హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఇంద్రవెల్లి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్ తెలిపారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి మహేశ్‌కుమార్ గౌడ్ మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభలో సీఎం పాల్గొంటారని తెలిపారు. దేవుడు, మతం పేరిట రాజకీయాలు చేసేవాళ్లను దించేలా సీఎం సభ ఉంటుందన్నారు. ఇంద్రవెల్లి స్థూపం వద్ద స్మృతి వనం కడుతామని సీఎం చెప్పినట్టు వెల్లడించారు.
ఇంద్రవెల్లిలో సీఎం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను మొదలు పెడుతారని, కేస్లాపూర్ గుడి సందర్శిస్తారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వెల్లడించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను సీఎం కలుస్తారని తెలిపారు. కడెం ప్రాజెక్టు నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తామన్నారు. అంతకుముందు, సీఎం సభ నిర్వహణపై జరిగిన సమీక్షలో మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
