డిజిటల్ వ్యవసాయం సంస్కరణలు, సవాళ్లు

డిజిటల్ వ్యవసాయం సంస్కరణలు, సవాళ్లు

మారుతున్న ప్రపంచ పోకడలకు అనుగుణంగా, ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన నూతన మార్పులను ప్రవేశపెడుతున్నాయి. తెలంగాణలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ధరణి' పోర్టల్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను సరళీకృతం చేసింది. 

రైతులకు త్వరితగతిన సేవలు అందించాలనే సదుద్దేశంతో ఈ విధానాలు అమలులోకి వచ్చినప్పటికీ, ఆన్‌‌‌‌లైన్ వ్యవస్థలోని కొన్ని లోపాల వల్ల రైతులకు ప్రయోజనంతో పాటు కొంత మేర నష్టం జరిగిందనేది వాస్తవం. అదే స్ఫూర్తితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 'ధరణి'ని 'భూభారతి'గా మార్చి, అందులో మరిన్ని నూతన విధానాలను ప్రవేశపెట్టి ప్రక్రియను సులభతరం చేస్తోంది. 

రైతులకు వ్యవసాయ ఎరువులను సకాలంలో అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం 'యూరియా యాప్' ను ప్రవేశపెట్టింది. యూరియా కొనుగోలులో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించి, పారదర్శకంగా నేరుగా బుక్ చేసుకునే విధానాన్ని ఇది ప్రోత్సహిస్తోంది. యూరియా యాప్ వంటి డిజిటల్ వ్యవస్థల అమలులో అనేక సవాళ్లు తలెత్తుతున్నాయి. 

ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో రైతులకు, క్షేత్రస్థాయి అధికారులకు సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. కేవలం యాప్‌‌‌‌ను ప్రవేశపెట్టి వదిలేయడం వల్ల, సాంకేతిక ఇబ్బందుల కారణంగా రైతులు సకాలంలో ఎరువులను పొందలేకపోతున్నారు. ఇది పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

సైబర్​ నేరగాళ్ల ప్రమాదం  
సైబర్ నేరాల ముప్పు ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలనే ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రైతులకు, అధికారులకు నకిలీ APK ఫైల్స్, SMSలు, WhatsApp లింక్‌‌‌‌లు పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. 

ఇటీవల పెద్దపల్లి జిల్లాలో ఒక వ్యవసాయ అధికారి ఖాతా నుండి రూ. 5 లక్షలు మాయం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యాప్‌‌‌‌లోని సాంకేతిక లోపాలు, ముఖ్యంగా తెలుగు భాషాంతరీకరణ సరిగా లేకపోవడం రైతులను మరింత గందరగోళానికి గురిచేస్తోంది.

సాంకేతిక, లాజిస్టికల్ లోపాలు
నేను కూడా ఒక రైతుగా యూరియా యాప్‌‌‌‌లో నా పట్టాదార్ పాస్‌‌‌‌బుక్ నెంబర్ నమోదు చేయగానే, నా భూమికి అవసరమైన బస్తాల సంఖ్య చూపబడింది. కానీ, యాప్‌‌‌‌లో నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు చూపించినా, స్థానిక డీలర్ల వద్ద 'జీరో లభ్యత'  అని రావడం గందరగోళానికి దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. 

అంతేకాకుండా, రవాణా ఇబ్బందులు మరో ప్రధాన సమస్య. ఒక ఎకరం భూమికి అవసరమయ్యే రెండు యూరియా బస్తాల కోసం రైతులు 40,- 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి రావడం సమయం, ధన వృథా. ప్రతి గ్రామానికి దగ్గరలోని మండల కేంద్రాల్లోనే నిల్వలు ఉండేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.

సమగ్ర పరిష్కార మార్గాలు
అవగాహన కార్యక్రమాలు జరపాలి. గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులు, మహిళా సంఘాలు, యువజన సంఘాల ద్వారా రైతులకు యాప్ వినియోగంపై శిక్షణ ఇవ్వాలి. పటిష్టమైన ఐటీ విభాగంగా జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక ఐటీ సపోర్ట్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. దీనివల్ల సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయి, సైబర్ నేరాలను అరికట్టవచ్చు. 

యాప్​ల తయారీలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలి. యాప్‌‌‌‌ల రూపకల్పనలో ప్రైవేట్ సంస్థలపై పూర్తిగా ఆధారపడకుండా, కనీసం 50% ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యం ఉండాలి. దీనివల్ల డేటా భద్రత పెరగడమే కాకుండా, సేవల్లో నిరంతరాయత ఉంటుంది.

భవిష్యత్తులో, ఏదైనా ప్రైవేట్ సంస్థ సేవలను నిలిపివేసినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా సులభంగా మరొక సంస్థకు హ్యాండోవర్ చేయవచ్చు. గతంలో ధరణి పోర్టల్ విషయంలో జరిగిన సమస్యలు ఇందుకు ఉదాహరణ.

స్థానిక నిల్వల పంపిణీ కేవలం యాప్‌‌‌‌లో కాకుండా, క్షేత్రస్థాయిలో స్టాక్ పాయింట్లు రైతులకు అందుబాటులో ఉండేలా లాజిస్టిక్స్ వ్యవస్థను మెరుగుపరచాలి. ప్రభుత్వం ఈ సూచనలను పరిగణనలోకి తీసుకొని, ఈ నూతన సంవత్సరంలో నవీన ఆన్‌‌‌‌లైన్ వ్యవసాయ వ్యవస్థల ద్వారా రైతులకు స్పష్టమైన, పారదర్శకమైన పాలనను అందించాలని కోరుకుందాం. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! 

‌‌‌‌‌సురేందర్ ​గౌడ్