హైదరాబాద్: కోఠిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రవీంద్రభారతిలో జరిగిన చాకలి ఐలమ్మ 39వ వర్థంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తామని సీఎం చెప్పారు.
దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారని సీఎం గుర్తుచేశారు. చాకలి ఐలమ్మ స్పూర్తితో ఇందిరా గాంధీ భూ సంస్కరణలు తెచ్చారని చెప్పారు. భూమి పేదవాడి ఆత్మ గౌరవం అని, అందుకే ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలను పంచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణి ముసుగులో కొందరు పేదల భూములను గుంజుకునే కుట్ర చేశారని బీఆర్ఎస్ కు పరోక్షంగా సీఎం రేవంత్ చురకలంటించారు. పేదల భూములను కాపాడేందుకే ఐలమ్మ స్పూర్తితో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.