చాలామంది ఇంట్లో మొక్కలను పెంచుకుంటారు. ఇంట్లో పచ్చదనం ఉంటే వాతారణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాని ప్రతి మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి స్థలం సరిపోదు. ఇంట్లో ఉండే కాంతి, స్థలం, మొక్కలను సంరక్షించేందుకు కేటాయించగల సమయం వంటి అంశాల ఆధారంగా ఎలాంటి మొక్కలను పెంచాలో ఎంచుకోవాలి. ఇంట్లో సులభంగా పెరిగి... ఎక్కువ సంరక్షణ అవసరం లేని కొన్ని ముఖ్యమైన మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొక్కల పెంపంకం వలన ఇంటికి అందమే కాదు.. ఆ ఇంట్లో ఉండే వారి మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని మొక్కలు గాలిని శుద్ది చేసి పొల్యూషన్ ను కూడా తగ్గిస్తాయి.
ఎరికా మొక్క: ఈ మొక్క ఆకులు ఇంటికి చాలా అందాన్ని ఇస్తుంది. తక్కువ స్థలంలో తొందరగా.. చాలా వేగంగా పెరుగుతుంది. ఈ మొక్కను ఇంటిలోపల పెంచుకోవచ్చు. దీనికి పెద్దగా సూర్యకాంతి అవసరం లేదు... అంతేకాదు రోజూ నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. అపార్ట్మెంట్లలో ఉండే వారు కూడా ఈ మొక్కను చాలా ఈజీగా పెంచుకోవచ్చు.
పీస్ లిల్లీ : నిత్యం ఏవేవో పనులు.. చాలా బిజీగా ఉంటాం.. అయినా సరే ఉన్న ఇల్లు అందంగా ఉండేందుకు చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటాం. కుటుంబంలో ఎవరో ఒకరు నీళ్లు పోస్తారు. వారు పోశారని వీరు.. వీరు పోశారని వారు కుటుంబసభ్యులు మొక్కలకు నీరు పోయడం మర్చిపోతారు. అలాంటి కుటుంబాలు నివసించే ఇళ్లలో ఈ మొక్కలు పెంచుకోవడం చాలామంచిది. ఈ మొక్కకు ఒక ప్రత్యేకత ఉంది. నీళ్లు అవసరమైనప్పుడు వాటి ఆకులు వాలిపోతాయి. అంటే ఆ మొక్కకు నీళ్లు కావాలని ఆకుల రూపంలో సంకేతం ఇస్తుంది.
నీరు పోసిన కొన్ని గంటల్లోనే మళ్లీ చాలా అందంగా... ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి ఉండే తెల్లటి పువ్వలు... ఆకులు .. చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇంట్లో ఏ రూంలో ఉంచినా సరే ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
స్పైడర్ : ఈ మొక్క స్పెషాలిటీ వేరు. ఈ మొక్క ఆకులు సాలెపురుగు మాదిరిగా చాలా పెద్దవిగా ఉంటాయి. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ మొక్కను కుండీలో పెంచి.. టేబుల్ పై పెడితే ఆ అందమే వేరుగా ఉంటుంది. ఈ మొక్క కుండీని బాల్కనీలో వేలాడే విధంగా ఉంచుకోవచ్చు. ఒకటి నాటితే చాలు చిన్న చిన్న మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. తక్కువ కాంతి ఉన్న ప్రదేశంలో ఈ మొక్క బాగా ఏపుగా పెరుగుతుంది.
జెడ్‌జెడ్ మొక్క: ఇది మరో ఇండోర్ మొక్క.. దీని ఆకులు మెరుస్తూ ఉంటాయి. అందువలన దీనిని జాంజిబార్ రత్నం అనే పేరుతో కూడా పిలుస్తారు. దీనిని ఇంట్లో ఉంచితే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా నెమ్మదిగా పెరుగుతుంది. పూర్తిగా పెరిగిన తరువాత ఈ మొక్క ఇంటి అలంకరణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనికి రోజూ నీరు పోయాల్సిన అవసరం ఉండదు. ఈ మొక్క పెరిగే కుండీలోని మట్టిలో తేమ ఉంటే సరిపోతుంది. తక్కువ కాంతిలో ఈ మొక్క బాగా పెరడగంతో ఆఫీసుల్లో కూడా పెంచుకోవచ్చు.
హార్ట్ లీఫ్ ఫిలోడెండ్రాన్: ఈ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. దీని ఆకులు గుండె ఆకారంలో ఉంటాయి. దీనిని షెల్ఫ్లపై వేలాడదీసే కుండీలో పెట్టుకోవచ్చు. గాలిని శుద్ది చేయడంలో కీలకపాత్రపోషిస్తుంది. ఈ మొక్క ఇంటి అందంతో పాటు ఆ ఇంట్లో ఉండే వారి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.
ఇండోర్ మొక్కలను కిటికీల దగ్గర.. బాల్కనీల దగ్గర.. వరండాలో ఉంచితే బాగా ఏపుగా పెరుగుతాయి. కుండీలో ఎక్కువ నీరు పోయకుండా సూర్యకాంతి పడని ప్రదేశంలో వెలుతురు వచ్చే ప్రదేశంలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
