
- అంధులైన ముగ్గురు కొడుకులను పోషిస్తున్న 81 ఏండ్ల వృద్ధురాలు
- వృద్ధురాలిని కలిసి వివరాలు తెలుసుకున్న ఆఫీసర్లు
నిజామాబాద్, వెలుగు : ఎనభై ఒక్క ఏండ్ల వయస్సులో తన అవసరాలు తీర్చుకోవడమే కష్టం.. అలాంటిది తన పనులు చేసుకోవడంతో పాటు అంధులైన ముగ్గురు కొడుకులను పోషిస్తోంది ఓ వృద్ధురాలు. ఆమె దీనస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆ మహిళకు అవసరమైన సాయం చేయాలని, ప్రభుత్వం తరఫున అండగా ఉండాలని ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో స్పందించిన ఆఫీసర్లు ఆదివారం వృద్ధురాలిని కలిసి మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన సబ్బని శాంతాబాయి (81) భర్త లింబాద్రి ఎనిమిదేండ్ల కింద చనిపోగా.. ముగ్గురు కొడుకులు చంద్రమోహన్ (56), హరిచరణ్ (51), సాయిరాం (46) అంధులు.
దీంతో ముగ్గురు కొడుకుల పోషణతో పాటు వారి పనులను సైతం శాంతాబాయే చేసి పెట్టేది. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి వారికి సాయం అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి సూచించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా ఫిషరీస్ ఏడీ ఆంజనేయులు, డీడబ్ల్యూవో రసూల్‌బీ ఆదివారం రామన్నపేటకు వెళ్లి శాంతాబాయిని కలిసి వారి పరిస్థితిని ఆరా తీశారు.
వయస్సు మీద పడడంతో కొడుకుల బాధ్యత చూడలేకపోతున్నానని, వంట చేయడం మొదలుకొని కొడుకులకు అన్నం తినిపించడం, స్నానం చేయించడం, దుస్తులు ఉతకడం వంటి పనులు చేయలేకపోతున్నానని శాంతాబాయి ఆఫీసర్లకు తెలిపింది. దీంతో డిచ్‌పల్లి మండలం రాంపూర్ వృద్ధాశ్రమంలో ఉంటామంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని, ఒక వేళ గ్రామంలోనే ఉండాలనుకుంటే అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆఫీసర్లు చెప్పారు. దీంతో ఆలోచించుకునేందుకు తనకు రెండు రోజుల గడువు ఇవ్వాలని శాంతాబాయి ఆఫీసర్లను కోరింది. తన పరిస్థితిని తెలుసుకొని స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది.