కార్పొరేట్‌‌ కంటే క్వాలిటీ విద్య అందిద్దాం: సీఎం రేవంత్ రెడ్డి

కార్పొరేట్‌‌ కంటే క్వాలిటీ విద్య అందిద్దాం: సీఎం రేవంత్ రెడ్డి
  •     పేద పిల్లల జీవితాలు మార్చేలా ఎడ్యుకేషన్ పాలసీ 
  •     విదేశాల్లో అధ్యయనానికి ఏటా 200 మంది టీచర్లు
  •     ఫుడ్ పాయిజన్ ఘటనలతో చాలా బాధపడ్డాను 
  •     ఇకపై టీచర్లు కూడా పిల్లలతో కలిసి భోజనం చేయాలి 
  •     గత ప్రభుత్వంలో ప్రైవేట్ వర్సిటీలు పెట్టి విద్యను వ్యాపారం చేశారు
  •     అస్తవ్యస్తమైన విద్యాశాఖను సెట్ చేసేందుకే తన దగ్గర ఉంచుకున్నట్టు వెల్లడి 
  •     హైదరాబాద్‌‌లో టీచర్స్‌‌ డే వేడుకలు.. 120 మంది బెస్ట్‌‌ టీచర్లకు అవార్డులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్​స్కూళ్ల కంటే నాణ్యమైన విద్యను సర్కారు బడుల్లో అందిద్దామని, ఇందుకు ప్రతి టీచర్ ప్రతిజ్ఞ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘పిల్లల చదువుపై పేరెంట్స్ శ్రద్ధ పెరిగింది. కూలీ పనులతో బతుకు వెళ్లదీస్తున్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్​కోసం ఓ పూట తినకపోయినా మంచి చదువు చెప్పించాలని భావిస్తున్నారు. అందుకే టీచర్లను నేను అడుగుతున్న.. ఆ చదువు మనం చెప్పలేమా? పేదవాళ్లు సంపాదించే పదోపరకో ప్రైవేట్ స్కూళ్లకు ఎందుకు పోవాలి? మన దగ్గర శక్తి లేదా.. చిత్తశుద్ధి లేదా?’’ అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని శిల్పకళా వేదికలో టీచర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి సీఎం రేవంత్ పుష్పాంజలి ఘటించారు. విద్యాశాఖ పరిధిలో బెస్ట్ టీచర్లుగా ఎంపికైన 120 మందికి అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం సీఎం రేవంత్  మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ‘‘తెలంగాణకు ఒక కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అవసరం. ఆ పాలసీ పేద పిల్లల జీవితాలను మార్చేలా ఉండాలి. దేశవ్యాప్తంగా మారుతున్న విద్యా ప్రమాణాలు, ప్రపంచ దేశాల విద్యా విధానాలను పరిగణనలోకి తీసుకొని.. తెలంగాణకు సరిపోయే ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఇప్పటికే కమిటీని నియమించాం” అని తెలిపారు.  

పేదల తలరాత మార్చేది విద్య ఒక్కటే  

విద్య ఒక్కటే పేదల తలరాతను  మార్చగలదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ప్రస్తుతం పంచడానికి భూముల్లేవు. పేదవాడు బాగుపడాలి, సమాజంలో రాణించాలి అంటే విద్య ఒక్కటే ప్రామాణికం. దేశంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సిలికాన్ వ్యాలీని శాసిస్తున్నారంటే.. దానికి కారణం విద్య. అలాంటి శక్తి మన దగ్గర ఉంది. సర్కారు బడుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం ద్వారా పేద పిల్లలు కూడా సమాజంలో ఉన్నత 
స్థానాలకు ఎదగగలరు. దానికి టీచర్ల కృషి, చిత్తశుద్ధి అవసరం” అని చెప్పారు. ‘‘చాలామంది ముఖ్యమంత్రులు రెవెన్యూ, ఫైనాన్స్, ఇరిగేషన్ శాఖలనే తమ దగ్గర పెట్టుకుంటారు. కానీ నేను విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నాను. ఎందుకంటే నేనుంటే విద్యాశాఖ బాగుపడ్తదని, పేద పిల్లలు బాగుపడ్తరని. కానీ కొందరు నాపై విమర్శలు చేస్తున్నారు.  విద్యాశాఖ ఇంకెవరికైనా ఇవ్వాలని అంటున్నారు. విమర్శకులకు నేను ఒక్కటే చెబుతున్నా.. పదేండ్లలో విద్యాశాఖ అస్తవ్యస్తమైంది. విద్యాశాఖలో సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను” అని తెలిపారు. 

టీచర్ల చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు 

ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికోసం ప్రతిఏటా 200 మంది టీచర్లను సింగపూర్, సౌత్ కొరియా వంటి దేశాలకు పంపించి.. అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేయిస్తామని ప్రకటించారు. ‘‘మనలో మనం పోటీ పడటం కాదు. పక్క ఊరిని చూసి పోటీ పడడం కాదు. ప్రపంచ దేశాలతో మనం పోటీ పడాలి. సింగపూర్, దక్షిణ కొరియా, జపాన్, జర్మనీ, చైనా వంటి దేశాలు అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి విద్యార్థులు, యువతకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాలు అందించడమే. విదేశాలకు వెళ్లి శిక్షణ పొందిన టీచర్లు.. తాము నేర్చుకున్న జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని మన ప్రభుత్వం పాఠశాలల పిల్లలకు అందించాలి. దీంతో తెలంగాణ విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులు వస్తాయి. ప్రపంచంతో పోటీపడే తరాలను మనం తయారు చేయగలం” అని పేర్కొన్నారు. ‘‘కేవలం చదువు మాత్రమే కాదు.. నైపుణ్యాభివృద్ధి కూడా అవసరం. ఇందుకోసం  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. 65 ఐటీఐలను టాటా కంపెనీతో కలిసి అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)గా అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేశాం. దేశ ప్రతిష్టను పెంచేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాం” అని తెలిపారు. ‘‘విద్యార్థులు డ్రగ్స్, గంజాయికి అలవాటుపడి తప్పుదారిలో పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వీటిపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు. దాన్ని టీచర్ల చేతుల్లో పెడుతున్నాం. అందరం కలిసి  తెలంగాణను పునర్నిర్మించుకుందాం” అని పిలుపునిచ్చారు. కాగా, శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీలు శ్రీపాల్ రెడ్డి, మల్క కొమరయ్య, ఏవీఎన్​రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, టీజీసీహెచ్‌‌‌‌‌‌‌‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు. 

కేజ్రీవాల్ గెలుపుకు కారణమదే 

ఢిల్లీలో కేజ్రీవాల్ రెండోసారి, మూడోసారి సీఎం కావడానికి ప్రధాన కారణం.. ఆయన అక్కడ విద్యా రంగంలో తీసుకొచ్చిన సమూల మార్పులేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా రంగంలో చేసిన అభివృద్ధిని చూసే కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌ను ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపించారని చెప్పారు. ‘‘ఈ విషయంలో నాకూ కొంచెం స్వార్థం ఉంది. మీరు (టీచర్లు) మంచిగా పని చేస్తే నేను కూడా రెండోసారి, మూడోసారి సీఎం అవ్వడానికి చాన్స్ ఉంటుంది. నేను ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో నిద్రపోయి మిమ్మల్ని కష్టం చెయ్యిమని చెప్పను. మీతో కలిసి నేనూ పని చేస్తాను” అని అన్నారు.

సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పిల్లలు తగ్గడానికి కారణమెవరు? 

రాష్ట్రంలోని 27 వేల సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్లలో 24 లక్షల మంది చదువుతుండగా.. 11వేల ప్రైవేటు బడుల్లో 34 లక్షల మంది చదువుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి ప్రభుత్వమో లేదా టీచర్లో కారణమని.. ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేమని చెప్పారు. ప్రభుత్వం వసతులు కల్పించినా, పిల్లలకు నమ్మకం కలిగించడంలో విఫలమై ఉండొచ్చని.. ఒకవేళ ప్రభుత్వం అన్నీ చేసినా, అమలు చేయడంలో టీచర్ల నుంచి కొంత జాప్యం జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు.

55 రోజుల్లోనే 11 వేల టీచర్ పోస్టులు 

తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీఎస్సీ వేసి కేవలం 55 రోజుల్లోనే 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పదేండ్లుగా టీచర్ల బదిలీలు, నియామకాలు సక్రమంగా జరగలేదని అన్నారు. ‘‘సర్కారు బడుల్లో వసతుల కల్పన బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించినం. ప్రతిఏటా స్కూళ్ల నిర్వహణకు రూ.130 కోట్లు సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అందిస్తున్నాం. గతంలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కానీ, మా ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు బడుల నుంచి 3 లక్షల మంది సర్కారు స్కూళ్లలో చేరారు. ఇది టీచర్ల కృషికి నిదర్శనం” అని చెప్పారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. ‘‘ధనిక రాష్ట్రమని చెప్పిన గత పాలకులు.. ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? పేద పిల్లలకు మంచి భోజనం పెట్టాలని, మెరుగైన వసతులు కల్పించాలని ఎందుకు ఆలోచించలేదు? కొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు ఆస్పత్రి పాలైన ఘటనలు చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. టీచర్లు కూడా పిల్లలతో కలిసి భోజనం చేస్తే ఇలాంటి తప్పులు జరగవు. ఇకపై టీచర్లందరూ పిల్లలతో కలిసి భోజనం చేయండి. అప్పుడు పిల్లలకు ఒక నమ్మకం వస్తుంది. తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత మనపైనా ఉంటుంది” అని అన్నారు. 

కేజీ టు పీజీ ఏమైంది? 

గత ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యనందిస్తామని చెప్పి పదేండ్లు  కాలం గడిపిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మారుమూల ప్రాంతాల్లో ని సింగిల్ టీచర్ స్కూళ్లను మూసే సిందని మండిపడ్డారు. ‘‘గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులే ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకుని, విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి, లాభసాటి వనరుగా చేసుకున్నారు. వాళ్ల హయాంలో సర్కారు వర్సిటీ లలో నియామకాలు జరగలేదు. ఇంటర్మీడి యెట్ కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఉస్మానియా, కాకతీయ వంటి వర్సిటీలు.. వాటి వైభవాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చాయి” అని పేర్కొన్నారు.