శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు :  ఎస్పీ రాజేశ్చంద్ర  

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు :  ఎస్పీ రాజేశ్చంద్ర  

బాన్సువాడ, వెలుగు : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజేశ్​చంద్ర హెచ్చరించారు. శనివారం బాన్సువాడ పోలీస్​స్టేషన్​లో విలేకరులతో ఎస్పీ మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం బాన్సువాడ స్మార్ట్ బజార్​లో గొడవ జరిగిందన్నారు. గొడవ చేసిన వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని, అతడిని కొట్టిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. రెండు వర్గాలు రాళ్లు విసురుకోగా కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని చెప్పారు.

ఎవరెవరు రాళ్లు రువ్వారో సీసీ ఫుటేజ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామని, ఇప్పటికి 42 మందిపై కేసు నమోదు చేశామన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, చలో బాన్సువాడ అంటూ పోస్టులు పెట్టారని అలాంటివి చేయకూడదన్నారు.  బాన్సువాడ బంద్ ఎవరు బలవంతంగా చేయించవద్దని తెలిపారు. తొమ్మిది, పది చోట్ల పోలీస్ పికెటింగ్ పెట్టామని, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, అదనపు బలగాలు తెప్పించామన్నారు. 144 సెక్షన్ అవసరం లేదని, పరిస్థితి అదుపులో ఉందని ఎస్పీ చెప్పారు. ఆయన వెంట బాన్సువాడ డిఎస్పీ విట్టల్ రెడ్డి, ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసరావు, బాన్సువాడ సీఐ శ్రీధర్, రూరల్ సీఐ తిరుపతయ్య ఉన్నారు.