
- గాంధేయ విలువలకు ప్రతీకగా ప్రాజెక్టు నిర్మాణం
- మూసీ, ఈసా నదుల సంగమం వద్ద గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ
- గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసేలా నాలెడ్జ్ హబ్
- ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, మ్యూజియం కూడా నిర్మిస్తామని వెల్లడి
- రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు సీఎం
న్యూఢిలీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు ఇవ్వాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం (సెప్టెంబర్ 10) ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై చర్చించారు. మూసీ, ఈసా నదుల సంగమం వద్ద ఈ ప్రాజెక్టు చేపట్ట నున్నట్టు కేంద్రమంత్రికి సీఎం వివరించారు. ‘‘ఈ నదుల సంగమం వద్ద గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడతాం. ఇందుకోసం అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించండి” అని కోరారు.
‘‘జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు ప్రతీకగా గాంధీ సరోవర్ ప్రాజె క్టు నిర్మాణం చేపడ్తున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తాం” అని రాజ్‌నాథ్‌కు సీఎం రేవం త్ వివరించారు. సీఎం వెంట ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.