
- తాగునీరు, విద్యుత్ వసతి కల్పిస్తం
- ఏడాదిలోపు పంచాయతీ భవనాలు కట్టి, ప్రారంభిస్తం
- రాష్ట్రాభివృద్ధిలో బంజారాల పాత్ర కీలకం
- మంత్రులమంతా ఒక పూట ఉపాసం ఉండైనా.. ఒకనెల జీతం తీసుకోకనైనా చేసి తీరుతం
- 70 రోజుల్లో ఒక్కనాడు కూడా సెలవు తీసుకోలే
- మాది దాక్కునే ప్రభుత్వం కాదు..
- బంజారాలను ఎస్టీల్లో చేర్చిన ఘనత ఇందిరమ్మది
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు భవనాలు కట్టించి ఏడాదిలోపు ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బంజారాహిల్స్ లోని బంజారాభవన్ లో ఇవాళ నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి తండాకు బీటీ రోడ్డు వసతి కల్పిస్తామని, కరెంటు లేని గ్రామాలేమైనా ఉంటే తమ దృష్టి తెస్తే ఆ ఏర్పాటు చేస్తామన్నారు.
తండాలో ఒకరిద్దరు విద్యార్థులున్నా బడి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉజ్వల భవిష్యత్తుకు చదువే కీలకమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలన్నీ ఒకే చోట ఉండేలా 20 ఎకరాల స్థలంలో కాంప్లెక్స్ లు నిర్మిస్తామని, అలా ఉండటం వల్ల సోదర భావం పెంపొందుతుందని చెప్పారు. కొడంగల్ లో ఈ ప్రాజెక్టును మోడల్ గా డెవలప్ చేస్తున్నామని చెప్పారు.
మంత్రులు, ఎమ్మెల్యేలం ఒక పూట ఉపాసం ఉండైనా, ఒక నెల జీతం తీసుకోకుండా ఉండైనా ఇవన్నీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే బంజారాలకు గౌరవం పెరిగిందన్నారు. 1976లో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ బంజారాలను ఎస్టీల జాబితాలో చేర్చారని, ఇందుకు దివంగత జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
70 రోజుల్లో ఒక్క రోజూ సెలవు తీసుకోలే
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుందని, ఇప్పటి వరకు తాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తమది కనిపించకుండా దాక్కునే ప్రభుత్వం కాదని, ప్రజలతో కలిసి మెలిసి ఉండే సర్కారు అని అన్నారు. గత ఎన్నికల్లో తమను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపారని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం పనిచేయాలని, పేద అభ్యర్థులకు పది రూపాయల సాయం కూడా చేయాలని సీఎం కోరారు.