
- ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నరు
- ఆ కుట్రలను ఏచూరి స్ఫూర్తితో నిలువరిద్దామని పిలుపు
- రవీంద్రభారతిలో సీతారాం ఏచూరి సంస్మరణ సభకు హాజరు
హైదరాబాద్, వెలుగు: సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు జమిలి ఎన్నికల ముసుగులో బీజేపీ కుట్ర చేస్తున్నదని, దేశాన్ని కబళించాలని చూస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాల కలయికే దేశం అని రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించినా రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకోవాలని బీజేపీ చూస్తున్నదని దుయ్యబట్టారు. జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పారు. శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీపీఎం నేత సీతారాం ఏచూరి సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు.
విద్యాహక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ చట్టం వంటి ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పథకాలు, కార్యక్రమాలను రూపొందించడంలో సీతారాం ఏచూరి క్రియాశీలక పాత్రను పోషించారని తెలిపారు. జమిలి ఎన్నికల పేరిట బీజేపీ కుట్రలు చేస్తున్నదని, ఇలాంటి సమయంలో ఏచూరి లాంటి లీడర్ లేకపోవడం ప్రజాస్వామ్యానికి, లౌకికత్వానికి, అభ్యుదయవాదులకు తీరని నష్టమని ఆయన అన్నారు. బీజేపీ కుట్రలను సీతారాం ఏచూరి స్ఫూర్తితో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ‘‘దేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కలిగిస్తూ సమయం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ విధానాలను కూడా విభేదించిన వ్యక్తి ఏచూరి.
పేదలు, ప్రజాస్వామిక వాదులకు ప్రభుత్వ విధానాలు ఉపయోగపడాలని నిరంతరం పాటుపడిన వ్యక్తి. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించి, పేదల పక్షాన గళం విప్పిన సీతారాం ఏచూరి మృతి తీరని లోటు” అని ఆయన అన్నారు. ‘‘దేశ రాజకీయాల్లో ఒక దిక్సూచిలాగా వ్యవహరించిన సీతారాం ఏచూరి ముద్రలు యునైటెడ్ ఫ్రంట్ నుంచి తాజాగా ఇండియా టీమ్ వరకు ఉన్నాయి. కేరళలో కాంగ్రెస్ వర్సెస్ సీపీఎం పాలిటిక్స్ ఉన్నా.. జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్‌తోనే జతకట్టేలా విధాన నిర్ణయం తీసుకున్నారు” అని ఆయన తెలిపారు.
బతికున్నంతకాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన కొద్దిమందిలో ఏచూరి ఒకరని అన్నారు. తాను పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్నిసార్లు సీతారాం ఏచూరిని కలిశానని, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సీనియర్రాజకీయ నాయకుడు జైపాల్‌రెడ్డితో మాట్లాడినట్లుగానే అనిపించేదని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఏచూరిని ఒక ఫిలాసఫర్‌గా, గైడ్‌గా, ఫ్రెండ్‌గా , సిద్ధాంతకర్తగా రాహుల్‌గాంధీ భావించారని పేర్కొన్నారు.
ప్రధాని మౌనం మంచిది కాదు
లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్‌గాంధీపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ పరుష పదజాలంతో దూషిస్తే ప్రధాని నరేంద్ర మోదీ కనీసం స్పందించకపోవడం బీజేపీ ఫాసిస్టు విధానాలకు నిదర్శనమని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. బిట్టూను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ‘‘బిట్టూ వ్యాఖ్యలపై ప్రధాని మౌనంగా ఉండటం, మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయకపోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. ప్రధాని మోదీ మౌనం ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు.
భాషలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారాన్ని కాపాడుకోవాలనుకుంటున్న బీజేపీ విధానాలను ఏచూరి ఆలోచనలతో నిలువరించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తీసుకొస్తున్న రాజ్యాంగ సవరణలు దేశ భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారుతున్నాయని తెలిపారు. ‘‘జమిలి ఎన్నికల పేరుతో రాజ్యాంగ సవరణలు చేయడం పరిపాలనాపరమైన అంశానికి సంబంధించిన విషయం కాదు. రాష్ట్రాల కలయికే దేశం అని రాజ్యాంగం సృష్టంగా నిర్వచించినా.. సహకార సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కి జమిలి ఎన్నికల ముసుగులో రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకోవాలని బీజేపీ భావిస్తున్నది. దీనిపై పోరాటం చేయాలి” అని ఆయన అన్నారు.
ఉద్యమాల బిడ్డలతో మాది రక్తసంబంధమే: కేటీఆర్
ప్రజా ఉద్యమాలు చేసే బిడ్డలతో తమది రక్త సంబంధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజ్యాంగం అపహాస్యమైన ప్రతిసారి సీతారాం ఏచూరి స్ఫూర్తితో ప్రశ్నిస్తూనే ఉందామని తెలిపారు. ప్రజా హక్కుల కోసం చేతనైనంత వరకు పోరాడుదామన్నారు. ప్రశ్నించే గొంతుకలకు అండగా నిలబడుదామని, అదే మనందరం ఏచూరికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే నివాళి అని చెప్పారు. ‘‘ఓట్ల రాజకీయం వేరు. ప్రజల రాజకీయం వేరు.. తాము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం పోరాటంలో మాత్రం ముందున్నామని, ప్రజల మనసుల్లో ఉన్నామని ఏచూరి చెప్పేవారు” అని కేటీఆర్ తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పల్లా రాజేశ్వర్‌డ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా తదితరులు పాల్గొన్నారు. వారంతా సీతారాం ఏచూరి సేవలను గుర్తుచేసుకున్నారు.
ఫెడరలిజంపై బీజేపీ దాడి: బీవీ రాఘవులు
దేశంలోని ప్రతిపక్ష పార్టీల మధ్య ఎన్ని తేడాలున్నా, విభేదాలున్నా ఆమోదయోగ్యమైన విషయాలపై కలిసి పనిచేయాలంటూ వాటిని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత సీతారాం ఏచూరికి దక్కుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. దేశానికి ప్రజాస్వామ్యం ఎంతో అవసరమని, దానికి బీజేపీ పాలనలో ప్రమాదం వచ్చిందని, లౌకిక వ్యవస్థకు భంగం కలుగుతున్నదని చెప్పారు. 1947 నుంచి ఇప్పటి వరకు ఐక్యంగా ఉన్న భారత్‌ను విచ్ఛిన్నం చేయాలని కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఫెడరలిజంపై బీజేపీ దాడి చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ఏచూరి ఆశయాలకు పునరంకితం కావాలని, ఆ దిశగా ముందుకు సాగాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
ఏచూరికి గొప్ప అభిమానిగా మారిపోయా: కూనంనేని
సీతారాం ఏచూరికి తాను తెలియకుండానే గొప్ప అభిమానిగా మారిపోయానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఏచూరి మరణం కమ్యూనిస్టులనే కాకుండా దేశ రాజకీయ రంగాన్ని కుదిపిందని ఆయన అన్నారు. దేశ రాజకీయాల్లో సీతారాం ఏచూరి పాత్ర కీలకమైం దని టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు.