- ఎంపీ మద్దతుతో ఐఐఎం సాధించుకుంటామన్న సీఎం
మహబూబ్‌నగర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ శనివారం ఒకే వేదికపైకి వచ్చారు. ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే ఇద్దరూ అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన సభలో ముందుగా డీకే అరుణ మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉంటాయన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా తనను ఓడించడానికి ఈ వేదికపై ఉన్న అందరూ ప్రయత్నం చేశారని, ఎన్నికల్లో గెలిచానని, అయితే ఎన్నికలు అయిపోయానన్నారు. ఇప్పుడు పాలమూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. పార్లమెంట్ పరిధిలోని అందరు ఎమ్మెల్యేలతో కలిసి పని చేస్తున్నామన్నారు. పాలమూరు లిఫ్ట్ స్కీమ్‌ను జూరాల సోర్స్ ఆధారంగా చేపట్టాలని సీఎంను కోరారు.
అనంతరం మాట్లాడిన సీఎం తన ప్రసంగంలో ఎంపీ డీకే అరుణ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎంపీ ఎన్నికల సమయంలో మా ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లు డీకే అరుణకు వ్యతిరేకంగా పని చేశారన్నారు. నేను ఎక్కడైనా పోటీలో ఉంటే నాలుగు సభలకు మాత్రమే హాజరయ్యే వాడినన్నారు. కానీ.. వంశీచంద్‌ను ఎంపీగా గెలిపించుకునేందుకు పాలమూరులో 14 సార్లు పర్యటించానని గుర్తు చేశారు. కానీ ప్రజలు ఆశీర్వించడంతో డీకే అరుణ గెలుపొందారన్నారు. ఎన్నికల వరకు రాజకీయాలని, ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేద్దామన్నారు. ఎండీ డీకే అరుణ సహకారంతో తెలంగాణకు ఐఐఎంను సాధింకుంటామని, ఈ ఐఐఎంను పాలమూరులోనే ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.
