- నేతన్నకు రుణమాఫీ
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన
- స్వయం సంఘాలకు రెండేసి చేనేత చీరలు
- కోటీ 30 లక్షల చీరలు నేసే పని కల్పిస్తం
- ఐఐహెచ్టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
- తెలుగు అకాడమీలో ఇవాళ్టి నుంచే అడ్మిషన్లు
- ఫ్యూచర్ సిటీలో పర్మినెంట్ బిల్డింగ్ నిర్మిస్తం
- ప్రతి విద్యార్థికీ నెల నెలా రూ. 2,500 స్టైఫండ్
- వీలైనంత త్వరగా చేనేత సంఘాల ఎన్నికలు
హైదరాబాద్: చేనేత కార్మికులకు సంబంధించిన రూ. 30 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. చేనేత కార్మికులకు పని కల్పించేందుకు రాష్ట్రంలోని స్వయం సహాయ సంఘాల్లోని 63 లక్షల మంది మహిళలకు ఏటా రెండేసి చేనేత చీరలను ఇవ్వనుందని చెప్పారు. త్వరలోనే పనులు అప్పగిస్తామని సీఎం చెప్పారు. ఇవాళ నాంపల్లిలోని లలితకళా తోరణంలో సీఎం రేవంత్ రెడ్డి ఐఐహెచ్టీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఆయన పేరుతోనే ఐఐహెచ్టీ(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ) నెలకొల్పుతున్నట్టు చెప్పారు.
ఈ విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్లను ప్రారంభిస్తున్నామని, తాత్కాలికంఆ నాంపల్లిలోని తెలుగు అకాడమీలో క్లాసులు ప్రారంభమవుతాయని అన్నారు. ప్రతి విద్యార్థికీ రూ. 2,500 స్టైఫండ్ ఇస్తామని వివరించారు. తర్వాత ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక హంగులతో ఇనిస్టిట్యూట్ భవనం నిర్మించి అక్కడికి షిప్ట్ చేస్తామని తెలిపారు. గత పాలకులు ఐఐహెచ్టీని విస్మరించారని అన్నారు. తాను డిప్యూటీ సీఎం వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను రిక్వెస్ట్ చేసి ఐఐహెచ్టీని మంజూరు చేయించామని వివరించారు.
చాలా మంది విద్యార్థులు డిగ్రీ సర్టిఫికేట్లు తీసుకొని బయటికి వస్తున్నా.. సాంకేతిక నైపుణ్యం లేక పోవడం వల్ల ఉపాధి అవకాశాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేనేతల విషయంలో ప్రచార ఆర్భాటం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. సినీ తళుకు బెళుకులతో ఆర్భాటం చేసినా చేనేత కార్మికుల జీవితాల్లో మార్పులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సంఘాలను వీలైనంత త్వరగా నిర్వహించాలని అధికారులను ఈ వేదిక నుంచే ఆదేశిస్తునట్టు సీఎం తెలిపారు. ప్రజా ప్రభుత్వం కులవృత్తులకు సముచిత గౌరవం ఇస్తుందని అన్నారు.. రైతన్న అన్నం పెడితే... నేతన్న ఆత్మగౌరవం ఇస్తారని సీఎం అన్నారు. రైతన్న ఎంత ముఖ్యమో.. నేతన్న కూడా అంతే ముఖ్యమని, నేతన్నల సమస్యలు పరిష్కరించేందుకు మీకు అందుబాటులో ఉంటానని సీఎం చెప్పారు.