
హైదరాబాద్: పెట్టుబడిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇన్వెస్టర్ల పెట్టుబడులకు కూడా భద్రత కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. పెట్టుబడిదారులు లాభాలు పొందేలా కూడా మా ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. ఇన్వెస్టర్లు ప్రభుత్వంతో తమ అనుభవాలను పంచుకోవాలని కోరారు. శుక్రవారం (ఆగస్ట్ 15) హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచ దిగ్గజ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలో పారదర్శకత ఉండాలన్నారు.
రాజీవ్ గాంధీ హయాంలోనే దేశంలో ఐటీ అభివృద్ధి జరిగిందని అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి కొనసాగుతోందని.. ఐటీ డెవలప్మెంట్పై కొందరు అపోహలు సృష్టించే అవకాశం ఉందని.. ఆ అపోహలను మీరు నమ్మెద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ వచ్చేందుకు పలు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. మా పాలసీలు అందరినీ సంతృప్తి పరచకపోవచ్చన్నారు. నాది మధ్య తరగతి మనస్తత్వమని.. పెట్టుబడిదారుడిని కాదని అన్నారు. ప్రజల సంపద కొల్లగొట్టే వ్యక్తిని కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో హైదరాబాద్ లో మెట్రో విస్తరించి ఉంటే.. ఇవాళ ట్రాఫిక్ సమస్య కొంతైనా తీరేదని అన్నారు.