కొడంగల్‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనం

కొడంగల్‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనం
  •     వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన
  •     స్థానికులు, నేతలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం

కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి గురువారం పర్యటించారు. దసరా సందర్భంగా నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఆయన.. ముందుగా పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి పట్టణంలోని తన నివాసానికి చేరుకున్న సీఎం.. స్థానికులు, నియోజకవర్గ ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన ‘ఆత్మీయ సమ్మేళనం’లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయనను కలుసుకునేందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఎంకు పుష్పగుచ్ఛాలు, శాలువాలు అందజేసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతిఒక్కరినీ సీఎం ఆప్యాయంగా పలకరిస్తూ, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వారి యోగక్షేమాలు, నియోజకవర్గ సమస్యలపై ఆయన ఆరా తీశారు.