ఈశ్వరీబాయి జీవితం నేటి తరానికి స్ఫూర్తి: సీఎం రేవంత్ రెడ్డి

ఈశ్వరీబాయి జీవితం నేటి తరానికి స్ఫూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
  • తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఆమెది ప్రముఖ పాత్ర: సీఎం రేవంత్
  • మంత్రివర్గంలో గీతారెడ్డి లేకపోవడం లోటేనని వ్యాఖ్య

బషీర్ బాగ్, వెలుగు: అణగారిన వర్గాల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన ఈశ్వరీబాయి జీవితం.. నేటి తరానికి స్ఫూర్తిని ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళల హక్కుల కోసం ఆనాడు అసెంబ్లీలో ఆమె చేసిన ప్రసంగాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. శనివారం రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈశ్వరీబాయి 33వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రేవంత్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం తన బాధ్యతగా భావించానని ఆయన అన్నారు. ‘‘నేటి సమాజంలో చదువుకున్న మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి.

 కానీ ఈశ్వరీబాయి ఐదు దశాబ్దాల క్రితమే అంబేద్కర్ స్ఫూర్తితో రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆమె ప్రముఖ పాత్ర పోషించారు” అని కొనియాడారు. ఈశ్వరీబాయి రాజకీయాల్లో రాణిస్తూనే, కూతురు గీతారెడ్డిని డాక్టర్ చదివించారని గుర్తు చేశారు. ‘‘పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గీతారెడ్డి క్రియాశీలకంగా పని చేశారు. ఆరోగ్య సమస్యలను పక్కనపెట్టి, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొన్నారు. అందుకే గీతారెడ్డి ఇన్ చార్జ్ గా ఉన్న నల్లగొండ జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచాం. ఆమె లాంటి వారు మంత్రివర్గంలో లేకపోవడం ఒక లోటే. మంచికి, చెడుకు ఎప్పటికీ మాకు అండగా గీతక్క ఉన్నారు. గీతక్కకు నేను తమ్ముడిని” అని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూప‌‌‌‌ల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఈశ్వరీబాయి మెమోరియల్‌‌‌‌ ట్రస్ట్  
చైర్ ప‌‌‌‌ర్సన్ గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.