
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ పీఎం సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేరని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల తర్వాత పదవిలో ఉండొద్దని బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారని.. అయినా కూడా మోడీ మాత్రం ముందుకు రావడం లేదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం ప్రకారం గతంలో ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషికి వర్తించినా ఏజ్ లిమిట్ సూత్రం.. మోడీకి వర్తించదా అని ప్రశ్నించారు. మోడీని ప్రధాని సీటు నుంచి కిందకు దించడం బీజేపీ వల్ల కాదని.. ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే మోడీని కుర్చీ నుంచి దింపుతారని హాట్ కామెంట్స్ చేశారు.
మోడీని ఓడిస్తాం.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామన్నారు. శనివారం (ఆగస్ట్ 2) ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్యర్యంలో కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సు జరిగింది. సీఎం రేవంత్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసగించారు. భారతదేశం నుంచి బ్రిటిష్ పాలకులను తరిమికొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిందని.. సామాజిక న్యాయం కోసం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే పని చేస్తోందన్నారు. బీజేపీ సహా అన్ని పార్టీలు అధికారం లేకపోతే ఇంటికే పరిమితమవుతాయని.. కానీ అధికారం ఉన్నా లేకపోయిన కాంగ్రెస్ ప్రజల పక్షాన కొట్లాడుతోందని అన్నారు.
మాది ఎప్పటికీ ప్రజల పక్షమేనన్నారు. పాకిస్థాన్ ను ఇందిరా గాంధీ రెండు ముక్కలు చేశారు. తీవ్రవాదంపై పోరాటం చేసి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీదని.. అలాగే రాహుల్ భారత ప్రధాని కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవారన్నారు. దేశం కోసం పదవులు త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిదని అన్నారు.