మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లిస్తం ..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% వుమెన్ రిజర్వేషన్లు

మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లిస్తం ..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% వుమెన్ రిజర్వేషన్లు
  • ఆ లెక్కన 50 దాకా సీట్లొస్తయ్​.. అదనంగా మేం పది ఇస్తం: సీఎం రేవంత్ ​రెడ్డి ప్రకటన
  • కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తం
  • వారిని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుపుతం
  • పదేండ్ల పాలనలో ఆడబిడ్డలను ఎట్లున్నరని కూడా కేసీఆర్​ అడగలే
  • మొదటి ఐదేండ్లయితే కేబినెట్​లో అవకాశమే ఇయ్యలే
  • మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం
  • ఇంటిని అద్భుతంగా నడిపే తల్లులు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతరు
  • వాళ్లకు సీట్లివ్వడమే కాదు.. గెలిపించుకునే బాధ్యత కూడా నాదే
  • ప్రతి ఒక్కరూ ‘అమ్మ’ పేరుతో ఒక మొక్క నాటాలని పిలుపు
  • జయశంకర్​ వ్యవసాయ వర్సిటీ వేదికగా ‘వన మహోత్సవం’ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని భారీగా పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆడబిడ్డలకు దాదాపు 60 సీట్లు ఇస్తామని ప్రకటించారు. ‘‘ఇప్పుడున్న 119 ఎమ్మెల్యే సీట్లు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి 153 అయితయ్​. 33 శాతం మహిళా రిజర్వేషన్లు కూడా అమలైతయ్​.  ఆ లెక్కన దాదాపు 50 సీట్లు మన ఆడబిడ్డలకు దక్కుతయ్​.  ఇంకో 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంట” అని ఆయన హామీ ఇచ్చారు. 

ఇంటిని అద్భుతంగా నడిపే తల్లులు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారన్న నమ్మకం తనకు ఉందని.. వాళ్లను ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే పూచీ కూడా తనదేనని చెప్పారు. ‘‘మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడమే కాదు.. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కూడా నాది. ఇంటిని అద్భుతంగా నడిపినోళ్లు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది’’ అని ఆయన అన్నారు. 

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లోని ఆచార్య జయశంకర్  వ్యవసాయ యూనివర్సిటీలో సోమవారం ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వర్సిటీలోని బొటానికల్ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌లో రుద్రాక్ష మొక్కను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణకు పచ్చని చీరను కప్పేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలంతా మొక్కలు నాటితే ఆకుపచ్చ తెలంగాణ అవుతుందని.. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. 

ప్రతి ఇంటిలో కనీసం రెండు మొక్కలు 

ప్రతి ఇంటిలో కనీసం రెండు మొక్కలైనా నాటి సంరక్షించాలని, అది ప్రకృతిని కాపాడటంతోపాటు వ్యక్తిగత బాధ్యత అవుతుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘ఇలాంటి  కార్యక్రమాలను ఆడబిడ్డలు ముందుకు తీసుకెళ్లాలి. మొక్కలు నాటడంతోనే మొదలు పెట్టండి. ప్రతి ఇంట్లో కనీసం రెండు మొక్కలైనా మా అక్కాచెల్లెళ్లు నాటాలి, వాటిని కాపాడాలి. అప్పుడే మనమందరం ఈ ప్రకృతి నుంచి కాపాడబడతాం” అని తెలిపారు. మహిళల పేరు మీద మొక్కలు నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేశారు. 

‘అమ్మ’ పేరుతో ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటాలని కోరారు. ‘‘ఇంట్లో పిల్లలను పెంచినంత శ్రద్ధతో మొక్కలను పెంచితే తెలంగాణ హరితవనంగా మారుతుంది. అమ్మ ఒడిలో, అమ్మ బడిలో, అమ్మ పర్యవేక్షణలో ఏమి ఇచ్చినా వాటికి రక్షణ ఉంటుంది’’ అని పేర్కొన్నారు. 

అన్ని రంగాల్లో ఆడబిడ్డలకు టాప్​ ప్రయారిటీ

గ్రామీణ ప్రాంతాలు, తండాలు, గూడాలలోని ప్రభుత్వ స్కూళ్లను  ‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ పేరుతో మహిళల చేతిలో పెట్టామని చెప్పారు. పిల్లల హాజరుతోపాటు టీచర్లు స్కూళ్లకు వస్తున్నారా లేదా అనే బాధ్యతను కూడా మహిళలకు అప్పగించినట్లు వివరించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో కూడా మహిళలకు భాగస్వామ్యం కల్పించినట్లు తెలిపారు. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం స్వయం సహాయక సంఘాలకు బాధ్యత అప్పగించి, విద్యుత్ శాఖతో ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా వారికి ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, వారి స్వేచ్ఛను పెంచామని సీఎం తెలిపారు. ‘‘రాష్ట్రంలో వెయ్యి బస్సులను కొనుగోలు చేసి, వాటిని మహిళల ఆధ్వర్యంలోని స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్టీసీకి కిరాయికి ఇప్పించినం. దీని ద్వారా మహిళలను వెయ్యి బస్సులకు యజమానులుగా మార్చాం. హైటెక్ సిటీ పక్కన వందల కోట్ల రూపాయల విలువైన మూడున్నర ఎకరాల స్థలాన్ని ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో మహిళలకు కేటాయించాం.

 రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రపంచ స్థాయి కంపెనీలతో పోటీపడేలా విక్రయించుకోవడానికి ఈ వ్యాపార సముదాయం ఉపయోగపడుతుంది. విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల గురించి రాసే మీడియా.. మన తెలంగాణ ఆడబిడ్డల వ్యాపార సముదాయం గురించి రాయడం లేదు. ఇటీవల జరిగిన భారత్ సమిట్, మిస్ వరల్డ్ కాంపిటీషన్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న ప్రతినిధులు, పోటీదారులు ఈ కేంద్రాన్ని సందర్శించి మహిళల నైపుణ్యాన్ని అభినందించారు” అని ఆయన వివరించారు. 

స్వయం సహాయక సంఘాల్లో కోటి మంది

ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల్లో 65 లక్షల మంది ఆడబిడ్డలు సభ్యులుగా ఉన్నారని, ఈ సంఖ్యను కోటి మందికి పెంచి, వారందరినీ కోటీశ్వరులుగా మార్చడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో 18 నుంచి -60 ఏండ్ల  వయస్సు వారికి మాత్రమే మహిళా సంఘాల్లో సభ్యత్వం ఉండేదని, ఇప్పుడు 15 ఏండ్లు నిండిన వారైనా, ఏ వయసు వారైనా చేరేందుకు వీలుగా చట్టాన్ని సవరించినట్లు గుర్తుచేశారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల్లో సభ్యులు తక్కువగా ఉన్నారని, తెలిసిన వారందరినీ సంఘాల్లో చేర్చాలని ఆయన సూచించారు. 

ఈ సంవత్సరమే సంఘాలకు వ్యాపారాల కోసం రూ. 21 వేల కోట్లు బ్యాంకు లింకేజ్ ఇచ్చామని చెప్పారు. రైతులు పండించిన ధాన్యాన్ని 8,100 ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నామని, కనీస మద్దతు ధరతో పాటు వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని, ఈ నగదును మహిళల చేతుల మీదుగానే రైతులకు అందిస్తున్నామని సీఎం తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇది మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే నిర్ణయమని ఆయన అన్నారు. స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లు రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టడం వల్లే శ్రీలత శోభన్ రెడ్డి, గద్వాల్ విజయలక్ష్మి వంటి వారు మేయర్లు, డిప్యూటీ మేయర్లు అయ్యారని.. సునీత మహేందర్ రెడ్డి వంటి వారు జిల్లా పరిషత్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్లుగా అయ్యారని సీఎం వివరించారు. ఆడబిడ్డలకు అండగా ఉంటామని తెలిపారు. 

గత సర్కార్​ పదేండ్లు ఆడబిడ్డలను పట్టించుకోలే

గత పదేండ్లు రాష్ట్రాన్ని పాలించినవాళ్లు ఆడబిడ్డల బాగోగులను పట్టించుకున్న దాఖలాలు లేవని, ఐదేండ్లయితే మంత్రివర్గంలో కూడా మహిళలకు అవకాశం కూడా ఇవ్వలేదని కేసీఆర్​పై సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘పదేండ్లు ఏ రోజు కూడా  ఆడబిడ్డలు ఎట్లున్నారని ఆయన పలకరించిందీ లేదు. ఐదేండ్లు అయితే కేబినెట్​లో మహిళలకు మంత్రి పదవులు ఇచ్చిందీ లేదు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిని కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం ఆలోచన. ఇందిరమ్మ ఇండ్లయినా, ఇండ్ల పట్టాలైనా, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అసైన్మెంట్ పేర్ల మీద భూములు ఇచ్చినా,  అడవుల్లో ఆదివాసీలకు పోడుభూముల పట్టాలు ఇచ్చినా  ఆనాడు ఇందిరమ్మనే ఇచ్చారు. ఆడబిడ్డలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రాజీవ్​ గాంధీ హయాంలోనే మొదలుపెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు వస్తాయి. మేం మరో 10 అదనంగా సీట్లిచ్చి 60 మంది ఆడబిడ్డలను ఎమ్మెల్యేలను చేస్తం ” అని ఆయన తెలిపారు.

మొక్కలు నాటుదాం.. బతికించుకుందాం: కొండా సురేఖ

కొంతమంది స్వలాభం కోసం చెట్లను నాశనం చేయడం మానవ ఉనికికే ప్రమాదకరమని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అడవులను కాపాడుకోవడానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 24.05% ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 33%కు పెంచే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నామని చెప్పారు. 2024 సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 20.02 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళికలు వేసుకోగా.. 95% లక్ష్యాన్ని చేరుకున్నామని, ఈసారి 100% లక్ష్యాన్ని చేరుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

 ప్రతి గ్రామంలో వన నర్సరీల ద్వారా మొక్కలు పెంచి, వాటిని అక్కడే నాటడానికి ఏర్పాట్లు చేయాలని, నాటిన ప్రతి మొక్కను బతికించడానికి, ముఖ్యంగా పండ్ల మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గౌడ సోదరులకు లబ్ధి చేకూరే విధంగా ఈత, తాటి తోటలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్​పర్సన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.