- జూన్ 2లోపు నోటిఫికేషన్లు.. డిసెంబర్ 9లోపు భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
- ఈ ఇయర్ నుంచి ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్
- పదేండ్లు నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు గోసపడ్డరు
- ఇప్పుడు ఇస్తుంటే పరీక్షలు వాయిదా వెయ్యాలంటున్నరు
- దీక్షల వెనుక రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్లు
- ఇంజినీరింగ్ స్టూడెంట్లకు పట్టాలిస్తే సరిపోదు.. స్కిల్స్ నేర్పాలి
- సివిల్, మెకానికల్ కోర్సులను బంజేస్తే దేశానికే ప్రమాదమని వ్యాఖ్య
- జేఎన్టీయూహెచ్లో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్‌కు హాజరు
- హైదరాబాద్‌లో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో గ్లోబల్ ఏఐ సమిట్
హైదరాబాద్, వెలుగు: ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇకపై దాని ప్రకారమే ఏటేటా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ‘‘యూపీఎస్సీ తరహాలో ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తం. అందుకోసం జాబ్ క్యాలెండర్ తెస్తున్నం. దాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి చట్టబద్ధం చేస్తం. ప్రతిఏటా మార్చి 31కల్లా అన్ని శాఖల్లోని ఖాళీలను తెప్పిస్తం. జూన్ 2కల్లా నోటిఫికేషన్లు ఇస్తం. డిసెంబర్ 9కల్లా ఆ సంవత్సరంలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తం” అని వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్లో ‘తెలంగాణలో క్వాలిటీ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్’ అంశంపై ఇంటరాక్షన్ ప్రోగ్రామ్‌తో పాటు ‘స్టూడెంట్వలంటరీ పోలీసింగ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమానికి ముఖ్యమైన కారణాల్లో నిరుద్యోగ సమస్య ఒకటని.. అందుకే నిరుద్యోగ యువత, విద్యార్థుల కోసం తమ ప్రభుత్వం వివిధ ప్రణాళికలు రూపొందిస్తున్నదని చెప్పారు. ‘‘ఉద్యోగాల భర్తీకి మేం సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. ఆ వివరాలన్నీ త్వరలోనే ఆన్ లైన్లో పెడ్తం. ఇప్పుడు డీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తదితర పరీక్షలు పూర్తి చేసి.. ఈ ఏడాది చివరి నాటికి ఖాళీలన్నీ భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా ఇకపై ఫీజు రీయింబర్స్ మెంట్ ఎప్పటికప్పుడు చెల్లిస్తామని ప్రకటించారు. ‘‘పేద బిడ్డలు గొప్పగా చదువుకోవాలని నాడు కాంగ్రెస్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీమ్ తీసుకొచ్చారు. కానీ వివిధ పరిస్థితుల కారణంగా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వేల కోట్లు పేరుకుపోయాయి. ఆ బకాయిలను ఒకేసారి సెటిల్ మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తం. మంత్రి శ్రీధర్ బాబుకు ఆ బాధ్యత అప్పగిస్తున్న. ఈ విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ ను సకాలంలో చెల్లిస్తం. మేనేజ్మెంట్లకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. దీనిపై మా ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో ముందుకుపోతున్నది” అని అన్నారు.
రూల్స్ ఉల్లంఘిస్తే నోటిఫికేషన్ రద్దయితది..
కోర్టు కేసులన్నీ క్లియర్ చేసి, 20 ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘గ్రూప్1 పరీక్షను ఎలాంటి సమస్య లేకుండా నిర్వహించాం. గత ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షకు బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పి తీసుకోకపోవడంతో.. హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసింది. మా ప్రభుత్వం నోటిఫికేషన్ లో ఏయే అంశాలను పొందుపరిచిందో.. అదే పద్ధతిలో పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ఇచ్చింది. 2022లో గత ప్రభుత్వమే గ్రూప్1 మెయిన్స్‌కు1:50 రేషియోలో ఎంపిక చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం అదే విధానం అమలు చేస్తున్నాం. కానీ కొందరు ఇప్పుడు 1:100 అమలు చేయాలని కోరుతున్నారు. దీనివల్ల మాకేం ఇబ్బంది లేదు. కానీ కోర్టుల్లో ఇబ్బంది ఎదురవుతుంది. నోటిఫికేషన్ లో ఉన్న రూల్స్ ను పాటించకపోతే, ఆ నోటిఫికేషన్ ను కోర్టు రద్దు చేస్తుంది. 2011 నుంచి ఇప్పటి వరకూ గ్రూప్ 1 పరీక్ష పూర్తికాలేదు. అప్పట్లో 21 ఏండ్లున్న పిల్లలు.. ఇప్పుడు 34 ఏండ్లు దాటిపోయారు. యుక్త వయసంతా కోచింగ్ సెంటర్లలోనే గడిచిపోయింది. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తున్నాం” అని చెప్పారు.
పరీక్షలు రాయనోళ్లు దీక్ష చేస్తున్నరు..
కొంతమంది పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారని, అలా చేస్తే ప్రజాప్రతినిధులకు పోయేదేమీ లేదని సీఎం రేవంత్ అన్నారు. ఏ పరీక్ష రాయనోళ్లే ఈ వాయిదా అడుగుతున్నారు. ముగ్గురు దీక్ష చేస్తే, వారిలో ఒక్కరు కూడా ఏ పరీక్షా రాయట్లేదు. వాళ్ల వివరాలు సేకరించినం. ముగ్గురిలో ఒకతను ఓ కోచింగ్ సెంటర్ యజమాని. రెండు నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ చేస్తే రూ.100 కోట్ల లాభం వస్తుదని ఆయన దీక్ష చేస్తున్నడట. మరొకాయన మన పార్టీలోనే ఉండే కదా.. ఎందుకు దీక్ష చేస్తున్నడని మావాళ్లను అడిగితే.. ‘నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదు. నిన్ను గిల్లడానికి దీక్షకు కూర్చున్నడు’ అని చెప్పారు. ఇంకో పిల్లగాడు గాంధీ ఆసుపత్రిలో చేరి దీక్షకు కూర్చున్నడు. ఆయన కూడా ఏం పరీక్ష రాయట్లేదు. దీక్ష చేస్తే పేరు వస్తదని ఒక లీడర్ చెప్తే చేసిండట” అని అన్నారు.
గ్రూప్ 1 అభ్యర్థులను ఆర్ఎంపీ ఇంటర్వ్యూ చేస్తడా?
గత ప్రభుత్వ హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారని సీఎం రేవంత్ తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చూస్తరా? అని ప్రశ్నించారు. ‘‘గత ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది. కమిషన్ సభ్యులుగా ఆర్ఎంపీని నియమించింది. ఒక ఆర్ఎంపీ.. గ్రూప్ 1 అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తడా?” అని ప్రశ్నించారు. అందుకే గ్రూప్ 1 అభ్యర్థులను ఎంపిక చేసేటోళ్లు, ఆ పరీక్షల సిలబస్, పేపర్ తయారు చేసేటోళ్లు.. గ్రూప్ 1 ఆఫీసర్ కంటే పైస్థాయి వ్యక్తి అయి ఉండాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.
పట్టా ఉంటున్నది గానీ.. పనితనం ఉంటలేదు..
ప్రపంచంలోని గొప్ప నిర్మాణాలన్నీ ఇంజినీర్లు సృష్టించిన అద్భుతాలేనని సీఎం రేవంత్ అన్నారు. కానీ కాలేజీలు సివిల్ ఇంజినీరింగ్ సీట్లను తగ్గించుకుంటూ పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘తాత్కాలిక ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సుల వైపే మేనేజ్మెంట్లు మొగ్గు చూపుతున్నాయి. ఇంజినీరింగ్ అంటే కేవలం కంప్యూటర్ సైన్స్ ఒక్కటే కాదు. చాలా కాలేజీలు సివిల్ ఇంజినీరింగ్ సీట్లు తగ్గించుకుంటూ పోతున్నాయి. కాలేజీల్లో తప్పనిసరిగా సివిల్, మెకానికల్, ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్ కోర్సులను కొనసాగించాలి. లేదంటే దేశానికే ప్రమాదం” అని హెచ్చరించారు. ప్రతిఏటా లక్షలాది మంది విద్యార్థులు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారని, కానీ సరిపడా స్కిల్స్ లేక ఉద్యోగాలు పొందలేకపోతున్నారని అన్నారు. పట్టా ఉంటున్నది గానీ.. పనితనం ఉంటలేదని పేర్కొన్నారు. ‘‘ఇంజినీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా మారొద్దు. మనం చదువుతున్న చదువులకు మార్కెట్లో ఉన్న అవసరాలకు పొంతన ఉండడం లేదు. అలాకాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలి. ఇంజినీరింగ్ కాలేజీలు దేశానికి మేధావులను అందించే సంస్థలుగా ఉండాలి. అందుకు అవసరమైన సాయం ప్రభుత్వం నుంచి అందజేస్తం” అని తెలిపారు. యువతలో స్కిల్స్ పెంపొందించేందుకు త్వరలోనే స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ లో భాగంగా టాటా సంస్థ భాగస్వామ్యంతో రూ.2,400 కోట్ల ఖర్చుతో ఐటీఐల రూపురేఖలను మారుస్తున్నామని పేర్కొన్నారు.
ఏఐ కోర్సులు పెట్టండి..
కాలేజీల్లో ఏఐ కోర్సులు పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. ‘‘ఇప్పుడు ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నడిపించబోతున్నది. మేనేజ్మెంట్లు ఆ అవసరాలను గుర్తించి ఏఐ వైపు విద్యార్థులను ప్రోత్సహించాలి. అందుకు అవసరమైన విధానాలు, కోర్సులను రూపొందించాలి. ఈ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందజేస్తుంది. ఏఐలో దేశవ్యాప్తంగా తెలంగాణ ముందుండాలని మా ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నది” అని చెప్పారు.
క్రీడలను ప్రోత్సహిస్తం...
తమ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని సీఎం రేవంత్తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్టేడియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘‘భవిష్యత్తులో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. ‘ప్రజాప్రతినిధి’ అంటే అత్యంత పవిత్రమైన బాధ్యత. ప్రజా సమస్యలపై ఫోకస్‌గా పనిచేయడం వల్లే నేను ఈ స్థాయికి చేరా. సమస్యలకు భయపడి పారిపోవద్దు. నిలబడి సమస్యలపై పోరాడాలి. జీవితంలో ఫోకస్‌గా పనిచేయండి.. లక్ష్యాలను సాధిస్తారు. నరేంద్ర మోదీకైనా, బిల్ గేట్స్ కైనా, రేవంత్ రెడ్డికైనా రోజుకు 24 గంటలే. రోజుకు 16 గంటలు మీరు ఎంత ఫోకస్‌గా పని చేస్తారో.. అది మీ లక్ష్యాన్ని అంత చేరువ చేస్తుంది. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. గొప్ప వ్యక్తులు ఎవరూ గొప్ప కుటుంబాల నుంచి రాలేదు. ఎవరూ ఎవరి కంటే తక్కువ కాదు’’ అని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐటీ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషన్ శ్రీదేవసేన, ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, జేఎన్టీయూ రెక్టార్ విజయకుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం..
సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఒక కారణమని సీఎం రేవంత్అన్నారు. పిల్లలను మొబైల్ఫోన్లకు దూరంగా ఉంచితే చాలా సమస్యలను నివారించవచ్చని చెప్పారు. ‘‘ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల చిన్నారులు మానసికంగా బలహీనులవుతున్నారు. చిన్నారులు మానసికంగా బలంగా ఉండేందుకు ఉమ్మడి కుటుంబం దోహదం చేస్తుంది. పిల్లలను మానసికంగా దృఢం చేసేందుకు వాళ్లకు సోషల్పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ నేర్పించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. ‘‘డ్రగ్స్‌పై మా ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. డ్రగ్స్నిర్మూలనకు మీరూ సహకరించండి. స్కూల్స్, కాలేజీల్లో సబ్జెక్ట్ నేర్పించడమే కాదు.. మోరల్పోలీసింగ్ కూడా నేర్పించాలి. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించే వ్యవస్థ ఉండాలి. స్కూళ్లు, కాలేజీల్లో ఎన్ఎస్ఎస్ వలంటీర్ల అవసరం ఎంతో ఉంది. పోలీసులకు సమాచారం చేరవేసేలా వ్యవస్థను తయారు చేసుకుంటే.. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చవచ్చు. కేరళ తరహాలో ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో మోరల్పోలీసింగ్సిస్టమ్ను పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలి’’ అని సూచించారు.
డీఎస్సీ వాయిదా వేసుకుంటూపోతే ఎట్ల?
గతంలో మనం ఉద్యోగాల కోసం కొట్లాడినం. కానీ ఇప్పుడు మేం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తుంటే.. కొందరు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. మేం పరీక్షల సిలబస్ మార్చలేదు. పాత సిలబస్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. కానీ కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు స్వలాభం కోసం పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ రెండేండ్ల కింద ఇచ్చింది. అది అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చింది. అయినా మళ్లీ వాయిదా వేయాలని కోరుతున్నారు. వాయిదాలు వేస్తూ పోతే ఈ రెండేండ్లుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ల పరిస్థితేంటి? ఇప్పటికే ఉద్యోగాలు రాక వాళ్లు నిరాశలో ఉన్నారు.
- సీఎం రేవంత్ రెడ్డి