ప్రపంచంతో పోటీ పడేలా స్పోర్ట్స్‌‌ పాలసీ : సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంతో పోటీ పడేలా స్పోర్ట్స్‌‌ పాలసీ : సీఎం రేవంత్ రెడ్డి
  • ఒలింపిక్స్‌‌లో గోల్డ్ మెడల్స్ తేవడమే లక్ష్యంగా రూపొందించాం: సీఎం రేవంత్
  • ఇది మన రాష్ట్రానికి బంగారు రేఖ
  • క్రీడా రంగానికి ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తం 
  • భారత్ బలమైన క్రీడా దేశంగా ఎదగాలని ఆకాంక్ష
  • తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్‌‌లో కొత్త స్పోర్ట్స్ పాలసీ ఆవిష్కరణ   
  • రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తొమ్మిది ఒప్పందాలు

హైదరాబాద్, వెలుగు: ఆటల్లో ప్రపంచంతో తెలంగాణ పోటీ పడేలా, దేశానికే ఆదర్శంగా నిలిచేలా నూతన స్పోర్ట్స్‌‌ పాలసీని రూపొందించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ పాలసీ ఒక కాగితం కాదని, రాష్ట్రానికి ఒక బంగారు రేఖ అని అన్నారు. ఒలింపిక్స్‌‌లో తెలంగాణ క్రీడాకారులు బంగారు పతకాలు తేవడమే దీని లక్ష్యమని చెప్పారు. చాలా లోతుగా ఆలోచించి రూపొందించిన ఈ స్పోర్ట్స్ పాలసీతో తెలంగాణలో కొత్త అధ్యాయం మొదలు కావాలని ఆకాంక్షించారు. శనివారం హైదరాబాద్‌‌ హెచ్‌‌ఐసీసీలో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్‌‌ తొలి ఎడిషన్‌‌లో నూతన స్పోర్ట్స్‌‌ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్​ మాట్లాడుతూ.. క్రీడల్లో రాజకీయ జోక్యం తగ్గించడానికి పబ్లిక్, ప్రైవేట్ భాగ స్వామ్యం (పీపీపీ)లో క్రీడా పాలసీ ఉంటుందని వివరించారు. క్రీడలతో పాటు వివిధ రంగాల్లో విజ యవంతమైన వారితో స్పోర్ట్స్‌‌ అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పరిమితమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్.. బలమైన క్రీడా దేశంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ప్రభుత్వంతో పాటు క్రీడా వర్గాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2036 ఒలింపిక్స్‌‌ ఆతిథ్య హక్కులు దేశానికి లభిస్తే.. ఆ విశ్వక్రీడల్లో రెండు విభాగాల నిర్వహణకు రాష్ట్రం సిద్ధంగా ఉందని కేంద్రానికి తెలిపినట్టు చెప్పారు. అలాగే 2026లో ఖేల్ ఇండియా నిర్వహణకు అవకాశం ఇవ్వాలని ఇటీవలే కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. 

ఆటల్లో రాణిస్తే ప్రోత్సహిస్తం.. 

తెలంగాణకు సుదీర్ఘమైన క్రీడా చరిత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నేషనల్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్స్ గేమ్స్‌‌, వరల్డ్ మిలటరీ గేమ్స్‌‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చిందన్నారు. ‘‘1956 ఒలింపిక్స్ లో నాలుగో స్థానం సాధించిన ఇండియా ఫుట్‌‌బాల్‌‌ టీమ్‌‌లో హైదరాబాద్‌‌కు చెందిన వారే 9 మంది ఉన్నారు. మన రాష్ట్రం నుంచి క్రికెట్‌‌లో అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, మహ్మద్ సిరాజ్‌‌, వాలీబాల్‌‌లో రవికాంత్ రెడ్డి,  బాక్సింగ్‌‌లో నిఖత్ జరీన్, పారాలింపిక్స్‌‌లో జీవాంజి దీప్తి వంటి అనేక మంది క్రీడాకారులు సత్తా చాటారు. సిరాజ్, నిఖత్‌‌, దీప్తికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నగదు ప్రోత్సాహకం అందించాం. తద్వారా చదువులోనే కాదు క్రీడల్లో రాణించినా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది.. అండగా నిలుస్తుందనే సందేశం ఇచ్చాం’’ అని పేర్కొన్నారు. 

విజన్ డాక్యుమెంట్‌‌లో స్పోర్ట్స్ పాలసీకి చాప్టర్ 

140 కోట్ల జనాభా ఉన్న  ఇండియాకు గత ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ రాకపోవడం దేశానికే అవమానమని, విశ్వక్రీడల్లో మన దేశం 71వ స్థానంలో నిలవడం అందరూ ఆలోచించాల్సిన విషయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘సౌత్ కొరియాలో కేవలం 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక్క స్పోర్ట్స్ యూనివర్సిటీకి 16 బంగారు పతకాలు వచ్చాయి. ఒక అమ్మాయి ఆర్చరీలో 3 పతకాలు గెలుచింది. ఆ స్ఫూర్తితో తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నాం. క్రీడలకు తెలంగాణను వేదిక చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. విజన్ డాక్యుమెంట్– 2047లో స్పోర్ట్స్ పాలసీకి ఒక చాప్టర్ కేటాయించాం” అని తెలిపారు. ‘‘2036 ఒలింపిక్స్‌‌ నిర్వహించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, అందులో ఒక్క బంగారు పతకం రాకపోతే మన మొహం ఎక్కడ పెట్టుకుంటాం. అందుకే ఒలింపిక్స్‌‌లో రాణించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలి. ఒలింపిక్స్‌‌లో పతకాలు నెగ్గే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా కొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చాం. క్రీడా రంగానికి ఎలాంటి అవసరం ఉన్నా..  ప్రభుత్వం ఒక్క పిలుపు దూరంలో ఉంది. దాదాపు రూ.3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌‌లో ఆటలకు ఎంత  కావాలన్నా కేటాయిస్తాం’’ అని హామీ ఇచ్చారు.  

9 సంస్థలతో ఎంవోయూలు..

రాష్ట్రంలో క్రీడాభివృద్ది, క్రీడాకారులకు ప్రపంచ స్థాయి నైపుణ్యాల శిక్షణలో దోహదం చేసే క్రీడా సంస్థలు, అకాడమీలు, ప్లేయర్లతో సీఎం రేవంత్‌‌రెడ్డి సమక్షంలో తొమ్మిది ఒప్పందాలు చేసుకున్నారు. స్పోర్ట్స్‌‌ మెంటార్‌‌‌‌షిప్ ప్రోగ్రామ్స్‌‌ కోసం గగన్ నారంగ్‌‌ (షూటింగ్‌‌), అభినవ్ బింద్రా (షూటింగ్, స్పోర్ట్స్ సైన్స్‌‌), పుల్లెల గోపీచంద్‌‌ (బ్యాడ్మింటన్‌‌)తో రాష్ట్ర సర్కార్ అగ్రిమెంట్‌‌ కుదుర్చుకుంది. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు చెందిన టెన్‌‌విక్‌‌తోపాటు ఫిఫా టాలెంట్ డెవలప్‌‌మెంట్ స్కీమ్ అకాడమీ, ఒలింపిక్ వ్యాల్యూస్‌‌ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌‌, గన్‌‌ ఫర్ గ్లోరీ, స్పోర్ట్జ్‌‌ప్రి, ఆస్పైర్‌‌‌‌ హర్‌‌‌‌తో ఎంవోయూలు కుదుర్చుకుంది. అనంతరం ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఈవెంట్లలో పతకాలు నెగ్గిన అథ్లెట్‌‌ నందిని అగసార (రూ. 5 లక్షలు), జిమ్నాస్ట్‌‌ నిషిక అగర్వాల్‌‌ (రూ.3 లక్షలు), పారా షూటర్‌‌ ధనుశ్‌‌ శ్రీకాంత్‌‌ (రూ. 10 లక్షలు)తో పాటు ఈజిప్టియన్‌‌ పిరమిడ్స్‌‌ గోల్‌‌బాల్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో పోటీ పడనున్న పవన్‌‌ కల్యాణ్‌‌, సాయితేజలకు రూ. 4 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడా శాఖ సలహాదారు జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​రంజన్‌‌, స్పోర్ట్స్ అథారిటీ వీసీ ఎండీ సోని బాలాదేవి పాల్గొన్నారు. అంతకుముందు ఒలింపియన్స్‌‌ అభినవ్ బింద్రా, గగన్ నారంగ్‌‌, అంజు బాబీ జార్జ్‌‌, మాజీ వాలీబాల్ ప్లేయర్‌‌‌‌ రవికాంత్ రెడ్డి, వరల్డ్ అథ్లెటిక్స్‌‌ వైస్ ప్రెసిడెంట్ అదిల్లే సుమరివాలా తదితరులు ప్యానెల్ డిస్కషన్స్‌‌లో పాల్గొని క్రీడాభివృద్ధికి పలు సూచనలు చేశారు.

మత్తు వదిలిస్తాం..

 రాష్ట్రం ఏర్పడి పదేండ్లు దాటినా ఇప్పటి వరకు క్రీడా విధానం కొరవడటం, క్రీడా మైదానాలు అందుబాటులో లేకపోవడంతో యువత మత్తు పదార్థాలు, ఇతర వ్యసనాల బారిన పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రంలో డ్రగ్స్‌‌, గంజాయి మహమ్మారిని పూర్తిగా రూపుమాపి.. యువతను తిరిగి క్రీడా మైదానాల వైపు మళ్లించేందుకు కూడా ఈ పాలసీ ఉపయోగపడుతుంది. తెలంగాణ చైతన్యవంతమైన గడ్డ.  స్వరాష్ట్ర ఉద్యమంలో యువత ముందుండి పోరాడింది. అలాంటి యువత ఇప్పుడు వ్యసనాల బారిన పడుతుండటం ఆందోళనకరం. ఇటీవల కాలంలో డ్రగ్స్, గంజాయి కేసులు పెరిగాయి. వాటి నియంత్రణకు ఈగల్ ఫోర్స్ ను ఏర్పాటు చేశాం.  గంజాయి, డ్రగ్స్ తీసుకునే వారు ఎంతటి పెద్దవారైనా ఈగల్ వదలదు. రాష్ట్రంలో ఎవరికైనా మత్తు పదార్థాలు తీసుకోవాలన్న ఆలోచన రావాలన్నా భయం కలిగేలా చేస్తాం’’ అని అన్నారు.