ఏదో ఇస్తడనుకుంటే.. తిట్ల దండకం అందుకున్నడు

ఏదో ఇస్తడనుకుంటే.. తిట్ల దండకం అందుకున్నడు

ఎల్బీనగర్, వెలుగు : తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏదైనా ఇస్తారని అనుకుంటే తిట్ల దండకం అందుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తనను తిడితే మోదీకి ఆయాసం తప్ప ఏమీ రాదన్నారు. ఇన్నాళ్లూ కేసీఆర్​ తనను తిట్టిన తిట్లనే ఇప్పుడు మోదీ రిపీట్​ చేశారని ఫైర్​ అయ్యారు.  మంగళవారం చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా బాలాపూర్, బడంగ్ పేట్, సరూర్ నగర్ లో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో రేవంత్ పాల్గొని మాట్లాడారు. ‘‘పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కోట్ల రూపాయలు కేంద్రానికి పంపితే..

ఆ  నిధులతో మోదీ గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. గుజరాత్ లో లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నా అభినందించకుండా, మోదీ తిట్ల దండకం అందుకున్నారు. మోదీ తెలంగాణకు వచ్చిండు.. గాడిద గుడ్డు తెచ్చిండు. గుజరాత్ కు మాత్రం బంగారు గుడ్డు ఇచ్చిండు” అని ఫైర్ అయ్యారు. ‘‘తెలంగాణకు రావాల్సిన అనేక సంస్థలను మోదీ రద్దు చేశారు. హైదరాబాద్ కు కొత్త  మెట్రో లైన్లు అడిగితే పట్టించుకోలేదు. మూసీ ప్రక్షాళన కోసం అణాపైసా ఇవ్వలేదు.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే ఒప్పుకోలేదు” అని మండిపడ్డారు. మోదీ ఉద్దెర చుట్టమని, ఆయన తినిపోవడానికే తెలంగాణకు వస్తున్నారని.. బీజేపీ నాయకులు తెలంగాణను గుజరాత్ వాళ్లకి తాకట్టు పెట్టవద్దని కోరారు. ఎన్టీఆర్ నగర్ లోని ఇండ్ల రెగ్యులరైజేషన్ సమస్యను పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.