గవర్నర్​తో సీఎం రేవంత్​ భేటీ

గవర్నర్​తో సీఎం రేవంత్​ భేటీ
  •  నామినేటెడ్ ​ఎమ్మెల్సీలు, కేబినెట్ ​విస్తరణపై చర్చ
  • ​ మూడో వారంలో అసెంబ్లీ సెషన్స్​ చేపట్టే చాన్స్​
  • వివిధ అంశాలపై రెండు గంటలపాటు డిస్కషన్

హైదరాబాద్, వెలుగు: రాజ్​భవన్​లో రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ప్రధానంగా గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారం, మంత్రి మండలి విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, యూనివర్సిటీల్లో వీసీల నియామకం, ఆగస్టు 15న  ఖైదీల విడుదల, రాష్ట్ర విభజన అంశాలు,  పలు బిల్లులకు సంబంధించి చర్చించినట్టు సమాచారం. 
 
మధ్యాహ్నం 12.45 గంటలకు రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌ చేరుకున్న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, మధ్యాహ్నం 2.55 గంటల వరకు గవర్నర్‌‌‌‌‌‌‌‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల దగ్గర నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు  తెలిసింది.  ఈ నెల 7 తర్వాత ఆషాఢ మాసం వస్తుండటంతో అంతకు ముందే ప్రమాణ స్వీకారం చేయాలన్న భావనతో పార్టీ వర్గాలు ఉన్నాయి. 

ఏఐసీసీ గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి, మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించడంతో గవర్నర్‌‌‌‌‌‌‌‌ వద్ద ఇదే అంశం చర్చించి ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరుగురుని కేబినేట్​లోకి తీసుకునే అవకాశం ఉండగా.. ప్రస్తుతం నలుగురికి మాత్రమే చోటు ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 4, 5వ తేదీల్లోనే కేబినెట్​విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్టు చర్చ నడుస్తున్నది. 

మరోవైపు పూర్తిస్థాయి బడ్జెట్​పెట్టడంతోపాటు పలు బిల్లులను అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకోవాల్సి ఉన్నది. దీంతో అసెంబ్లీ సమావేశాలపై  గవర్నర్​తో సీఎం చర్చించారు. ఈ నెల మూడోవారంలో అసెంబ్లీ సెషన్స్​ను ప్రారంభించాలనుకుంటున్నట్టు రేవంత్​ సూత్రప్రాయంగా వెల్లడించినట్టు తెలుస్తోంది. 

సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రపోజల్స్​

సుదీర్ఘంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసే ప్రపోజల్స్ పై గవర్నర్​దగ్గర సీఎం రేవంత్​ ప్రస్తావించారు.  త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్వోఆర్‌‌‌‌‌‌‌‌ చట్టంసహా భూ చట్టాలను అన్నింటినీ ఏకం చేసి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు తీసుకొస్తున్న బిల్లుతోపాటు ఇతర బిల్లులపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయం కూడా సీఎం ప్రస్తావించినట్టు సమాచారం.

 బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో  గవర్నర్​ కోటాలో  దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేరును ప్రతిపాదించారు. అయితే గవర్నర్‌‌‌‌‌‌‌‌ వారిని నామినేట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు అర్హతలు లేవని తిరస్కరించారు. దీంతో ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. ఆ వెంటనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం గవర్నర్‌‌‌‌‌‌‌‌ కోటా కింద  ప్రొఫెసర్​కోదండరామ్, మీర్‌‌‌‌‌‌‌‌ అలీఖాన్‌‌‌‌‌‌‌‌ పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రపోజ్​ చేసింది. 

వాటికి గవర్నర్​ ఆమోదం తెలిపారు. అయితే, కోర్టు తీర్పుతో వారి ప్రమాణానికి బ్రేక్​ పడింది. ఆ తర్వాత గవర్నర్​ పేర్లను తిరస్కరించడానికి ఉండదని.. ఏదైనా అభ్యంతరం ఉంటే ప్రభుత్వానికి తిప్పి పంపాలని హైకోర్టు సూచన చేసింది. దీంతో కథ మొదటికి వచ్చింది. ఇప్పుడు గత బీఆర్ఎస్​ ప్రభుత్వం పంపిన పేర్లను తిరిగి ప్రభుత్వానికి పంపనున్నారు. మళ్లీ వాటిని కేబినెట్​లో ఆమోదించి.. గవర్నర్​కు పంపితే వాటికి ఆమోదం లభించనుంది. దీనిపైనా కూడా సుదీర్ఘంగా చర్చించారు. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​రెడ్డి ఉన్నారు.