ప్రేయసి చనిపోయిందని... మద్యంలో విషం కలుపుకొని తాగి యువకుడి ఆత్మహత్య..

ప్రేయసి చనిపోయిందని... మద్యంలో విషం కలుపుకొని తాగి యువకుడి ఆత్మహత్య..

హైదరాబాద్ లో ప్రేయసి ఆత్మహత్య చేసుకుందని.. విశాఖలో ఓ యువకుడు మద్యంలో విషం కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలోని భీమిలిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న శ్యామ్ కుమార్ విశాఖలోని భీమిలి దగ్గర ఉన్న లాడ్జిలో మద్యంలో విషం కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నా చావుకు ఎవరు కారణం కాదు, సారీ అమ్మ అంటూ శ్యామ్ కుమార్ రాసిన సూసైడ్ నోట్ ను గుర్తించారు పోలీసులు.ప్రేయసి పావనితో గొడవ, ఆమె ఆత్మహత్య కారణంగానే శ్యామ్ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న శ్యామ్, పావని మధ్య గొడవ జరిగిందని.. ఈ కారణంగా పావని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పావని చనిపోవడంతో శ్యామ్ హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లాడని.. భయంతోనే మద్యంలో విషం కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఉండచ్చని భావిస్తున్నారు పోలీసులు.

భీమిలి సమీపంలోని ఓ లాడ్జిలో దిగిన శ్యామ్.. ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి స్పేర్ కీతో ఓపెన్ చేసి చూశామని అంటున్నారు లాడ్జి సిబ్బంది. అప్పటికే శ్యామ్ విగతజీవిగా పడి ఉన్నాడని తెలిపారు లాడ్జి సిబ్బంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు సిబ్బంది. 

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రూమ్ లో రెండు సూసైడ్ నోట్ లు, ఎలుకల మందు ప్యాకెట్ లు గుర్తించామని తెలిపారు. శ్యామ్ స్వస్థలం విశాఖలోని పాత పోస్టాఫీస్ ప్రాంతమని..అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించామని తెలిపారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని... ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.