ఓయూకి మళ్లీ వస్తా.. ఆర్ట్స్ కాలేజ్‎లో మీటింగ్ పెడతా: సీఎం రేవంత్ రెడ్డి

ఓయూకి మళ్లీ వస్తా.. ఆర్ట్స్ కాలేజ్‎లో మీటింగ్ పెడతా: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీకి మళ్లీ వస్తానని.. డిసెంబర్‎లో ఆర్ట్స్ కాలేజ్‎లో మీటింగ్ పెడతానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మళ్లీ వచ్చిన రోజు ఓయూలో పోలీస్ పహారా వద్దు.. బారికేడ్లు అడ్డుపెట్టొదని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు నిరసన తెలిపే స్వేచ్ఛనివ్వాలని.. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్త శుద్ధి తనకు ఉందన్నారు. అప్పుడు విద్యార్థులు నినసన తెలిపినా తాను ఏమీ అనబోనని వాళ్లు లేవనెత్తిన సమస్యలపై అదేరోజు అక్కడికక్కడే సమాధానం చెబుతానని అన్నారు. నేను మల్లోసారి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఎవరిని అరెస్టు చేయకండని పోలీసులను ఆదేశించారు.

సోమవారం (ఆగస్ట్ 25) సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
 ఓయూ లేకపోతే తెలంగాణ చరిత్రనే లేదని.. ఉస్మానియా వర్శిటీ తెలంగాణకు పర్యాయ పదమన్నారు. ఉస్మానియా, తెలంగాణ రెండూ ఒక్కటేనన్నారు. ఓయూ గడ్డ నుంచే భారత స్వాతంత్ర్యం కోసం పీవీ నర్సింహారావు పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎన్నో పోరాటాలు, చారిత్రక ఘట్టాలకు ఓయూ వేదికన్నారు. దేశానికి ప్రధానిగా పని చేసిన పీవీ ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంటేనని, ఓయూలో చదువుకొని దేశ రాజకీయాల్లో ఎంతో మంది చక్రం తిప్పారన్నారు సీఎం రేవంత్. 

జైపాల్ రెడ్డి, జార్జి రెడ్డి, గద్దర్ తో పాటు ఎంతో మంది కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధనలో ఓయూ రోల్ ఎంతో కీలకమని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థులే ముందున్నారని, ఉద్యమంలో రాజకీయ నేతలను ప్రజలు సంపూర్ణంగా విశ్వసించలేదన్నారు. 

తెలంగాణ సాధనలో ఓయూ విద్యార్థులదే కీలక పాత్ర అని, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుడు శ్రీకాంత్ చారి కుటుంబానికి గత ప్రభుత్వ హయంలో ఏమీ దక్కలేదన్నారు. శ్రీకాంత్ చారి, యాదయ్య అందరి ముందే తెలంగాణ కోసం అమరులయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూను గత పాలకులు నిర్వీర్యం చేశారని, కాలగర్భంలో కలపాలని చూశారని విమర్శించారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఓయూకు పునర్ వైభవం వచ్చిందన్నారు. సామాజిక న్యాయంలో భాగంగా వర్సిటీలకు వీసీలను నియమించామని, దళిత బిడ్డ కుమార్ ను ఓయూ వీసీగా అపాయింట్ చేశామని చెప్పారు. ఓయూకు ఎంతిచ్చినా తక్కువేనని.. డిసెంబర్‎లో మళ్ళీ వచ్చి ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టి వందల కోట్లు నిధులిస్తానని హామీ ఇచ్చారు.