
- సీఎం ను పట్టుకొని పీకనికి పోయిండా అంటరా
- ఎన్నికల్లో ఇప్పటికే ప్రజలు ప్యాంటు ఊడబీకారు
- సంపుతరా అంటున్నరు.. కేసీఆర్ సచ్చిన పాము.. మేమెందుకు సంపుతం
- పారిపోయి ఫాంహౌజ్ లో పండుకున్నకేసీఆర్
- సానుభూతి కోసం వీల్ చైర్ నాటకాలు
- బ్యారేజీ కూలుతుంటే నీళ్లు నింపుమంటరా..?
- అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రజలు ఓడించినా కేసీఆర్ కు బుద్ధి రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..‘నల్లగొండ సభలో తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకొని మేడిగడ్డకు పీకనికి పోయిండ్రా అంటారా.? ఎన్నికల్లో ఇప్పటికే ప్రజలు ప్యాంటు ఊడబీకారు. ఇక అంగీ కూడా ఉండదు. బొక్కబోర్లా పడినా బుద్ధి రాలేదు. మాట్లాడితే కేసీఆర్ ను సంపుతరా అంటున్నారు.
ఆయనో సచ్చిన పాము.. సచ్చిన పామును మేమెందుకు సంపుతం’అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీకి రాకుండా పారిపోయి పాంహౌస్ లో పండుకున్నారని ఎద్దేవా చేశారు. సానుభూతి కోసం వీల్ చైర్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
మేడిగడ్డ మేడిపండులా కుంగిపోతే అందులో నీళ్లు నింపుమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, హరీశ్ రావు గతంలో నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేశారని, వాళ్లకే పెత్తనం ఇస్తామని, నీళ్లు నింపే బాధ్యతను వాళ్లే తీసుకోవాలని అన్నారు. పూర్తి గా ప్రాజెక్టు దెబ్బతిని 94 వేల కోట్లు వృథా అయితే సమాధానం చెప్పలేక, సభకు రాకుండా పారిపోయిన వ్యక్తి సీఎంను పట్టుకొని ఇలా మాట్లాడొచ్చా..? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విషయంపై చర్చకు సిద్ధమైతే కేసీఆర్ ను సభకు పిలవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సభకు రాకుండా పారిపోయి అక్కడెక్కడో ప్రగల్భాలు ఏమిటన్నారు. ‘ఆయన తప్పిచ్చుకుంటడు.. ఈయన వచ్చి కొత్త మాటలు చెప్తడు.. సాగునీటి ప్రాజెక్టులమీద శ్వేత పత్రానికి మా ప్రభుత్వం రెడీగా ఉంది.. అప్పడు చర్చ చేద్దాం.. కాళేశ్వరం కోసం ప్రత్యేకంగా ఒక రోజు చర్చ పెట్టండి..’అని స్పీకర్ కు సీఎం విజ్ఞప్తి చేశారు.