
- బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇప్పటికే చర్చలు జరిగినయ్
- అందుకే ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
- కేటీఆర్ చెప్తేనే మెట్రో ఫేజ్ 2నూ కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నడు
- ఈ ప్రాజెక్టుకు ఎల్అండ్టీ కూడా సహకరిస్తలేదు
- 2018 ఎన్నికల్లో రాష్ట్రంలోనూ 24 లక్షల ఓట్లు తొలగించారు
- అమరుల తల్లుల ఉసురు తగిలే కేసీఆర్ కుటుంబంలో ముసలం
- కల్వకుంట్ల ఫ్యామిలీలో నలుగురు కలిసి ఆడబిడ్డను టార్గెట్ చేశారు
- బీజేపీ, బీఆర్ఎస్ దుష్ప్రచారం వల్లే యూరియా సమస్య
- సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం
- మైనార్టీలకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని వెల్లడి
- ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్‌చాట్
న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ జరగకుండా కేటీఆర్, కిషన్ రెడ్డి కుట్ర పన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘ కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీని కేటీఆర్ అడ్డుకుంటున్నడు. ఇందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తున్నడు. ఇందుకోసం బీఆర్ఎస్, బీజేపీ మధ్య తొలి విడత చర్చలు కూడా జరిగాయి. బదులుగానే ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది” అని చెప్పారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లోనే విచారణ జరుపుతామని చెప్పిన కిషన్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు దాక్కున్నారని, సీబీఐ ఎంక్వైరీకి అప్పగించి ఇన్ని రోజులైనా దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు సీబీఐ కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. ‘‘రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్‌లో ఉన్నడు. కిషన్ రెడ్డికి సొంతంగా ఆలోచించే శక్తి లేదు. కేటీఆర్ ఏం చెప్తే, అది కిషన్ రెడ్డి చేస్తడు. మెట్రో విస్తరణను సైతం కేటీఆర్ చెప్పడం వల్లే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నడు’’ అని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్ చేశారు. కాళేశ్వరంపై సీబీఐ కేసు నమోదు చేస్తే, అన్ని వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
ప్రస్తుత మెట్రో రూట్లను చివరి పాయింట్ వరకు విస్తరిస్తూ ఫేజ్ 2లో 76 కిలోమీటర్ల నిర్మాణానికి కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉంచాం. కానీ ఇది ముందుకు సాగకుండా కుట్ర చేస్తున్నారు. కేటీఆర్ డైరెక్షన్‌లోనే కిషన్ రెడ్డి దీన్ని అడ్డుకుంటున్నడు. మెట్రో విస్తరణకు ఎల్అండ్ టీ సైతం సహకరిస్తలేదు. ‘మెట్రో ఫస్ట్ ఫేజ్ లో 70 కిలోమీటర్ల కోసం దాదాపు రూ.20 వేల కోట్లు ఖర్చు చేశాం. ఈ ప్రాజెక్ట్ వల్ల మేం నష్టపోయాం’ అని ఎల్అండ్ టీ అంటున్నది. అందువల్ల ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోయాలని డిమాండ్ చేస్తున్నది. ఇలాంటి టైమ్‌లో మెట్రో ఫేజ్ 2 కోసం ఎల్అండ్ టీతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం సూచించడం సరికాదు. - సీఎం రేవంత్ రెడ్డి
ఎన్డీఎస్ఏ, ఘోష్ కమిషన్ రిపోర్టులు, ఇతర వివరాలు అందజేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ఇవన్నీ సీబీఐకి ఆధారంగా మారుతాయని పేర్కొన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు పరిధిలో ఉందని, లేదంటే ఆ కేసును కూడా సీబీఐకి అప్పగించేందుకు తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. ‘‘బిహార్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రచారానికి వెళ్తాను. ప్రశాంత్ కిషోర్ దక్షిణాది రాష్ట్రాల్లో పని చేయవచ్చు కానీ.. మేం ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లకూడదా?. ఓటు చోరీ అంశంపై మొదట స్పందించింది నేనే. 2018 ఎన్నికల్లో తెలంగాణలోనూ 24 లక్షల ఓట్లు తొలగించారు. ఒక్క కొడంగల్ నియోజకవర్గంలోనే 50 వేల ఓట్లను తొలగించారు” అని వెల్లడించారు. జీఎస్టీ మార్పులతో తెలంగాణకు రూ.8 వేల కోట్ల నష్టం వస్తుందని, కనీసం ఐదేండ్లు కేంద్రం ఈ నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ముంబై పోలీసులు వచ్చి చర్లపల్లిలో డ్రగ్స్తయారీ ముఠాను పట్టుకోవడం రాష్ట్ర సర్కార్ వైఫల్యమని కేటీఆర్ అంటున్నారు. తెలంగాణ పోలీసుల ప్రమేయం లేనిదే ముంబై పోలీసులు ఆ స్థాయి ఆపరేషన్ఎలా చేస్తారు? తన బావమరిది ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్పట్టుబడినప్పుడు కూడా కేటీఆర్ ఇదే తరహాలో స్పందిస్తే బాగుండేది” అని చురకలంటించారు.
అది కేసీఆర్ కుటుంబ పంచాది..
ఉద్యమంలో ఎమోషనల్ పేరుతో కేసీఆర్ 100 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ పాపం తగలకుండా పోదని, పిల్లల్ని కోల్పోయిన తల్లుల ఉసురు తగిలి ఇప్పుడాయన కుటుంబంలో ముసలం పుట్టిందని వ్యాఖ్యానించారు. తన ఒక్కగానొక్క కూతురు వివాహ వేడుకకు దూరమైన బాధ.. పిల్లల్ని కోల్పోయిన తల్లుల త్యాగాల కన్నా గొప్పది కాదన్నారు. ‘‘బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు కేటీఆర్, హరీశ్‌రావు ప్రయత్నం చేశారని కవిత స్వయంగా చెప్పారు. దీంతో కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్ రావు కలిసి ఆడబిడ్డ కవితను టార్గెట్ చేశారు. నేనేమీ కవితకు సపోర్ట్ చేయడం లేదు. ఇది వాళ్ల ఇంటి పంచాది. కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి, కవితను కేసీఆర్ పక్కన పెట్టారు. అధికారం, ఆస్తుల కోసం వాళ్లు రోడ్డెక్కారు. కుల పెద్ద కూర్చోబెట్టి మాట్లాడితే... ఈ పంచాది సద్దుమణుగుతుంది. వాళ్లింట్లో పంచాయితీ వల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చేది, పోయేదేమీ లేదు. కేసీఆర్ కుటుంబాన్ని ఏనాడో సమాజం బహిష్కరించింది” అని అన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరాడుతున్నదని.. చట్టసభల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కేటాయించాలనే అంశపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు.
బీఆర్ఎస్, బీజేపీ వల్లే యూరియా సమస్య..
ఈ సీజన్‌లో కేంద్రం నుంచి రాష్ట్ర వాటా కింద 9.8 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉందని, కానీ అందుకు తగ్గట్టు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి నెల యూరియా కోటాలో కేంద్రం కోత పెట్టడం వల్ల రాష్ట్రంలో గందరగోళం ఏర్పడిందని చెప్పారు. దీన్ని ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్, బీజేపీ నేతలు యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఆందోళనకు గురిచేశారన్నారు. ‘‘మావోయిస్టులు లొంగిపోవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. వారికి జనజీవన స్రవంతిలో కలిసే అవకాశం ఉంది. పాకిస్తాన్ టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్న కేంద్రానికి.. మావోయిస్టులుగా మారిన మన దేశ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లతో చర్చలు జరపడానికి ఉన్న ఇబ్బంది ఏంటి? మావోయిస్టుల లొంగుబాటు విషయంలో కేంద్రం దయ చూపాలి. తెలంగాణలో ఇటీవల మాజీ మావోయిస్టు సుజాతక్క లొంగిపోయారు” అని పేర్కొన్నారు. ఏపీ మంత్రి లోకేశ్ ఎవరినైనా కలువచ్చునని, అందుకు తన అనుమతి అక్కర్లేదని అన్నారు. లోకేశ్ తనకు తమ్ముడని కేటీఆర్ అంటున్నారని, అలాంటప్పుడు తండ్రి లాంటి చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సమయంలో రోడ్లపైకి వచ్చిన ప్రజలను కొడుతున్నప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ఆ ఎమ్మెల్యేలపై వాళ్లకే క్లారిటీ లేదు..
10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని పదే పదే కేటీఆర్, హరీశ్‌రావు ఆరోపిస్తున్నారని.. కానీ ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో వాళ్లకే క్లారిటీ లేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘మాకు సభలో 37 మంది సభ్యులు ఉన్నారని, మాట్లాడేందుకు సమయం కావాలని హరీశ్ రావు అంటాడు. 10 మంది పార్టీ ఫిరాయించారని కేటీఆర్ అంటున్నారు. బీఆర్ఎస్ లోనే ఉన్నాం, మా జీతాల్లో ప్రతినెలా 5వేలు ఎల్పీకి ఇస్తున్నామని ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో కేటీఆర్, హరీశ్‌కే తెలియాలి’’ అని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని స్పీకర్‌కు చెప్పినట్టు వెల్లడించారు. మైనారిటీ వర్గానికి మంత్రి పదవి తప్పకుండా ఇస్తామని, కానీ ఎవరవుతారో ఇప్పుడే చెప్పలేమన్నారు.
నీళ్ల లెక్కలేవీ సరిగా లేవు..
నీటి వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్పష్టమైన లెక్కలు లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో నీటి వినియోగంపై గందరగోళం నెలకొందని చెప్పారు. ‘‘గోదావరిలో 968 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. కానీ ఏ ప్రాజెక్ట్ కింద ఎంత నీటిని వాడుకుంటున్నామో తెలియదు. గత కేసీఆర్ సర్కార్ అప్పుల కోసం ఒక ఆయకట్టును ఇంకో ప్రాజెక్ట్ కింద చూపింది. అలాగే ఒక ప్రాజెక్ట్ కింద నీటి వినియోగాన్ని ఇంకో ప్రాజెక్ట్ కిందకు తెచ్చారు. దీంతో రాష్ట్రం ఎంత నీటిని వినియోగిస్తుందో ఎవరికీ తెలియకుండా పోయింది’’ అని వెల్లడించారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ కింద ఎన్ని నీళ్లు వాడుతున్నాం? ఏ ప్రాజెక్ట్ కు కేంద్ర అనుమతులు లేవనే వివరాలు తీయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ‘‘కృష్ణా నదిలో 904 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నాం. ఇందులో నికర, వరద, మిగులు జలాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ వేయనున్నాం” అని చెప్పారు.
సుప్రీం తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు..
సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘రాష్ట్రాలు పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించాలా? వద్దా? అన్న అంశంపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది. త్వరలో తీర్పు వెలువడనుంది. ఆ తీర్పు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటాం. కానీ సెప్టెంబర్ 30 లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ గడువు దగ్గర పడుతోన్న నేపథ్యంలో న్యాయనిపుణుల సలహాల మేరకు ముందుకుకెళ్తాం” అని చెప్పారు.
తప్పులు కేసీఆర్‌వి.. శిక్షలు ప్రజలకా..?
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్, మెట్రో ఫేజ్ 2కు కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. 360 కిలోమీటర్ల ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీనే హైదరాబాద్ వేదికగా మాటిచ్చారని గుర్తు చేశారు. ‘‘ప్రస్తుత మెట్రో రూట్లను చివరి పాయింట్ వరకు విస్తరిస్తూ ఫేజ్ 2లో 76 కిలోమీటర్ల నిర్మాణానికి కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉంచాం. కానీ ఇది ముందుకు సాగకుండా కుట్ర చేస్తున్నారు. కేటీఆర్ డైరెక్షన్‌లోనే కిషన్ రెడ్డి దీన్ని అడ్డుకుంటున్నడు. మెట్రో విస్తరణకు ఎల్అండ్ టీ సైతం సహకరిస్తలేదు. ‘మెట్రో ఫస్ట్ ఫేజ్ లో 70 కిలోమీటర్ల కోసం దాదాపు రూ.20 వేల కోట్లు ఖర్చు చేశాం. ఈ ప్రాజెక్ట్ వల్ల మేం నష్టపోయాం’ అని ఎల్అండ్ టీ అంటున్నది. అందువల్ల ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోయాలని డిమాండ్ చేస్తున్నది. ఇలాంటి టైమ్‌లో మెట్రో ఫేజ్ 2 కోసం ఎల్అండ్ టీతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం సూచించడం సరికాదు” అని అన్నారు. ‘‘ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది హైద్రాబాద్ మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. దాన్ని విస్తరిస్తే రోజుకు 15 లక్షల మంది ప్రయాణం చేస్తారు. కానీ ఈ ప్రాజెక్టును కేటీఆర్ డైరెక్షన్‌లో కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. కేసీఆర్, ఎల్అండ్ టీ కారణంగానే మెట్రో ఫస్ట్ ఫేజ్ నిర్మాణం ఆలస్యమైంది. వాళ్లు చేసిన తప్పులకు ప్రజలపై భారం మోపి శిక్షిస్తామంటే ఒప్పుకోను. ఈ విషయంలో ప్రభుత్వం చెప్పినట్లే ఎల్అండ్ టీ సంస్థ వినాలి” అని తేల్చి చెప్పారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం పీపీపీ మోడల్‌లో సాధ్యం కాదని, అందుకే ప్రభుత్వమే నిర్మించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
నేడు పంచాయతీ రాజ్ అధికారులతో సీఎం భేటీ
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సీఎం రేవంత్ శనివారం సమావేశం కానున్నారు. పంచాయతీల్లో అభివృద్ధి పనుల తీరు, ఆదాయ వనరులతో పాటు స్థానిక ఎన్నికలపై ఆయన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పంచాయతీల్లో పెండింగ్ పనులు, అవసరమైన వనరులు, ఎన్నికల ప్రక్రియకు సంబం ధించి అధికారులు చేసిన కసరత్తుపై పూర్తి వివరాలతో రావాలని సీఎంవో నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఇప్పటివకే పలుమార్లు పంచాయతీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాగా.. శనివారం జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకున్నది.