రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల్లో కాకా వెంకటస్వామి కుటుంబం పాత్ర క్రియాశీలకంగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ అభివృద్ధికి రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కాకా ఫ్యామిలీ నుంచి సహకారం తీసుకుంటామని చెప్పారు రేవంత్. ఇది పార్టీ ఆలోచన అని అన్నారు .రవీంద్ర భారతీలో కాకా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్... వెంకటస్వామి స్ఫూర్తితో వారి ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో కాకా కుటుంబానికి చోటు ఉంటుందని తెలిపారు.
సింగరేణిని కాపాడటానికి కాకా అప్పట్లో రూ. 450 కోట్లను అప్పు ఇప్పించి దాన్ని నిలబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు సింగరేణి ఉద్యోగులు, కార్మికులు ఈ బువ్వ తింటున్నారు అంటే అది కాకా చలవేనన్నారు. నెహ్రూను చాచా అంటే.. వెంకటస్వామిని కాకా అనే గుర్తింపు దేశంలో వీళ్లిద్దరికే ఉందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఢిల్లీలోని కాకా ఇళ్లే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంగా ఉందన్నారు.
ఇందిరాగాందీ కుటుంబానికి.. వెంకటస్వామి కుటుంబానికి ఎంతో సన్నిహిత్యం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మల్లికార్జున ఖర్గే ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా వెంకటస్వామిని గుర్తు చేసుకుంటారని తెలిపారు. ఖర్గే స్వయంగా చెప్పటంతోనే అప్పట్లో వివేక్ ను కలిసి పార్టీలోకి తీసుకురావటం జరిగిందన్నారు. ప్రాణహిత చేవెళ్లకు వెంకటస్వామి సూచనతోనే అంబేద్కర్ పేరు పెట్టారని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వెంకటస్వామి ఆలోచన అని.. ఆ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు రేవంత్.
జాతీయ స్థాయి నేతల్లో కాకా ఒకరని అన్నారు రేవంత్. కాకా జయంతి, వర్థంతిని అధికారికంగా నిర్వహించాల్సిన వాళ్లు అసూయతోనో, ద్వేషంతోనో నిర్వహించకుండా వదిలేశారని బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు కోసమే కాంగ్రెస్తో టీఆర్ఎస్కు పొత్తు కుదిర్చారని సీఎం చెప్పారు. ఖర్గే సూచనతోనే కాకా ఫ్యామిలీని కాంగ్రెస్లోకి ఆహ్వానించామని, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలను కాకా కుటుంబం సద్వినియోగం చేసుకుందని సీఎం తెలిపారు.