కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీళ్లిచ్చామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పిండు : రేవంత్​రెడ్డి

కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీళ్లిచ్చామని కేసీఆర్  పచ్చి అబద్ధాలు చెప్పిండు :  రేవంత్​రెడ్డి

కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీళ్లిచ్చామని ఇన్నాళ్లూ కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని రేవంత్​అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ కు ఇప్పటి వరకు రూ.94 వేల కోట్లు ఖర్చు పెట్టి కేవలం 95 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారన్నారు. మరో రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టి  మొత్తం ప్రాజెక్ట్‌‌ పూర్తి చేసినా 19 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వగలమన్నారు. అలాంటిది కేసీఆర్‌‌ కోటి ఎకరాలకు నీళ్లిచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఏటా 180 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయాల్సిన కాళేశ్వరం ద్వారా గడిచిన 5 ఏండ్లలో కనీసం 160 టీఎంసీ లు కూడా ఎత్తి పోయలేదన్నారు. 

ప్రాజెక్ట్‌‌ మొత్తం అంచనా వ్యయం లక్షా 27 వేల  కోట్లయితే ప్రాజెక్ట్‌‌ రన్‌‌ చేయడానికి యేటా కరెంట్​ బిల్లులే  రూ.10,500 కోట్లు కట్టాల్సి ఉంటుందని, మెయింటెనెన్స్‌‌, అప్పులు, వడ్డీ చెల్లింపుల కోసం మరో రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాలన్నారు. 2020 లోనే మేడిగడ్డ బ్యారేజీలో సమస్య ఉందని ఇక్కడి అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారని, అయినా నాటి సర్కారు పట్టించుకోకపోవడం వల్లే ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలన్నీ ఒకే విధంగా నిర్మించారని, వీటిలో నీళ్లు నిల్వ చేస్తే కూలిపోయే ప్రమాదం ఉందని ఎక్స్​పర్ట్స్ హెచ్చరిస్తున్నారని సీఎం వెల్లడించారు. అందువల్ల ఇంజినీరింగ్ నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌పై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. 2023 అక్టోబర్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు వచ్చి కుంగిన మేడిగడ్డ ను పరిశీలించి, లోపాల గురించి వివరించారని మొత్తం ఆరు రకాల  టెస్టులను సూచించారన్నారు.