ఆస్పత్రుల పనులు ఆగొద్దు..బిల్డింగ్ ల నిర్మాణం, డాక్టర్ల నియామకం ఏకకాలంలో పూర్తికావాలి :సీఎం రేవంత్ రెడ్డి

ఆస్పత్రుల పనులు ఆగొద్దు..బిల్డింగ్ ల నిర్మాణం, డాక్టర్ల నియామకం ఏకకాలంలో పూర్తికావాలి :సీఎం రేవంత్ రెడ్డి
  • ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్, ఉస్మానియా ఆస్పత్రుల పనుల్లో వేగం పెంచాలి
  • ఉన్నతాధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలు
  • కలెక్టర్లు గ్రౌండ్‌‌లోకి దిగాల్సిందే, ఆఫీసులకే పరిమితమైతే కుదరదు
  • హాస్టళ్లు, స్కూళ్లను నిరంతరం తనిఖీ చేయాలని ఆర్డర్స్
  • ఫ్యూచర్ సిటీలో డిసెంబరులో ‘తెలంగాణ గ్లోబల్ సమిట్-2026’ ఏర్పాట్లపై సమీక్ష

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్య, వైద్య రం గాలకు సంబంధించిన అభివృద్ధి పనులు కేవలం సెక్రటేరియెట్ ఫైళ్లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు కనిపించాలని సీఎం రేవంత్ రెడ్డి సీఎంఓ ఉన్నతాధికారులను ఆదేశించారు. పేద ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఎల్బీనగర్, అల్వా ల్, వరంగల్​తో పాటు ఉస్మానియా ఆస్పత్రి భవ నాల నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పురోగతిపై శనివారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంవో  అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కేవలం భవనాలు లేపితే సరిపోదని, రోగులు వచ్చే సమయానికి అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా పక్కా కార్యాచరణ ఉండాలన్నారు. ఆయా ఆస్పత్రులకు అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్ ఎక్విప్‌00మెంట్‌‌ను ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా కొనుగోలు చేయాలని సూచిం చారు.

భవనాల నిర్మాణం పూర్తయ్యే సమయానికే అన్ని రకాల వైద్య సేవలు, టెస్టులు రోగులకు అందుబాటులో ఉండాలని, పరికరాల కొనుగోలులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. నిర్మాణ సంస్థలు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు నిర్దేశిత గడువులను కచ్చితంగా పాటించి తీరాలని సీఎం స్పష్టం చేశారు.

 డాక్టర్లు, సిబ్బంది సిద్ధంగా ఉండాలి

ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తయ్యాక తీరిగ్గా సిబ్బందిని వెతుక్కునే పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలకాలని, భవనాలు ప్రారంభమయ్యే నాటికే పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని సీఎస్​ను సీఎం ఆదేశించారు. ఎక్కడా వైద్యుల కొరత అన్న మాటే రాకుండా ఇప్పుడే ఖాళీలను గుర్తించి, తక్షణమే నియామక ప్రక్రియను మొదలుపెట్టాలని ఆదేశించారు.  

మరోవైపు జిల్లా కలెక్టర్లు ఏసీ గదులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో గ్రౌండ్‌‌లోకి దిగాల్సిందేనని స్పష్టం చేశారు. కలెక్టర్లతో పాటు జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు, స్థానిక ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రతీ వారం విద్యా, వైద్య పరిస్థితులపై జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించి లోపాలను సరిదిద్దాలన్నారు.

హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, పారిశుధ్యం ఉండేలా చూడటంతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో శిథిలావస్థకు చేరిన లేదా మరమ్మతులు అవసరమైన ప్రభుత్వ పాఠశాలల జాబితాను రూపొందించి, అత్యవసర ప్రాతిపదికన రిపేర్ పనులను పూర్తి చేయాలన్నారు.