కాళేశ్వరంపై విచారణ చేయండి.. దోషులను శిక్షించండి: హరీష్ రావు

కాళేశ్వరంపై విచారణ చేయండి.. దోషులను శిక్షించండి: హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్ద రాద్దాంతం చేస్తుందని.. మా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు మూడు పిల్లర్లు కుంగితే.. రాజకీయ కక్ష్యతో దాన్ని పునరుద్దరించకుండా రైతులకు నష్టం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంతసేపు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్ కు వెళ్లి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

 ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. పిల్లర్లు కూలిపోయాయని మేడిగడ్డను పునరిద్దరించకుండా.. నీళ్లను నింపకుండా రైతులకు నష్టం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రపంచంలోనే ఎక్కడా ప్రాజెక్టులు కూలిపోలేదన్నట్లు కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని.. కాంగ్రెస్ హయాంలో కడుతుండగానే కూలిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు

కాంగ్రెస్ హయాంలో1958లో కడెం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని..  పునరుద్దరించాక, మళ్లీ1995లో కట్ట మొత్తం కొట్టుకుపోయిందని హరీష్ రావు చెప్పారు.1981,1999లో  సింగూర్ డ్యాం కొట్టుకుపోయిందని చెప్పారు. 2010లో ఎల్లంపల్లి బ్యారేజ్ బాన్సుస్ స్పిల్ వే కొట్టుకుపోయిందన్నారు.

2004లో సాత్నాల ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ కొట్టుకుపోయిందని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఇవ్వాళ్టికీ కొట్టుకుపోయే ఉన్నాయని.. పుట్టంగండి ప్రాజెక్ట్ ఉదయం ప్రారంభిస్తే సాయంత్రానికి నీళ్ళన్నీ బయటకు వచ్చాయన్నారయన. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫ్లైఓవర్ కడుతుండగానే కూలిపోయిందని విమర్శించారు.

 పోలవరంలో డయాఫ్రం వాల్, గైడ్ వాల్ కూడా కొట్టుకుపోయిందన్నారు హరీష్ రావు. రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టు, పించ ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయాయని చెప్పారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు జరిగితే.. విచారణ చేసి.. దోషులను శిక్షించండి.. కానీ రైతులకు నష్టం చేయకండన్నారు- హరీష్ రావు.