జహీరాబాద్​కు సీఎం వరాలు .. రూ. 500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

జహీరాబాద్​కు సీఎం వరాలు .. రూ. 500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
  • చెరుకు రైతులకు చక్కెర ఫ్యాక్టరీ 
  • బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టుల పునరుద్ధరణ
  • జహీరాబాద్​ మున్సిపాలిటీకి రూ.100 కోట్లు
  • హజ్ హౌజ్, షాదీఖాన, అంతర్గత రోడ్లకు రూ.72 కోట్లు

సంగారెడ్డి/జహీరాబాద్​/ఝరాసంగం, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి శుక్రవారం జహీరాబాద్​నియోజవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. హుగ్గెల్లి చౌరస్తా వద్ద మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ, ఝరాసంగం మండలం మాచునూర్​ గ్రామ శివారులో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనం, నీమ్జ్​ 9.5 కిలో మీటర్ల ఫోర్​లైన్​ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. అక్కడి నుంచి పస్తాపూర్​ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభావేదికకు చేరుకొని ప్రాంగణం వద్ద వివిధ శాఖల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి మాట్లాడారు. 

అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్​షెట్కార్, ఎమ్మెల్యేలు మాణిక్​రావు, సంజీవ్​రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రతిపాదనల మేరకు సీఎం రేవంత్​వేల కోట్ల అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సర్టిఫికెట్లు, డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.126.54 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్​ చైర్మన్​ మల్కాపురం శివకుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు గిరిధర్​రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, ఫయీం, కాంగ్రెస్​నియోజకవర్గ ఇన్​చార్జి, మాజీ మంత్రి చంద్రశేఖర్​, నాయకులు ఉజ్వల్​రెడ్డి, తన్వీర్​, హన్మంత్​రావు పాటిల్, శ్రీనివాస్​రెడ్డి, రామలింగారెడ్డి, భాస్కర్​రెడ్డి, కండెం నర్సింహులు, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నీమ్జ్​ ఏరియాలో షుగర్​ ఫ్యాక్టరీ

జహీరాబాద్, నారాయణఖేడ్​ నియోజకవర్గాల ప్రజలకు సీఎం పలు హామీలను ఇచ్చారు. నీమ్జ్​ ప్రతిపాదిత ప్రాంతంలో 100 ఎకరాల్లో సహకార చక్కెర ఫ్యాక్టరీ, కోహీర్​లో డిగ్రీ కాలేజ్, సంగమేశ్వర లిఫ్ట్​ ఇరిగేషన్​కు ఫండ్స్, జహీరాబాద్​లో హజ్​హౌజ్, షాదీఖాన, జహీరాబాద్​ మున్సిపాలిటీకి రూ. 100 కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు, న్యాల్​కల్​ మండలంలోని హద్నూర్​ పంచాయతీని రెండో మండల కేంద్రంగా అప్​గ్రేడ్​ చేసేందుకు హామీ ఇచ్చిన సీఎం వీటన్నంటిపై సమీక్షించి నిధుల  విడుదలకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. నారాయణఖేడ్​ నియోజకవర్గంలో మనూర్​ మండలం బోరంచ వద్ద నిర్మించనున్న బసవేశ్వర లిఫ్ట్​ఇరిగేషన్​ పునరుద్ధరణకు నిధులు, ఖేడ్​ ప్రాంతంలో ఉపాధి కోసం ఇండస్ట్రియల్​ హబ్​ ఏర్పాటు కోసం సీఎం సుముఖత వ్యక్తం చేశారు.

సభ సక్సెస్​ 

జహీరాబాద్​ పస్తాపూర్​ వద్ద  ఏర్పాటు చేసిన సీఎం సభ సక్సెస్​ అయింది. ఎంపీ సురేశ్​షెట్కార్​ అధ్యక్షతన కొనసాగిన ప్రజావేదిక సభకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. రూ. 494.67 కోట్లతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగగా, సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, దామోదర​రాజనర్సింహ, ఎమ్మెల్యేలు మాణిక్​రావు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. జహీరాబాద్​, నారాయణఖేడ్​ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో సభాప్రాంగణం కిక్కిరిసి పోయింది. అలాగే సభాస్థలి వద్ద కళాజాత బృందాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాడిన పాటలు ప్రజలను ఆలరించాయి.