కాకా టోర్నీలో ఖతర్నాక్ సెంచరీ

కాకా టోర్నీలో ఖతర్నాక్ సెంచరీ
  • దంచికొట్టిన మహబూబ్‌‌‌‌‌‌‌‌ నగర్ క్రికెటర్ డేవిడ్‌‌‌‌‌‌‌‌ కృపాల్
  • 10 వికెట్ల తేడాతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌పై ఘన విజయం

హైదరాబాద్, వెలుగు: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్  టీ20 టోర్నీలో పరుగుల మోత మోగుతున్నది. విశాక ఇండస్ట్రీస్ స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ నిర్వహిస్తున్న ఈ టోర్నీ రెండో దశలో తొలి సెంచరీ నమోదైంది. మహబూబ్ నగర్ జట్టు క్రికెటర్ డేవిడ్ కృపాల్ రాయ్‌‌‌‌‌‌‌‌ (60 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఆకాశమే హద్దుగా విజృంభించాడు. ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో మహబూబ్ నగర్ జట్టు 10 వికెట్ల తేడాతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జిల్లా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. 

వాసుదేవ్ సాహూ (58 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 83 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. మహబూబ్‌‌‌‌‌‌‌‌ నగర్ బౌలర్లలో షాదాద్ 2 వికెట్లు తీశాడు. తర్వాత 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ ఓపెనర్లు.. ఆకాశమే హద్దుగా చెలరేగారు. డేవిడ్ కృపాల్ కు తోడు అబ్దుల్ రాఫె (53 నాటౌట్) రాణించడంతో కేవలం 17 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. డేవిడ్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఖమ్మంపై నిజామాబాద్ విజయం

ఖమ్మం జిల్లా జట్టుతో జరిగిన పోరులో నిజామాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు నిజామాబాద్ బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. నిజామాబాద్ బౌలర్లలో వేధారి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 122 పరుగుల లక్ష్యాన్ని నిజామాబాద్ 14 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్షవర్ధన్ (64 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికే ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఆదిలాబాద్ గెలుపు జోరు

ఆదిలాబాద్ జిల్లా జట్టు కాకా టోర్నీలో దూసుకెళ్తున్నది. ఆ టీమ్ వరుసగా రెండో విజయం అందుకున్నది. జింఖానా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 6 వికెట్ల తేడాతో వరంగల్‌‌‌‌‌‌‌‌పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన వరంగల్ 20 ఓవర్లలో 150/9 పరుగులు చేసింది. రాహుల్ (40) టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. ఆదిలాబాద్ బౌలర్ నవదీప్ 3 వికెట్లు తీశాడు. అనంతరం నిఖిల్ సాయి (27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 57), హర్షా రెడ్డి (43 నాటౌట్) రాణించడంతో ఆదిలాబాద్ 16.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నిఖిల్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

రంగారెడ్డిపై నల్గొండథ్రిల్లింగ్ విక్టరీ

జింఖానా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో సాగిన పోరులో నల్గొండజిల్లా జట్టు 3 పరుగుల తేడాతో రంగారెడ్డిపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన నల్గొండ20 ఓవర్లలో 176/6 స్కోరు చేసింది. సికందర్ మహమ్మద్ (47 నాటౌట్), శ్రీనాథ్ యాదవ్ (37) రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో రంగారెడ్డి జట్టు చివరి వరకు పోరాడి 173/7 పరుగులు మాత్రమే చేసి కొద్దిలో విజయాన్ని చేజార్చుకున్నది. ఆర్.ప్రణవ్ ఆదిత్య (56 నాటౌట్) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. నల్గొండ బౌలర్ సికందర్ మహమ్మద్ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.