అన్నదాతకు అండగా ఉంటాం.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నదాతకు అండగా ఉంటాం.. సీఎం రేవంత్ రెడ్డి
  • తడిసిన వడ్లను సమీపంలోని గోదాములు, మిల్లులకు తరలించండి
  • అవి అందుబాటులో లేకుంటే ఫంక్షన్​ హాళ్లలోకి షిఫ్ట్​ చేయండి
  • అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలు
  • వడ్లు కొట్టుకపోతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి
  • కొనుగోళ్ల కోసం ప్రతి ఐకేపీ సెంటర్​కు ఇన్​చార్జ్​ ఆఫీసర్
  • వరంగల్​కు హైడ్రా టీమ్స్​, పడవలను పంపాలని సూచన
  • మంత్రులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​
  •     నేడు వరంగల్​, హుస్నాబాద్​లో ఏరియల్​ సర్వే

హైదరాబాద్​, వెలుగు:తుఫాన్​ ప్రభావంతో నష్టపోయి కష్టాల్లో ఉన్న అన్నదాతలకు అండగా ఉంటామని, ఆయా చోట్ల యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. అనుకోని ఉపద్రవం వల్ల రైతులకు తీరని నష్టం జరిగిందన్నారు. వర్షంతో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయిందని, ఐకేపీ కేంద్రాల్లో వడ్లు కొట్టుకపోయాయని, ఈ దృశ్యాలు కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 వెంటనే అధికారులంతా రంగంలోకి దిగాలని.. కల్లాల్లో, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే దగ్గర్లోని గోదాములు, మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మిల్లులు, గోదాములు అందుబాటులో లేని చోట దగ్గరలోని ఫంక్షన్ హాళ్లలో నిల్వ చేసేలా చూడాలన్నారు. మొంథా తుఫాన్​ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో  గురువారం మంత్రులతో కలిసి సీఎం రేవంత్​రెడ్డి వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

ఉమ్మడి వరంగల్​, నల్గొండ జిల్లాతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద నష్టం ఎక్కువగా ఉందని.. వరి, పత్తి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని సీఎంకు మంత్రులు, కలెక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘అన్ని చోట్ల వరి కోతలు, పత్తి ఏరడం ప్రారంభించారు. వడ్లను, పత్తిని, ఇతర పంటలను మార్కెట్​కు తెస్తున్నారు. ఇలాంటి టైమ్​లో రైతులకు తుఫాన్​ తీవ్ర నష్టం చేకూర్చింది. వారిని ఆదుకుందాం” అని చెప్పారు. ఇప్పటికీ ముంపు గ్రామాలు, కాలనీల్లో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన సహాయం అందించాలన్నారు.  

ప్రతి కొనుగోలు కేంద్రానికో ఇన్​చార్జ్​

ఐకేపీ కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక మండల స్థాయి అధికారిని ఇన్​చార్జ్​ ఆఫీసర్​గా నియమించాలని, ఇప్పుడున్న ఇన్​చార్జులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వెంటనే వారిని తప్పించాలని తేల్చిచెప్పారు. ఐకేపీ సెంటర్ల నుంచి ఏరోజుకారోజు సాయంత్రం రిపోర్జ్​ తెప్పించుకోవాలని, రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేసి అందరూ  ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ‘‘వానలకు  వడ్లు తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి. విధానపరమైన నిర్ణయాలు అవసరమైతే వెంటనే సివిల్ సప్లయిస్ కమిషనర్, సీఎస్ దృష్టికి తేవాలి. వరద తగ్గాక వ్యవసాయ, రెవెన్యూ విభాగం అధికారులు సంయుక్తంగా సర్వేలు చేసి నష్టం అంచనాలు తయారు చేయాలి. తుఫాన్​, వర్షాల ప్రభావమున్న జిల్లాల్లో చేపడుతున్న సహాయ చర్యలు, రోడ్ల పునరుద్ధరణ చర్యలు, ధాన్యం కొనుగోళ్లపై ఆయా జిల్లాల ఇన్​చార్జ్​ మంత్రులు సమీక్షించాలి. ఎంతటి విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే రాష్ట్రంలో 16 జిల్లాలపై తుఫాన్​ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది’’ అని ఆయన పేర్కొన్నారు. 

వరంగల్​కు హైడ్రా టీమ్​లు, పడవలు

వరంగల్​లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్నందున పోలీసుల సేవలను వినియోగించుకోవాలని, అవసరమైతే హైదరాబాద్ నుంచి హైడ్రా టీమ్​లు, వరద సహాయక సామగ్రిని పంపించాలని చీఫ్​ సెక్రటరీ, డీజీపీని సీఎం రేవంత్​ ఆదేశించారు. వరంగల్​లో సహాయ చర్యలకు పడవలను పంపించాలని, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తరలించాలని ఆదేశాలిచ్చారు. 

హైదరాబాద్ నుంచి హైడ్రా సిబ్బందిని, వరద సహాయక సామగ్రిని కూడా అత్యవసరమైన చోట వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్​వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరదలో ఇండ్ల కప్పులు, బంగ్లాలపై చిక్కుకున్న వారికి డ్రోన్లతో తాగు నీరు, ఫుడ్ పాకెట్లు  సరఫరా చేయాలన్నారు. 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షించేందుకు వీలుగా కలెక్టరేట్​లో టోల్ ఫ్రీ హెల్ప్ సెల్​ను ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్​లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు.  

విద్యుత్​ శాఖ అలర్ట్​గా ఉండాలి

వర్షాలు, ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, వెంటనే విద్యుత్తు పునరుద్ధరించేలా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ అధికారులను సీఎం రేవంత్​ ఆదేశించారు. వర్షాలతో ఖమ్మం జిల్లాలో ఒక డీసీఎం వ్యాన్, డ్రైవర్ వాగులో కొట్టుకుపోవటం దురదృష్టకరమన్నారు. అన్ని రోడ్లపై ఉన్న బ్రిడ్జిలు, లో లెవల్ కాజ్ వేలు, కల్వర్టుల వద్ద అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలను నివారించొచ్చన్నారు. 

రోడ్లపైకి వరద వచ్చే ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కుంభవృష్టి కురిసే సమయంలో అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎమర్జెన్సీ సమయాల్లో అత్యవసర వైద్య సేవలు అందించేలా వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాగా, ఈ రివ్యూలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

నేడు సీఎం ఏరియల్ సర్వే

సీఎం రేవంత్ ​రెడ్డి శుక్రవారం ఉదయం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను పరిశీలిస్తారు. గురువారం ఉదయమే వరద ప్రభావిత జిల్లాలకు వెళ్లేందుకు రేవంత్ సన్నద్ధమైనా.. చివరి నిమిషంలో పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ప్రయాణం వీలు కాదని ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు.