అడ్డుకున్న వారవుతారని ఆయన తెలిపారు.

ఆరు నెలల్లో 40వేల ఉద్యోగాల భర్తీ

అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం చెప్పారు. టీచర్ల రిక్రూట్మెంట్ ను 55 రోజుల్లోనే పూర్తి చేసి, 11వేల మంది ఉపాధ్యాయులను నియమించామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో రిక్రూట్మెంట్ ప్రక్రియను కాస్త ఆపామని చెప్పారు.  వచ్చే ఆరునెలల్లో మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన  స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన రెండున్నరేండ్ల కాలం నాటికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే నిర్ణయించినట్టు వివరించారు. ప్రైవేటురంగంలో వేల కోట్ల పెట్టుబడులను తేవడంతో పాటు, లక్షన్నర ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో కల్పించామని ఆయన పేర్కొన్నారు. 

15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీగా కోదండరాం

ప్రజల సమస్యలను ప్రస్తావించేవారు చట్టసభల్లో ఉండాలనే ఉద్దేశంతోనే ప్రొఫెసర్​ కోదండరాంను ఎమ్మెల్సీగా చేశామని, కానీ కొందరు కుట్రపూరితంగా సుప్రీంకోర్టుకు వెళ్లి ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయించారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ‘‘ఇదేం పైశాచికానందం? మీ ఇంటిల్లిపాది మంత్రులు కావొచ్చు.. ఎమ్మెల్యేలు  కావొచ్చు, ఎమ్మెల్సీలు కావొచ్చు, ఎంపీలు కావొచ్చు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్‌‌గా పనిచేసిన ప్రొఫెసర్​ కోదండరాం మాత్రం ఎమ్మెల్సీగా ఉండకూడదా?” అని బీఆర్​ఎస్​ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాంను 15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీగా పంపుతామని, ఎవరు అడ్డువస్తారో చూద్దామని అన్నారు.  

పదేండ్లు నిర్లక్ష్యం: మంత్రి లక్ష్మణ్ 

గత పదేండ్లు యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే వర్సిటీల అభివృద్ధికి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర కీలకమని గుర్తుచేశారు. విద్యార్థులకు కేవలం డిగ్రీలే కాకుండా ప్రపంచస్థాయి పోటీలో నిలిపేందుకు స్కిల్ డెవలప్​మెంట్ అవసరమని ఆయన అన్నారు. 

ఓయూకు వందకోట్లు ఇవ్వండి: వీసీ కుమార్ 

ఉస్మానియా యూనివర్సిటీలో 20 ఏండ్ల తర్వాత ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఓయూ వీసీ కుమార్ అన్నారు. ఎన్ఐఆర్ఎఫ్  ర్యాంకింగ్​లో  20లోపు, క్యూఎస్ ర్యాకింగ్​లో వెయ్యిలోపు ఓయూ ఉండేలా లక్ష్యంగా పెట్టుకున్నా మని వివరించారు. 108 ఏండ్లున్న వర్సిటీలో పురాతనమైన భవనాలున్నాయని, కొత్త భవనాలకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. వర్సిటీలో పోస్టులను త్వరగా భర్తీ చేయాలని, ఓయూ పీహెచ్​సీలో నలుగురు రెగ్యులర్ డాక్టర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. 

వర్సిటీకీ స్పెషల్ గ్రాంట్స్ కింద వందకోట్లు ఇవ్వాలని వీసీ కోరారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,  ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్​, విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, రిజిస్ట్రర్ నరేష్ రెడ్డి, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.   

ఈసారి ఆర్ట్స్​ కాలేజీ ముందు సభ పెట్టుకుందం

ఈ  ఏడాది ఇప్పటికే  విద్యారంగానికి  రూ. 40 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం రూ. 20 వేల కోట్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ. 500 కోట్లు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్ కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. అలాంటిది.. రాష్ట్ర సాధనలో ముందు భాగంలో నిలబడిన ఉస్మానియా యూనివర్సిటీకి ఏం కావాలన్నే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 

మహిళా యూనివర్సిటీకి రూ. 500 కోట్లు ఇచ్చామని, మరి ఓయూకి ఏమిచ్చినా తక్కువేనని చెప్పారు. డిసెంబర్​లో మళ్లీ ఓయూకు వస్తానని, ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా సభ పెట్టాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. అక్కడే నిధులు మంజూరు చేసి, జీవోలిస్తానమని హామీనిచ్చారు. ఆ రోజు క్యాంపస్​లో ఒక్క పోలీసును కూడా పెట్టొద్దని, ఇది ప్రజార ప్రభుత్వమని, ఎవరైనా నిరసన తెలిపేవాళ్లు ఉంటే స్వేచ్ఛగా తెలుపొచ్చని ఆయన అన్నారు.