పెద్దలపై కఠినంగా.. పేదలపై సానుభూతితో ఉండండి

పెద్దలపై కఠినంగా..  పేదలపై సానుభూతితో ఉండండి
  • కూల్చివేతల విషయంలో హైడ్రా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన 
  • అర్హులైన పేదలను ఆదుకుంటం  
  • మూసీ బాధితులకు అపార్ట్‌‌‌‌మెంట్లు నిర్మిస్తం 
  • మూసీ ప్రక్షాళనపై ప్రజలే నిర్ణయం చెప్పాలన్న సీఎం 
  • హైడ్రా పోలీస్ స్టేషన్, వాహనాలు ప్రారంభం

హైదరాబాద్ సిటీ, వెలుగు: కూల్చివేతల విషయంలో పెద్దలపై కఠినంగా వ్యవహరించాలని.. పేదలపై మానవీయ కోణంతో, సానుభూతితో వ్యవహరించాలని హైడ్రా అధికారులకు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి సూచించారు. అర్హులైన పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. హైదరాబాద్‌‌‌‌లో ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్, 122 హైడ్రా వాహనాలను సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ పరిరక్షణ కోసమే హైడ్రాను ఏర్పాటు చేశామని తెలిపారు. బెంగళూర్, ఢిల్లీ, ముంబై, చెన్నైలా హైదరాబాద్ మారకుండా ఉండాలంటే.. నగరంలోని చెరువులను, కుంటలను రక్షించుకోవాలని చెప్పారు.

 ‘‘బెంగుళూరులో చెరువులను పరిరక్షించకపోవడంతో తాగునీళ్లు కూడా దొర్కుతలేవు. 1800 ఫీట్ల మేరా బోర్లు వేసినా నీళ్లు పడ్తలేవు. ముంబై, చెన్నై వరదలతో సతమతమవుతున్నాయి. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రికపోవడంతో పార్లమెంట్ నుంచి పాఠశాలల వరకు సెలవులు ప్రకటిస్తున్న దుస్థితి చూస్తున్నాం. ప్రకృతిని కాపాడుకోకపోతే హైదరాబాద్‌‌‌‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అందుకే హైడ్రాను తీసుకొచ్చాం. చెరువులు ఆక్రమిస్తే ఎంతటివారినైనా హైడ్రా ఉపేక్షించదు” అని తెలిపారు. చెరువులను కాపాడుకోవాలని, అవి కనుమరుగైతే మనుగడ ఉండదని అన్నారు. ‘‘ఓఆర్ఆర్ పరిధిలో 940 చెరువులు ఉండగా, అందులో 491 ఆక్రమణకు గురయ్యాయి. చిన్న వర్షం పడితేనే నగరంలోని కాలనీలు మునిగిపోతున్నాయి. 1908లో వరదలు వచ్చి నగరం మునిగిపోయింది. అలాంటి పరిస్థితి మళ్లీ రావొద్దు” అని అన్నారు. 

కొందరు దొంగ నిద్రలు చేశారు.. 

మూసీ ప్రక్షాళనపై ఏం చేద్దామనేది ప్రజలే చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. త్వరలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు పర్యటిస్తామని, వాళ్లకు ప్రజల నిర్ణయమేంటో చెప్పాలన్నారు. మూసీ మురికికూపంగా మారడంతో దాని పొంట ఉన్న పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూసీలోని పేదలకు ఇండ్లు కేటాయించామని, ఇంకా అవసరమైతే మూసీకి సమీపంలోనే 5 కిలోమీటర్లకు ఒకచోట అపార్టమెంట్లు నిర్మించి ఇండ్లు అందిస్తామని ప్రకటించారు.

గుజరాత్‌‌‌‌లో సబర్మతి, యూపీలో గంగా, ఢిల్లీలో యమునా నదిని వాళ్లు ప్రక్షాళన చేసుకుంటున్నారు. కానీ మేం మూసీని పునరుద్ధరణ చేస్తామంటే అడ్డుకుంటున్నారు. వాళ్లు చేస్తే ఒప్పు అయినప్పుడు, మేం చేస్తే తప్పు ఎలా అవుతుంది? నాపై కక్ష ఉంటే నాపై చూపండి. కానీ ప్రజలకు మేలు జరిగే పనులను అడ్డుకోవద్దు. మూసీ నది వెంట కొందరు దొంగ నిద్రలు చేశారు. మూడంతస్తుల మేడల్లో నిద్ర చేశారు. మూసీకి పక్కన నిద్ర చేస్తే పేదల బాధ వాళ్లకు తెలిసేది” అని బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు. 

రియల్ ఎస్టేట్ పడిపోతున్నదని దుష్ప్రచారం..  

నగరంలో ఆక్రమణలు తొలగిస్తుంటే రియల్ ఎస్టేట్ పడిపోతున్నదని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వాళ్లు కడుపునిండా విషం నింపుకుని ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లనివ్వకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘కొందరు రోడ్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. మరికొందరు చెరువులను ఆక్రమించారు. అవన్నీ అట్లనే వదిలేద్దామా? ఆ ఆక్రమణలను తొలగించవద్దా? హైడ్రా ద్వారా చెరువులను కాపాడుతున్నాం. చెరువులను, నాలాలను, మూసీని ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే కోపం. అలాంటి కొంతమంది మా నిర్ణయాలను వ్యతిరేకించినా.. ప్రజల కోసం మేం వెనక్కి తగ్గేదిలేదు” అని స్పష్టం చేశారు.

హైడ్రా అంటే కూల్చివేతలు కాదు 

హైడ్రా అంటే ఇండ్లు కూల్చేది అన్నట్టుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైడ్రా అంటే ప్రభుత్వ, ప్రజల ఆస్తులను రక్షించేదని చెప్పారు. ‘‘చిన్న వర్షం వచ్చినా నగరంలో కాలనీలు మునిగిపోతున్నాయి. పేదల కాలనీలకు వెళ్లే దారులను పెద్దలు ఆక్రమిస్తున్నారు. కబ్జాకు గురైన చెరువులు, నాలాలు, కాలనీల రోడ్లను హైడ్రా రక్షిస్తోంది. వానొస్తే రోడ్లపై కూలిన చెట్లను హైడ్రా నిమిషాల్లోనే తొలగిస్తోంది. గండిపేట్, ఉస్మాన్ సాగర్  చెరువుల పక్కన కొందరు ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లు, గెస్ట్‌‌‌‌హౌస్‌‌‌‌లు నిర్మించుకున్నారు. 

వాటి నుంచి వ్యర్ధాలు, మురుగునీటిని చెరువుల్లోకి వదులుతున్నారు. వరద నీరు ప్రవహించాల్సిన నాలాలపై ఇండ్లు, అపార్టుమెంట్లు వెలిశాయి. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు.. రోడ్డుపై నీరు నిలవకుండా, విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా, వర్షాలు పడిన సమయంలో ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యతలనూ హైడ్రా చూస్తున్నది” అని తెలిపారు. ‘‘ఒకాయన జన్వాడలో ఫామ్‌‌‌‌హౌస్ కట్టుకున్నారు. మరొకాయన ఎర్రవల్లి ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో ఉండి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నాపై కక్ష ఉంటే నాపైనే చూపండి.. ప్రజలకు మేలు జరిగే పనులను అడ్డుకోవద్దు” అని కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి అన్నారు.