
- డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం అందరూ సహకరించాలి
- స్కూళ్లు, కాలేజీల్లో గంజాయి కనిపిస్తే యాజమాన్యాలపైనా కేసులు తప్పవు
- వ్యసనాలకు బానిసలు కావొద్దని యువతకు సూచన
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, యువత భవిష్యత్తును కాపాడాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘డ్రగ్స్ నిర్మూలన ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటం. రాష్ట్ర సరిహద్దుల గుండా డ్రగ్స్ రాకుండా చూస్తం. అవసరమైతే సరిహద్దులు దాటి వెళ్లి డ్రగ్స్ స్మగ్లర్ల వెన్ను విరుస్తం” అని హెచ్చరించారు. ‘ఈగల్’ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్) అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ఈ టీమ్ డ్రోన్ల ద్వారా గంజాయి సాగును గుర్తించడంతోపాటు, రాష్ట్రంలోని 1.5 కోట్ల ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడ గంజాయి మొక్క మొలిచినా కనిపెడుతుందని తెలిపారు. గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటుచేసిన సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. సదస్సులో సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు.
స్టూడెంట్ల ప్రవర్తనపై ఫోకస్ పెట్టాలి
గంజాయి, డ్రగ్స్ విషయంలో స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సంస్థల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల ప్రవర్తనను పర్యవేక్షించడానికి చైల్డ్ సైకాలజీపై అవగాహన ఉన్న నిపుణులను నియమించుకోవాలని సూచించారు. స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి బాధ్యతలను గుర్తుచేయాలని సీఎస్, కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కిరాణా షాపుల్లోనూ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారని, ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ‘‘స్టూడెంట్లకు కూడా నేను సూచన చేస్తున్నా.. మీ స్కూల్, మీ కాలేజీల ముందు కిరాణాషాపుల్లో కానీ, ఎక్కడైనా కానీ గంజాయిలాంటి మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారాన్ని అందించండి” అని సూచించారు. స్కూల్, కాలేజీ ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే ఆయా యాజమాన్యాలపైనా కేసులు పెట్టాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
‘‘పిల్లల్ని పర్యవేక్షించకుండా, బాధ్యత తీసుకోకుండా వ్యవహరిస్తే ఊరుకోం. ఫీజులు తీసుకుంటాం గాని బాధ్యత తీసుకోం అంటే కుదరదు. కచ్చితంగా ఆ స్కూలు, ఆ కాలేజీ యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలి. మీరు ఎట్లయితే సైన్స్, మాథమెటిక్స్, ఇంగ్లిష్ చెప్పడానికి టీచర్లను పెట్టుకుంటున్నారో పిల్లల బిహేవియర్ ఛేంజెస్ ని కూడా గమనించడానికి చైల్డ్ సైకాలజీపై అవగాహన ఉన్న వాళ్లను నియమించుకోండి” అని ఆయన చెప్పారు.
కష్టం, కమిట్మెంట్తోనే రాణింపు
చిరంజీవి, విజయ్ దేవరకొండ లాంటివారు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కఠోర శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ రామ్‌చరణ్ చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగారని ఆయన అన్నారు. వారి జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ‘‘కష్టాలను, అవమానాలను ఎదుర్కొని నిటారుగా నిలబడాలి. వ్యసనాలకు బానిసలు కాకూడదు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలి’’ అని స్టూడెంట్లకు సీఎం సూచించారు.
ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం మన భారతదేశమని, 15 నుంచి 40 ఏండ్ల లోపు వాళ్లు 68% ఉన్నారని.. కానీ, ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించకపోవడం ఆవేదన కలిగిస్తున్నదన్నారు. అందుకే తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించిన వారికి భవిష్యత్తులో రాజ కీయాల్లోనూ ప్రత్యేక కోటా ఉంటుందన్నారు.
రాష్ట్రం లోని యువతకు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ‘‘నల్లమల నుంచి వచ్చిన నేను జెడ్పీటీసీ స్థాయి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా. నాలాగే విజయ్ దేవరకొండ కూడా నల్లమల నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగారు” అని సీఎం రేవంత్ అన్నారు. కష్టం, కమిట్‌మెంట్ తో ముందుకు వెళ్తేనే రాణించగలమని స్టూడెంట్లకు ఆయన సూచించారు.
సీఎం రేవంత్.. ఒక ఐకాన్: విశ్వేశ్వర్ రెడ్డి
డ్రగ్స్ నియంత్రణతోనే దేశం ముందుకువెళ్తుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘‘విద్యార్థులందరూ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి. స్నేహితులకు డ్రగ్స్ అలవాటు ఉంటే అలా చేయొద్దని చెప్పాలి. సీఎం రేవంత్‌రెడ్డి సిగరేట్, మందు తాగరు.. ఆయన ఒక ఐకాన్. ఫుట్‌బాల్, సాకర్ ఆడతారు” అని పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయని ఆయన తెలిపారు.
ఈగల్‌ను చూసి నేర్చుకోండి
‘‘ఒకప్పుడు ఉద్యమాలకు వేదికైన తెలంగాణ గడ్డ ఇప్పుడు గంజాయి, డ్రగ్స్‌కు వేదికగా మారడం అవమానకరం. 2023 డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వెన్ను విరుస్తం అని స్పష్టం చేశాం” అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గంజాయి, డ్రగ్స్ కట్టడికి ‘ఈగల్’ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్) అనే టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ టీమ్ డ్రోన్ల ద్వారా గంజాయి సాగు కనిపెడ్తుందన్నారు.
‘‘ఈగల్ (గద్ద) 20 వేల నుంచి 30వేల అడుగులపైన ఉండి కూడా కింద నేల మీద ఉన్న తన టార్గెట్ ను నిశితమైన దృష్టితోని చూస్తుంది. ఈగల్ సక్సెస్ రేషియో 100%. టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ ను చూసే నేర్చుకోవాలి. అందుకే గంజాయి, డ్రగ్స్ కట్టడికి ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం” అని సీఎం వివరించారు.
పిల్లలకు చాక్లెట్లు కొనివ్వాలన్నా భయమే: రామ్ చరణ్
ప్రజెంట్ జనరేషన్ లో పిల్లలకు చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు కొనివ్వాలంటే కూడా భయపడే పరిస్థితి ఉందని సినీ నటుడు రామ్ చరణ్ అన్నారు. ‘‘ఒక తండ్రిగా రాష్ట్రం గురించి, సిటీ గురించి, స్కూల్స్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. రేపు పిల్లలను బయటకు పంపించాలంటే ఇవన్నీ ఆలోచించాల్సి ఉంటుంది. గతంలో స్కూల్స్ బయట చిన్నపిల్లలకు డ్రగ్స్ ఇస్తున్నారనే వార్త విని చాలా బాధపడ్డా. వ్యవస్థలోని చెత్తను శుభ్రం చేసేందుకు ప్రభుత్వానికి అందరూ సహకరించాలి. ‘రైజింగ్ తెలంగాణ’ పేరుతో ఇంత అద్భుతమైన అవగాహన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు” అని ఆయన తెలిపారు. తాను కూడా చిన్నప్పుడు స్కూల్ లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలకు వెళ్లేవాడినని గుర్తుచేసుకున్నారు.
తలదించుకునే పనిచేయొద్దు: విజయ్ దేవరకొండ
డ్రగ్స్ మాట ఎత్తే ఫ్రెండ్స్‌కు దూరంగా ఉండాలని స్టూడెంట్లకు సినీ నటుడు విజయ్ దేవరకొండ సూచించారు. ‘‘నా బాధ్యతగా ఇక్కడికి వచ్చాను. నేను, నా చుట్టూ ఉన్న వారు డ్రగ్స్ తీసుకోకుండా చూసే బాధ్యత నాది. లైఫ్‌లో తల్లిదండ్రులను సంతోషపెట్టడం కంటే గొప్ప అచీవ్‌మెంట్ ఇంకోటి లేదు. ఎప్పుడూ వారు తలదించుకునే పని మనం చేయకూడదు. సమాజంలో డ్రగ్స్ తీసుకునే వారిని చిన్నచూపు చూస్తారు.. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం మనకు అవసరమా? మనతో పాటు మన పేరెంట్స్‌ను కూడా సమాజం దోషుల్లా చూస్తుంది. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువతను కోరుతున్నా. మనం, మన స్టేట్, మన దేశం ప్రపంచంలో నంబర్ వన్‌గా ఉండాలి”అని పేర్కొన్నారు.