రైతులకు అండ రైతు కమిషన్.. మనీ లెండింగ్ యాక్ట్.. అమలుకు కమిషన్ చర్యలు

రైతులకు అండ రైతు కమిషన్.. మనీ లెండింగ్ యాక్ట్.. అమలుకు కమిషన్ చర్యలు

తెలంగాణ ప్రభుత్వం 2024 అక్టోబర్ నెలలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ను ఏర్పాటు చేసింది. దేశంలోనే పంజాబ్ తర్వాత తెలంగాణలోనే రైతు సంక్షేమ కమిషన్ ఉంది.  ఏదేని రైతు సమస్య  కమిషన్ పరిధిలో ఉంటే అక్కడికక్కడే పరిష్కరించడం, లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తుంది. రైతులకు ప్రభుత్వానికి మధ్య కమిషన్  ఒక వారధి లాంటిది. 

కమిషన్ చైర్మన్ గా సీనియర్ రైతు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. ఎం. కోదండరెడ్డిని నియమించారు. ఏడుగురు  కమిషన్ సభ్యులను నియమించింది.  రైతు కమిషన్ 14 నెలల కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయి పర్యటనలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చింది. 

దేశంలో విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు ఇప్పటివరకు ఒక్కటి కూడా లేదు. కానీ తెలంగాణలో రైతు కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు అండగా నిలిచిందని చెప్పాలి. కమిషన్ చొరవ వల్లే ములుగు, గద్వాల్ జిల్లాలో వందలాది మంది విత్తనోత్పత్తి రైతులకు న్యాయం జరిగింది. ములుగులో మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన గిరిజన రైతులకు మల్టీనేషనల్ విత్తన కంపెనీల నుండి దాదాపు 4 కోట్ల వరకు నష్టపరిహారం ఇచ్చేలా కమిషన్ కృషి చేసింది. ఇక గద్వాల్ లో పత్తి, సూర్యాపేటలో వరి, ఖమ్మం లో మిర్చి, మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన రైతులకు కూడా విత్తన కంపెనీల నుండి నష్టపరిహారం అందేలా చేసింది. 

కమిషన్​ చొరవ
తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తికి అనుకూలమైన ప్రాంతమని, దాంతో విత్తన కంపెనీలు రైతులతో సాగుచేసుకొని లాభపడుతున్నాయి. ఐతే కొన్ని సందర్భాల్లో విత్తనోత్పత్తి రైతులు నష్టపోతే.. కంపెనీలు పట్టించుకోవడం లేదు, దానికి తోడు ఆర్గనైజర్ల మోసాలకు అమాయక రైతులు బలవుతున్నారని కమిషన్ గుర్తించింది. మరోవైపు నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులతో రైతన్నలు ఆగమౌతున్నారని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

కమిషన్ సూచన మేరకు సమగ్ర విత్తన చట్టం ముసాయిదాకు  కమిటీని ప్రభుత్వం నియ‌‌‌‌‌‌‌‌మించింది. ప్రస్తుతం ఆ విత్తన చట్టం ముసాయిదా కమిటీ.. చట్టం ఏర్పాటు చేయడంలో నిమగ్నమైంది. 

రైతులతో ముఖాముఖి
రైతు కమిషన్ గ్రామాలను సందర్శించి అక్కడి రైతులతో ముఖాముఖీ సమావేశాలు నిర్వహించింది. మార్కెట్ యార్డులను విజిట్ చేసి అక్కడ జరుగుతున్న మోసాలను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లింది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ ఐన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులకు కనీస వసతుల ఏర్పాటుకు కృషి చేసింది. 

పత్తి కొనుగోలులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ ) అధికారులు, దళారులు కలిసి రైతులకు చేస్తున్న మోసాలపై కేంద్రానికి లేఖరాసి చర్యలు చేపట్టేలా చేసింది. బాట సింగారం ఫ్రూట్ మార్కెట్, బోయినపల్లి మార్కెట్ యార్డులను విజిట్ చేసింది. గత ప్రభుత్వం బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు కోసం చేసిన భూముల లీజ్ విషయంలో జరిగిన వ్యవహారం కమిషన్ బయటపెట్టి ప్రభుత్వానికి లేఖ రాసింది.

సాంప్రదాయ పంటల కోసం సిఫార్సు
రాష్ట్రంలో సాంప్రదాయ పంటలను ప్రోత్సహించాలని రైతు కమిషన్ గుర్తుచేస్తుంది. పసుపు, చెరుకు, బత్తాయి వంటి పంటల సాగు విస్తీర్ణం రోజురోజుకు తగ్గుముఖం పడుతోందని హెచ్చరిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించి పసుపు, చెరకు పంటలను పరిశీలించింది. పసుపు సాగుచేసే రైతులకు యంత్రపరికరాలు అవసరమని భావించి, వాటిని రాష్ట్ర ప్రభుత్వం సబ్సీడీపై ఇచ్చేలా కృషి చేసింది. 

ఇక పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని కేంద్రానికి రైతు కమిషన్ సిఫార్సు చేసింది.  బత్తాయి రైతులకు నాణ్యమైన మొక్కలు అందుబాటులో లేక పోవడం వల్లనే బత్తాయి రైతులు నష్టపోతున్నారని గుర్తించి.. దాని కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.

నీటి సంఘాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించిన కమిషన్
తెలంగాణ రాష్ట్రం గొలుసు కట్టు చెర్వుల నిలయం. గత పదేండ్లుగా చెరువులు, కుంటలు అభివృద్దికి నోచుకోకపోవడంతో భూ గర్బజలాలు అడుగంటి పోతున్నాయి. . ఇక కొన్ని చోట్ల కబ్జాదారుల చెరలో పడి చెర్వులు, కుంటలు కనుమరుగయ్యాయి. 

ఐతే చెరువులు బాగుంటేనే రైతు, దానిపై ఆధారపడి జీవించే కుల వృత్తులు నిలబడతాయని కమిషన్ భావించింది. దానికోసం మేజర్ ఇరిగేషన్ నుండి మైనర్ ఇరిగేషన్ నుండి విడదీయాలని రాష్ట్ర ప్రభుత్వానికి రైతు కమిషన్ సూచించింది. అంతేకాదు చెరువుల పరిరక్షణ  బాధ్యతను ఆయా గ్రామాల్లో వుండే రైతులకు, చెరువులపై ఆధారపడే వారికీ అప్పగించాలని తెలిపింది. రైతు కమిషన్ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చెరువులకు నీటి సంఘాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మనీ లెండింగ్ యాక్ట్.. అమలుకు కమిషన్ చర్యలు
తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రైవేట్ అప్పులు చేసి వందలాది మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు. అస‌‌‌‌లు, వ‌‌‌‌డ్డీ క‌‌‌‌ట్ట‌‌‌‌లేక చిన్న, స‌‌‌‌న్న‌‌‌‌కారు, కౌలు రైతులు ఆత్మహ‌‌‌‌త్యలకు బ‌‌‌‌ల‌‌‌‌వుతున్నారు. రాష్ట్రంలో గ‌‌‌‌త ప‌‌‌‌దేండ్ల కాలంలో రైతుల ఆత్మహత్యల‌‌‌‌కు ప్రధాన కార‌‌‌‌ణం.. ప్రైవేట్ వ‌‌‌‌డ్డీ వ్యాపారులేన‌‌‌‌ని రైతు క‌‌‌‌మిష‌‌‌‌న్ విచార‌‌‌‌ణ‌‌‌‌లో తేలింది.  మ‌‌‌‌నీ లెండింగ్ యాక్ట్ ప‌‌‌‌క్కాగా అమ‌‌‌‌లు చేయాల‌‌‌‌ని ప్రభుత్వానికి రైతు క‌‌‌‌మిష‌‌‌‌న్ సూచ‌‌‌‌న చేసింది.  దీనితో రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మనీ లెండింగ్ యాక్ట్ అమలు చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. 

పోడు ప‌‌‌‌ట్టాలున్న రైతుల‌‌‌‌కు పంట రుణాలివ్వాల‌‌‌‌ని ప్రభుత్వానికి సిఫార్సు చేసిన క‌‌‌‌మిష‌‌‌‌న్ 
దాదాపు 2 ల‌‌‌‌క్షల 30 వేల మంది గిరిజ‌‌‌‌న రైతుల‌‌‌‌కు చెందిన‌‌‌‌ 7ల‌‌‌‌క్షల ఎక‌‌‌‌రాల భూమి వుంది. అయితే వివిధ కార‌‌‌‌ణాల వ‌‌‌‌ల్ల గిరిజన రైతులు పంట రుణాలు పొంద‌‌‌‌లేక పోతున్నారు. బ్యాంక‌‌‌‌ర్లు సైతం పంట‌‌‌‌ రుణాలు ఇవ్వడానికి ముందుకు రావ‌‌‌‌డం లేదు. ఈ విష‌‌‌‌యం క‌‌‌‌మిష‌‌‌‌న్ దృష్టికి రావడంతో గిరిజ‌‌‌‌న రైతుల‌‌‌‌కు పోడు పట్టాలుంటే.. త‌‌‌‌ప్పని స‌‌‌‌రిగా పంట రుణాలు ఇచ్చేలా చూడాల‌‌‌‌ని  రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రూపంలో రాసి పంపింది. 

ఇత‌‌‌‌ర రాష్ట్రాల ప‌‌‌‌ర్యట‌‌‌‌న‌‌‌‌లు
హ‌‌‌‌ర్యానా, కేర‌‌‌‌ళ రాష్ట్రాల్లో  రైతు క‌‌‌‌మిష‌‌‌‌న్ ప‌‌‌‌ర్యటించింది. విత్తన చ‌‌‌‌ట్టం రూపొందించే క్రమంలో ముందుగా హర్యానా రాష్ట్రంలో అమ‌‌‌‌ల‌‌‌‌వుతున్న విత్తన చ‌‌‌‌ట్టాన్ని అధ్యయ‌‌‌‌నం చేయ‌‌‌‌డానికి రైతు క‌‌‌‌మిష‌‌‌‌న్ చైర్మన్ కోదండ‌‌‌‌రెడ్డి, విత్తన చ‌‌‌‌ట్ట ముసాయిదా క‌‌‌‌మిటీ ప‌‌‌‌ర్యటించారు. అక్కడ చ‌‌‌‌ట్టం అమ‌‌‌‌ల‌‌‌‌వుతున్న తీరుపై అభిప్రాయ సేక‌‌‌‌ర‌‌‌‌ణ చేప‌‌‌‌ట్టింది. ఈ ప‌‌‌‌ర్యట‌‌‌‌న‌‌‌‌లో సీడ్ కార్పొరేష‌‌‌‌న్ చైర్మన్ అన్వేష్ రెడ్డి కూడా వున్నారు. 

ఇక ఈ మ‌‌‌‌ధ్యకాలంలోనే ఉద్యాన వ‌‌‌‌న పంట‌‌‌‌ల సాగు, లాభాల‌‌‌‌పై రైతు క‌‌‌‌మిష‌‌‌‌న్ బృందం అధికారుల‌‌‌‌తో క‌‌‌‌లిసి కేర‌‌‌‌ళ ప‌‌‌‌ర్యట‌‌‌‌న చేసింది. కేర‌‌‌‌ళ‌‌‌‌లో సాగు చేస్తున్న కూర‌‌‌‌గాయ‌‌‌‌ల తోట‌‌‌‌ల‌‌‌‌ను సంద‌‌‌‌ర్శించింది.   కేర‌‌‌‌ళ రాష్ట్రంలో ఉద్యాన వ‌‌‌‌న పంట‌‌‌‌ల విష‌‌‌‌యంలో అమ‌‌‌‌ల‌‌‌‌వుతున్న విధానాల‌‌‌‌ను తెలంగాణ‌‌‌‌లో అమ‌‌‌‌లు చేసేలా చూడాల‌‌‌‌ని ప్రభుత్వానికి క‌‌‌‌మిష‌‌‌‌న్ రిక‌‌‌‌మండ్ చేసింది. 14 నెలల కాలంలో అనేక సంస్కర‌‌‌‌ణ‌‌‌‌ల‌‌‌‌కు రైతు క‌‌‌‌మిష‌‌‌‌న్ శ్రీకారం చుట్టింది. రైతుకు కొండంత అండగా మారింది. ప్రభుత్వానికి రైతుల‌‌‌‌కు మధ్య క‌‌‌‌మిష‌‌‌‌న్ వార‌‌‌‌ధిగా నిలిచింది.

ఆదర్శ రైతు వ్యవస్థ కోసం ప్రయత్నాలు
రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను తిరిగి తీసుకురావాలని రైతు కమిషన్ ప్రభుత్వానికి సూచించింది.  సేద్యంలో రసాయనాల వాడకం తగ్గించి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలన్నా.. గ్రామాల్లో ఆదర్శ రైతు వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది. 

ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్దరించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్ధిక భారం కూడా పడదు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరిగి ఆదర్శ రైతు వ్యవస్థను తీసుకురావడానికి సిద్ధమౌతోంది. 

‌‌‌‌‌‌‌‌కంచ రాజు, సీపీఆర్వో టు రైతు కమిషన్