ఓటు మీది రాష్ట్రాభివృద్ధి బాధ్యత మాది.. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకుని ఓటెయ్యండి: సీఎం రేవంత్ రెడ్డి

ఓటు మీది రాష్ట్రాభివృద్ధి బాధ్యత మాది.. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకుని ఓటెయ్యండి: సీఎం రేవంత్ రెడ్డి
  •  
  • వచ్చే ఎనిమిదేండ్లలో వందేండ్లకు సరిపడా డెవలప్‌‌మెంట్ చేస్తం: సీఎం రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదు 
  • సెంటిమెంటా? డెవలప్‌‌మెంటా?.. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి 
  • కేటీఆర్, కిషన్ రెడ్డి తోడు దొంగలు.. రాష్ట్రాభివృద్ధికి వాళ్లిద్దరూ అడ్డుపుల్లలు వేస్తున్నరు
  • హైదరాబాద్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ను కిషన్ రెడ్డి పనిగట్టుకొని ఆపుతున్నడు     
  • జూబ్లీహిల్స్‌‌లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు.. అందుకే మోదీ, షా ప్రచారానికి రాలే  
  • చెల్లెను, మాగంటి తల్లిని అవమానించిన కేటీఆర్.. మహిళలకు ఏం న్యాయం చేస్తడు? 
  • తెలంగాణ ఉద్యమ ఆత్మను చంపిందే కేసీఆర్‌‌‌‌..  ‘మీట్ ది ప్రెస్’లో సీఎం వ్యాఖ్యలు  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2034 వరకు తామే అధికారంలో ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎనిమిదేండ్లలో వందేండ్లకు సరిపడా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రచించుకుంటూ.. ముందుకెళ్తామని తెలిపారు. ‘‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఆగిపోయిన అభివృద్ధిని కూడా వచ్చే ఎనిమిదేండ్లలో పూర్తి చేస్తాం. రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో, దానికి కొనసాగింపుగా మా ప్రభుత్వం డెవలప్‌‌మెంట్ చేస్తుంది. ఇందులో భాగంగా మెట్రో సెకండ్ ఫేజ్, హైదరాబాద్‌‌కు గోదావరి జలాల తరలింపు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌‌మెంట్, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మచిలీపట్నం వరకు డ్రైపోర్టు, శ్రీశైలం వరకు నేషనల్ హైవే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ తదితర ప్రాజెక్టులను పూర్తి చేస్తాం’’ అని అన్నారు.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను ప్రపంచంలోనే ఒక గొప్ప సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం” అని వెల్లడించారు. ఆదివారం హోటల్ తాజ్‌‌‌‌‌‌‌‌కృష్ణాలో హైదరాబాద్ ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు. 

కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి..

కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘2004  నుంచి 2014 వరకు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో అభివృద్ధి చేశాయి. కేంద్రంలో సోనియా, మన్మోహన్ నేతృత్వంలో.. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య హయాంలో ఎప్పటికీ గుర్తుండే అభివృద్ధి జరిగింది. శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు, ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్, నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థ.. వీటి ఫలితంగానే హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగింది. ఐటీ, ఫార్మా, ఐఎస్‌‌‌‌‌‌‌‌బీ వంటి ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఏర్పడడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. ప్రపంచానికి అందించే బల్క్ డ్రగ్‌‌‌‌‌‌‌‌లో మన నగరం నుంచే 40 శాతం ఉత్పత్తి అవుతున్నది. కరోనా సమయంలో నాలుగు వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌లు వస్తే, అందులో మూడు మన హైదరాబాద్ నుంచి ఉత్పత్తి అయినవే. ఇటీవల ‘ఎలీ లిల్లీ’ వంటి ప్రపంచ దిగ్గజ ఫార్మా సంస్థ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఒక బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇది మన హైదరాబాద్ గొప్పతనం. ఇంకో పక్క జలయజ్ఞం ఫలితంగానే రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం జరిగి సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పాయి. ఇదంతా 2004 నుంచి 2014 కాలంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధే” అని పేర్కొన్నారు.  

బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నం.. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మోదీ, అమిత్ షా ప్రచారానికి దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. ‘‘గల్లీ ఎన్నికలైన జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎలక్షన్ టైమ్‌‌‌‌‌‌‌‌లో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మ వంటి వారు వచ్చి ప్రచారం చేశారు. మరి జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారానికి ఎందుకు రావడం లేదు?’’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటేనే పొడగిట్టని బీజేపీ నేతలు ఈ ఎన్నికలో ప్రచారం చేయకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. అందుకే బీఆర్ఎస్ అంటే ఒంటికాలిపై లేచే ఆ పార్టీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ప్రచారానికి రానియ్యలేదు. కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా చివరి రోజుల్లో ప్రచారానికి రావాల్సిన పరిస్థితిని మేమే తీసుకువచ్చాం. లేకుంటే ఆయన కూడా వచ్చే వారు కాదు. ఇదంతా బీజేపీ ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు అవయవదానం చేయడానికే. అందుకే ఇక్కడ బీజేపీకి డిపాజిట్ కూడా రాదని నేను బలంగా చెప్తున్నాను” అని పేర్కొన్నారు. 

కేటీఆర్ దశ మంచిగ లేదు.. 

కేసీఆర్ ధృతరాష్ట్రుడని, కండ్లకు గంతలు కట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కన్న ప్రేమ గుడ్డిదని, పిల్లలు చేసిన దురాగతాలను ఆయన భరిస్తూ వచ్చారని అన్నారు. కన్న కొడుకు కోసం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఆత్మనే చంపాడని ధ్వజమెత్తారు. కేటీఆర్ దశనే మంచిగ లేదని, దిశతో దశ మారుతుందా? అని ప్రశ్నించారు. ‘‘సొంత చెల్లిని, మాగంటి గోపీనాథ్ తల్లిని నడిబజారులో కేటీఆర్ అవమానించారు. అలాంటి వ్యక్తి మహిళలకు, ప్రజలకు ఎలా రక్షణగా ఉంటాడు. ఆయనను ఎవరు నమ్ముతారు?” అని అన్నారు. ‘‘బీసీ రిజర్వేషన్ల కోసమే స్థానిక ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ విషయంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల తీరు సరిగా లేదు. ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేసే ధోరణి మంచిది కాదు. ఏ కాలేజీ యాజమాన్యం అయినా సరే వంద శాతం నిబంధనలను పాటించినట్లయితే, వారికి  24 గంటల్లోనే  బకాయిలు చెల్లిస్తాం. దీనిపై ఓ కమిటీని వేసి, తనిఖీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ నిబంధనలన్నీ ఉల్లంఘించి, బకాయిల విషయంలో మొండికేస్తే మంచిది కాదు. ఎలాగో ప్రభుత్వం బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు కాలేజీలు బంద్ పెడితే విద్యార్థులు నష్టపోతారు. దీనికి ఎవరిది బాధ్యత?” అని సీఎం ప్రశ్నించారు.

గుజరాత్‌‌కు కిషన్‌‌రెడ్డి గులాంగిరి.. 

కేటీఆర్, కిషన్ రెడ్డి తోడు దొంగలు అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.  వాళ్లిద్దరూ రాష్ట్రాభివృద్ధికి అడ్డుపుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. ‘‘కేంద్రం కొన్ని విషయాల్లో మాకు  సహకరిస్తున్నది. అయితే కిషన్ రెడ్డి సిటీకి సంబంధించిన కొన్ని అభివృద్ధి పనుల్లో అడ్డుపడడంతోనే కేంద్రం మాకు సహకరించడం లేదు. సిటీ బయట పనుల విషయంలో ఆ పార్టీ ఎంపీలు మాకు సహకరిస్తున్నారు. దీంతో కేంద్రం నుంచి మాకు సహకారం దొరుకుతున్నది. ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2, మూసీ రివర్ ఫ్రంట్, ట్రిపుల్ ఆర్ వంటి విషయాల్లో కిషన్ రెడ్డి జోక్యం చేసుకొని అడ్డుతగలడంతోనే కేంద్రం నుంచి తగిన సహకారం అందడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌‌కు కిషన్ రెడ్డి ఇంకెంత కాలం గులాంగిరి చేస్తారని ప్రశ్నించారు. కేటీఆర్, కిషన్ రెడ్డి పనిగట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారని మండిపడ్డారు.  
 
కేసీఆర్ చేసిందేమీ లేదు.. 

కేవలం రెండేండ్ల పాలనలోనే రాష్ట్రంలో ఎంతో అభివృద్ధిని చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్ కనెక్షన్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నం. తెలంగాణ తల్లి గీతాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజలకు అందించాం. 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేశాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నం. రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్‌‌‌‌‌‌‌‌ను రూ.10 లక్షలకు పెంచాం” అని తెలిపారు. ‘‘కేసీఆర్ పదేండ్ల పాలనలో చేసిందేమీ లేదు. ఆయన చేసిందేమిటంటే అమరవీరుల స్థూపం,  ప్రగతి భవన్ , కమాండ్ కంట్రోల్ సెంటర్, సెక్రటేరియట్.. ఈ నాలుగింటిని మాత్రం నిర్మించాడు. వీటి వల్ల ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? ఇవి ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరిపై నిఘా కోసం కట్టిండు? వీటి అంచానాలను భారీగా పెంచి వందల కోట్లు దండుకున్నారు. ఒకే ఒక్క ప్రాజెక్టు కాళేశ్వరం కట్టి, దాన్ని మూడేండ్లు తిరగకముందే కూలేశ్వరం చేసిండు. అందులో లక్షన్నర కోట్లు దిగమింగారు” అని మండిపడ్డారు. 

డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు ఓటెయ్యండి.. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను గెలిపిస్తే, ఆ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా జూబ్లీహిల్స్ ప్రజలు సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌కు ఓటు వెయ్యాలా? డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు ఓటు వెయ్యాలా? అనేది ఆలోచించుకోవాలని సూచించారు. ‘‘కంటోన్మెంట్‌‌‌‌‌‌‌‌లో ఉప ఎన్నిక జరిగితే, అక్కడి ప్రజలు అభివృద్ధిని కోరుకొని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఓటు వేశారు. ఇప్పుడు అక్కడ ఎంతో అభివృద్ధి జరుగుతున్నది. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో కూడా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను గెలిపించాలి. నవీన్ యాదవ్ లాంటి యువ నాయకుడు ఏ సమస్య ఉన్నా క్షణాల్లో నా దృష్టికి తీసుకొస్తాడు. అదే బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికైతే మా వద్దకు రాలేరు. ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా నా వద్దకు అభివృద్ధి కోసం రావడం లేదు. వారు వస్తే పనులు చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను” అని చెప్పారు. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లోని పలు సమస్యలను మీడియా ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకురాగా.. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లో ఏటీసీ (అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ సెంటర్) ప్రస్తావన రాగానే, దాన్ని ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు.