
- దొర పన్నిన కుట్రలో అక్కలు చిక్కుకుండ్రు
- సొంత అక్కల్లా భావిస్తే నడిబజార్లో నిలబెట్టిండ్రు
- ఒక అక్క కోసం ప్రచారానికి వెళ్తే కేసులు పెట్టిండ్రు
- సీతక్క మీద వచ్చిన మీమ్స్ చూస్తే చెప్పుతో కొట్టాలె
- దళితుల కల సాకారమైతే చూడబుద్ది కావడం లేదు
- దళిత స్పీకర్ ముందు కింద కూర్చోలేక కేసీఆర్ సభకు రాలేదు
- స్కిల్ వర్సిటీ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం
హైదరాబాద్: సొంత చెల్లి తీహార్ జైల్లో ఉంటే ఆమెను బయటికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించని వాళ్లు ఇవాళ సభలో రాజకీయాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు. దొరపన్నిన కుట్రలో అక్కలు చిక్కుకొని బయటికి రాలేకపోతున్నారని అన్నారు. ఇద్దరిని సొంత అక్కల్లా భావిస్తే ఒకరు తనను నడి బజార్లో నిలబెట్టారని, మరొకరి కోసం ప్రచారానికి వెళ్తే తనపై కేసులు పెట్టించారని సీఎం గుర్తు చేశారు.
అక్కల క్షేమం కోరే చెబుతున్నానని, వాళ్ల ఉచ్చులో పడొద్దని సీఎం అన్నారు. ‘ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులతో వాదించేలా కృషి చేశాం.. దళిత బిడ్డలు సంతోషపడే రోజు వస్తే నిలబడాల్సిన అవసరం ఉంది.. కానీ ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేసి వెళ్లిపోయారు. అందుకే వాళ్ల నుంచి ఏమైనా ఆశిస్తే.. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే’అని సీఎం అన్నారు.
సీతక్కపై సోషల్ మీడియాలో అవమానించేలా మీమ్స్ పెడుతున్నారని సీఎం అన్నారు. అది ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్లు కాదా? అని సీఎం ప్రశ్నించారు. మంత్రి సీతక్కపై వచ్చిన మీమ్స్ చూస్తే చెప్పుతో కొట్టాలన్నారు.
17 కోర్సులతో స్కిల్ వర్సిటీ
ముచ్చర్లలో ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీలో 17 కోర్సులను ప్రవేశపెట్టబోతున్నామని సీఎం అన్నారు. స్కిల్స్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఏడాదికి రూ.50వేలు నామ మాత్రపు ఫీజుతో కోర్సుల శిక్షణ అందించనున్నామన్నారు. ఈ సంవత్సరం 6 కోర్సులకు రెండువేల మందికి అడ్మిషన్స్ కు అవకాశం ఇస్తున్నామని చెప్పారు.
భవిష్యత్ లో జిల్లాల్లోనూ కళాశాలలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. స్కిల్స్ యూనివర్సిటీపై ప్రధాన ప్రతిపక్ష నాయకులు సూచనలు ఇస్తే సంతోషించేవాళ్లమని, కానీ వారు సభకు రాలేదని, వచ్చిన వాళ్లు వాకౌట్ చేసి వెళ్లిపోవడం దురదృష్టకరమని అన్నారు.