హైదరాబాద్: 25 ఏళ్ల కింద క్రీడల్లో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలిచింది.. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ తీరు వల్ల యువత డ్రగ్స్, గంజాయికి అలవాటు పడుతున్నారని అన్నారు. - ఎల్బీ స్టేడియంలో జరిగిన సీఎం కప్ లోగో, మస్కట్ లాంచింగ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా - సీఎం కప్ మస్కట్, లోగోని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో క్రీడకారులను నిర్లక్ష్యం చేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు ఇచ్చి గౌరవించామన్నారు. టీ 20 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడు, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సిరాజ్‌కు ఇంటర్ చదివిన డీఎస్సీ ఉద్యోగం ఇచ్చామని.. ప్రపంచ వేదికల్లో సత్తా చాటిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు నిబంధనలు సవరించి పోలీసు శాఖలో ఉద్యోగం ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ALSO READ | కేటీఆర్, హరీశ్ ఫాంహౌస్ మురికినీళ్లు.. పేదలు తాగాలా : సీఎం రేవంత్ రెడ్డి
‘‘ఇదే ఎల్బీ స్టేడియంలో వేలాది మంది అభిమానుల మధ్య నేను ప్రమాణస్వీకారం చేశాను. నాపై అప్పుడు ఎలాంటి అభిమానం చుపించారో.. ఇప్పుడు అదే అభిమానం చూపించడం సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో తెలంగాణ ని స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తాం. గతంలో జాతీయ, అంతర్జాతీయ పోటీలు జరిగేవి.. కానీ తెలంగాణ ఏర్పడ్డాక గత పదేళ్లలో క్రీడావ్యవస్థ దిగజారిపోయింది. చిన్నారులు మత్తు ముందుకు బానిసలు అవుతున్నారు.
టాలెంట్ ఉన్నవాళ్లు ప్రతి గ్రామంలో ఉన్నారు.. వాళ్ళకి సరైన ప్రోత్సహం మేము అందిస్తాం. హైదరాబాద్ ఫుట్ బాల్కి తిరిగి పూర్వవైభం తీసుకొస్తాం. అండర్ -17 నేషనల్ ఫుట్ బాల్ టీమ్‌ని రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకుంటుంది.. వాళ్ళని అంతర్జాతీయ ప్లేయర్లుగా తీర్చిదిద్దుతాం. తెలంగాణలో త్వరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మించబోతున్నాం. కులమతాలకు అతీతంగా ఉండేవే క్రీడలు, క్రీడామైదానాలు.
అందుకె పాడైపోయిన స్టేడియాలను సరికొత్తగా రేనోవేషన్ చేస్తున్నాం. త్వరలోనే ఎల్బీ స్టేడియాన్ని రేనోవేషన్ చేస్తాం. యువత మత్తు జోలికి పోకుండా.. క్రీడల్లోకి రావాలని కోరుతున్నా’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత అనుభవాలను ప్లేయర్లతో పంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. కష్టపడితే ఏదైనా సాధించొచ్చని ఆటగాళ్లకు సూచించారు. ఇందుకు తాను, ప్రధాని మోడీనే నిదర్శమని వ్యాఖ్యానించారు.