
- పథకం ప్రకారం రిజర్వేషన్లను అడ్డుకుంటున్నరు: సీఎం రేవంత్‌రెడ్డి
- రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ రాకుండా మోదీ, అమిత్ షా కుట్ర
- వెనుకబడిన ముస్లింలకు చట్టంలోనే రిజర్వేషన్లు ఉన్నాయి
- కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి చట్టాలపై అవగాహన లేదు
- సెక్రటేరియెట్‌కు కిషన్‌రెడ్డి వస్తే బీసీ అధికారులతో మీటింగ్ పెట్టి లెక్కలు చెప్తం
- మేం రిజర్వేషన్ బిల్లుల్లో ఎక్కడా కుల, మతాల గురించి రాయలే
- ఎన్ బ్లాక్‌గా రిజర్వేషన్లు అమలవుతాయి
- బీజేపీతో అంటకాగుతూ బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తున్నది
- క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీలకు గుణపాఠం తప్పదు
- సెప్టెంబర్ 30 లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేది మా లక్ష్యం
- ఎలా ముందుకెళ్లాలనే దానిపై పీఏసీ భేటీలో నిర్ణయిస్తామని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: బీసీ రిజర్వేషన్ల పెంపును బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పథకం ప్రకారం అడ్డుకుంటున్నారని.. వాళ్లు బీసీ ద్రోహులని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఆ రెండు పార్టీలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ‘‘మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా అప్పట్లో బీఆర్ఎస్ చట్టం తెచ్చి బీసీలను ముంచింది. ఇప్పుడు మేం బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే బీఆర్ఎస్, బీజేపీ కనీసం నైతిక మద్దతు తెలుపకుండా అడ్డుపడ్తున్నాయి. బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగుతూ, శిఖండిలా వ్యవహరిస్తూ విధ్వంసకర పాత్ర పోషిస్తున్నది” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘తాత్కాలికంగా వాళ్లు విజయం సాధించామని అనుకోవచ్చు.. కానీ, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వాయిదా వేస్తే భవిష్యత్తులో వాళ్లనే దహిస్తుంది’’ అని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇతర సమస్యలన్నింటికీ పరిష్కారం మోదీని కుర్చీ నుంచి దింపడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. గురువారం తన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలోనే కులగణన చేపట్టిందన్నారు. దాని ఆధారంగా బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు బిల్లులను శాసనసభలో ఆమోదించామని సీఎం గుర్తు చేశారు. అవి రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టం 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అడ్డువస్తుండటంతో తాము ఆర్డినెన్స్ చేసి గవర్నర్‌కు పంపితే.. దాన్ని రాష్ట్రపతికి గవర్నర్ పంపారని తెలిపారు. ‘‘ఆ బిల్లులను ఆమోదించాలని కోరేందుకు రాష్ట్రపతిని మేం పది రోజుల కిందట్నే అపాయింట్‌మెంట్ కోరాం. అయితే, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతిని కలిశారు. వారిద్దరి ఒత్తిడితోనే మాకు అపాయింట్‌మెంట్ లభించలేదని భావిస్తున్నం” అని అన్నారు.
తొలి నుంచి బీజేపీది బీసీ వ్యతిరేక వైఖరి
బీజేపీది తొలి నుంచి బీసీ వ్యతిరేక వైఖరేనని, మండల్ కమిషన్ సిఫార్సులను అడ్డుకునేందుకు కమండల్ యాత్రను చేపట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రధానిలో సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ‘యూత్ ఫర్ ఇక్వేషన్’ పేరుతో వాటిని అడ్డుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసిందని మండిపడ్డారు. అయినప్పటికీ నాటి మన్మోహన్ ప్రభుత్వం ఆ రిజర్వేషన్లు కల్పించిందన్నారు. ప్రస్తుతం ముస్లింల పేరు చెప్పి బీసీ రిజర్వేషన్ల పెంపును బీజేపీ అడ్డుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 1971 నుంచి నూర్‌బాషా, దూదేకుల తదితరులకు బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు. 2017లో రాజస్తాన్‌కు చెందిన అబ్దుల్ సత్తార్ అనే వ్యక్తి ఓబీసీ కోటాలో ఐఏఎస్‌కు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ‘‘నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చాం అని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు” అని ఆయన తెలిపారు.
పీఏసీలో చర్చించి కార్యాచరణ
42శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నామని, కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం లభించడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించుకునేందుకు మూడు రోజులుగా ఢిల్లీలో ప్రయత్నించామని, ఇందుకోసం రాష్ట్ర మంత్రులు కూడా ఢిల్లీలోనే ఉన్నారని తెలిపారు. వెంటనే బిల్లులను ఆమోదించాలని రాష్ట్రపతికి సీఎం విజ్ఞప్తి చేశారు. బిల్లుల ఆమోదం కోరుతూ జంతర్ మంతర్‌లో తాము చేసిన ధర్నాకు ఇండియా కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన 100 మంది ఎంపీలు హాజరై మద్దతుగా నిలిచారని తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఈ బిల్లులపై చర్చకు వాయిదా తీర్మానాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చుతున్నదని అన్నారు. సెప్టెంబర్ 30 లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేది తమ లక్ష్యమని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఇక ముందు ఏం చేయాలనే దానిపై తెలంగాణకు వెళ్లిన తర్వాత పొలిటికల్ అడ్వయిజర్ కమిటీ (పీఏసీ)తో భేటీ అవుతామన్నారు. మంత్రులు, పీఏసీతో చర్చించిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
కిషన్ రెడ్డీ.. చర్చిద్దాం రండి!
బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెట్టుకింద ప్లీడర్‌లా, గల్లీ లీడర్‌లా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘బీసీ రిజర్వేషన్ బిల్లుల్లో అసలు ముస్లింల ప్రస్తావన ఎక్కడుంది? అసలు ఆ బిల్లుల్లో ఏముందో చదివారా?’’ అని ఫైర్ అయ్యారు. ముస్లింలు దేశంలో పౌరులు కాదా? అని బీజేపీ నేతలను ఆయన నిలదీశారు. ‘‘వెనుకబాటు, సామాజిక, ఆర్థిక ఆధారాలపై రిజర్వేషన్లు ఉంటాయి. మతపరంగా రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించలేదు. మేం మతం పేరుతో ఎక్కడ రిజర్వేషన్లు కల్పించాం? మేం రిజర్వేషన్ బిల్లుల్లో ఎక్కడా కుల, మతాల గురించి రాయలేదు. బీసీలకు 42 శాతం ఎన్ బ్లాక్ గా రిజర్వేషన్లు కోరుతున్నాం’’ అని స్పష్టం చేశారు. ‘‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ చేస్తున్న..! మీరు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రిని హైదరాబాద్ తీసుకొని వస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అన్ని వివరాలు అందిస్తం. బీసీ రిజర్వేషన్లు ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన ప్లానింగ్ డిపార్ట్మెంట్, వన్ మ్యాన్ కమిషన్, బీసీ కమిషన్ తో సెక్రటేరియెట్‌లో అధికారిక మీటింగ్ పెడ్తం. అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పిస్తం. హైదరాబాద్‌కు రావడానికి టైం లేదంటే మీరే టైమ్ డిసైడ్ చేసి పిలిస్తే మేమే అధికారులతో కలిసి ఢిల్లీ వచ్చి అన్ని గణాంకాలు అందజేస్తం. ఇందుకు సిద్ధమేనా?” అని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. చట్టాలపై అవగాహన లేకుండా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుతున్నారని అన్నారు. ముస్లింలను బూచీగా చూపి రిజర్వేషన్లు అడ్డుకోవడం ఏమిటి అని ప్రశ్నించారు. ముస్లింలను రాష్ట్రపతులు, పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. ముస్లింలు సీఎంలు కావద్దనేలా కిషన్ రెడ్డి మాట్లాడడం సరికాదని తెలిపారు. ‘‘ముస్లింలను తొలగిస్తే రిజర్వేషన్లు పెంచుతామని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎలా తొలగిస్తారో.. ఎలా పెంచుతారో చేసి చూపాలి” అని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని సీఎం రేవంత్ మండిపడ్డారు. పది రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను, మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించిన బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించడం ఒక్క రోజు పని అని తెలిపారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనేది మా విధానం. 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వబోమనేదే మీ వాదన అయితే... ఆ పది శాతం తొలగించి బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించండి. దీనిపై పార్లమెంట్ లో బిల్లు పెడితే సాయంత్రానికి లోక్ సభలో, అర్ధరాత్రి వరకు రాజ్యసభలో ఆమోదం పొందుతుంది. అప్పుడు దేశవ్యాప్తంగా అదే అమలవుతుంది కదా?” అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో మోదీని ఓడించి.. కేంద్రంలో అధికారంలోకి వస్తామని ఆయన చెప్పారు.
బీసీ రిజర్వేషన్లకు రాహుల్, ఖర్గే మద్దతు
బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారని సీఎం రేవంత్ చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ వద్ద చేపట్టిన పోరుబాటకు ఖర్గే, రాహుల్ రాలేదని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదన్నారు. ‘‘రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇందిరాభవన్‌లో నాలుగు గంటల పాటు తెలంగాణ కుల సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపుపై సావధానంగా విన్నారు. వంద మంది ఎంపీలకు వివరించారు. ఈ విషయంలో తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని తలకటోరా స్టేడియంలో జాతీయస్థాయి సదస్సు పెట్టి వివరించాం. జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ అంత్యక్రియల్లో పాల్గొని, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు జార్ఖండ్‌కు రాహుల్ వెళ్లడం, అలాగే ఓ కేసు విషయమై కూడా అక్కడికి వెళ్లడంతో జంతర్ మంతర్ ధర్నాకు హాజరుకాలేకపోయారు. దీన్ని రాజకీయం చేయడం సరికాదు’’ అని సీఎం అన్నారు.