సీఎం పర్యటనతో జోష్..నర్మెట్టలో అట్టహాసంగా పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం

సీఎం పర్యటనతో జోష్..నర్మెట్టలో అట్టహాసంగా పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం

సిద్దిపేట, వెలుగు:  సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన ఉత్సాహంగా సాగింది. ఆదివారం నర్మెట్టలో రూ.300 కోట్లతో నిర్మించిన పామాయిల్​ ఫ్యాక్టరీని మంత్రులు వివేక్​ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, దామోదర రాజనర్సింహతో కలిసి ప్రారంభించారు. నర్మెట్టకు చేరుకున్న సీఎంకు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. 

పామాయిల్​ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం ఫ్యాక్టరీ ఆవరణలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 40 నిమిషాల పాటు బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం తన ప్రసంగంలో రాజకీయాల జోలికి వెళ్లకుండా రైతులు, మహిళలు, యువతకు సంబంధించిన విషయాలనే ప్రస్తావించారు. చివరలో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని బంపర్  ఆఫర్  ఇచ్చారు.

ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు

నర్మెట్టలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. సిద్దిపేట మున్సిపాలిటీలో రూ.141.34 కోట్ల యుఐడీఎఫ్  నిధులతో నీటి సరఫరా ప్రాజెక్టులు, భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టుకు శంకుస్థాపన, సిద్దిపేట అర్బన్  మండలం ఎన్సన్ పల్లి గ్రామంలో రూ.78 కోట్లతో కొత్తగా నిర్మించిన జిల్లా జైలు భవనాన్ని ప్రారంభించారు. 

సిద్దిపేట అర్బన్  మండలం ఎన్సాన్ పల్లిలో రూ.15 కోట్లతో  నిర్మించిన 50 పడకల సమీకృత ఆయుష్  ఆసుపత్రి, రూ.3.60 కోట్లతో ఎన్సాన్ పల్లిలో నిర్మించిన సెంట్రల్ మెడిసిన్  స్టోర్, నంగునూరు మండలం గట్ల మల్యాలలో రూ.1.43 కోట్లతో నిర్మించిన పీహెచ్​సీ బిల్డింగ్, సిద్దిపేట పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో రూ.1.43 కోట్లతో నిర్మించిన యూపీహెచ్​సీ బిల్డింగ్, జగదేవ్ పూర్ లో రూ.9.65 కోట్లతో నిర్మించిన ఐవోసీని సీఎం ప్రారంభించారు. గజ్వేల్  నియోజకవర్గం కొండపాకలో రూ.200 కోట్లతో ఏర్పాటు చేస్తున్న యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  స్కూల్ కు, మర్కుక్ లో రూ.16.62 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో మౌలిక సదుపాయాలు, అదనపు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.

అడుగడుగునా పోలీసు బందోబస్తు

నర్మెట్టలో పామాయిల్​ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి రావడంతో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముండ్రాయి చౌరస్తా నుంచి నర్మెట్ట గ్రామం వరకు రోడ్డు పొడవునా పోలీసులు పహారా కాశారు. సభకు వెళ్లే వారిని క్షుణ్ణంగా తనఖీ చేశారు. సభలో ఎలాంటి అల్లర్లకు ఆస్కారం లేకుండా ముందస్తు పాస్ లను జారీ చేసి, పాస్​లు ఉన్నవారిని మాత్రమే సభకు అనుమతించారు. పామాయిల్​ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి పక్క జిల్లాల నుంచి రైతులు తరలివచ్చారు.