అభివృద్ధికి సహకరించకపోతే బొందపెడ్తం.. నిధుల కోసం ప్రధాని, కేంద్ర మంత్రులను వందసార్లయినా కలుస్తం: సీఎం రేవంత్రెడ్డి

అభివృద్ధికి సహకరించకపోతే  బొందపెడ్తం.. నిధుల కోసం ప్రధాని, కేంద్ర మంత్రులను వందసార్లయినా కలుస్తం: సీఎం రేవంత్రెడ్డి
  • ఇవ్వకపోతే పోరాడే హక్కు మనకుంది
  • పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్​రెడ్డి
  • ఓట్ చోరీ నుంచి దృష్టిని మరల్చేందుకే సోనియా, రాహుల్​పై అక్రమ కేసులు
  • వీటికి వ్యతిరేకంగా మోదీ, అమిత్ షాతో ఎంతదాకైనా కొట్లాడ్తం
  • ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం ఓట్లను తొలగిస్తున్నరు
  • మహారాష్ట్రలో కోటి, బిహార్​లో 68 లక్షల ఓట్లు గల్లంతైనయని ఆరోపణ
  • ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై రచ్చబండలపై చర్చ పెట్టాలని డీసీసీ చీఫ్​లకు సూచన
  • డీసీసీ చీఫ్​లు పనితీరు నిరూపించుకోకపోతే పక్కన పెడ్తాం: పార్టీ ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్​
  • వారం, పది రోజుల్లో నామినేటెడ్​, పెండింగ్ పదవుల భర్తీ: పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్​

హైదరాబాద్, వెలుగు: 
తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోతే రాష్ట్రంలో బీజేపీని బొందపెడ్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ఢిల్లీ వెళ్తున్న..  ప్రధాని నరేంద్రమోదీని కలిసి ప్రతిపాదనలు అందజేస్త. నిధులు ఇస్తావా.. లేదా.. అని మోదీని నిలదీసి అడుగుత. మేము అడిగినవన్నీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే కచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని నేలమట్టం చేస్తం’’ అని చెప్పారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నింటినీ మోదీ గుజరాత్​కే తీసుకెళ్తున్నారని, ఆయన గుజరాత్​ ముఖ్యమంత్రి కాదని, ఈ దేశానికి ప్రధాన మంత్రి అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. 

గుజరాత్​కు ఏమేమి ఇచ్చారో తెలంగాణకు కూడా అవన్నీ ఇవ్వాల్సిందేనని సీఎం  డిమాండ్​ చేశారు. మంగళవారం గాంధీభవన్​లో పీసీసీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరయ్యారు. పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. “రాష్ట్రం కోసం కేంద్రాన్ని నిధులు అడగడం మన బాధ్యత.. ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు.. అడగకుండానే ఇవ్వలేదని మాట్లాడితే తప్పు మన వైపు ఉంటది. అందుకే ఒక్కటికి పదిసార్లు అడుగుతాం. ఇక్కడ  వ్యక్తిగతమైన పైరవీలు ఏమీలేవు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే ఒకటికి వంద సార్లు ఢిల్లీకి పోయి ప్రధాని, కేంద్ర మంత్రులను అడుగుతాం. ఇస్తే సరే సరి. ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారో బీజేపీ రుచి చూస్తది” అని రేవంత్​ పేర్కొన్నారు.  

ఓట్ చోరీ నుంచి దేశం దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్​పై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్రమ కేసులు పెట్టారని సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. ‘‘బీజేపీ చేస్తున్న ఓట్ చోరీని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లారు. ఇప్పుడు బిహార్ ఎన్నికల్లో జరిగిన ఓట్ చోరీ, ఎన్నికల నిర్వహణ లోపాలపై పార్లమెంట్​లో కూడా చర్చకు కాంగ్రెస్​ సిద్ధమైంది. వీటిని పక్కదారి పట్టించేందుకే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కొత్త కేసు పెట్టారు” అని పేర్కొన్నారు. 

సోనియా, రాహుల్ పై పెట్టిన అక్రమ కేసులను తెలంగాణలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త  ఖండిస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నానని ఆయన చెప్పారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్​తో పాటు రాష్ట్ర ప్రజలంతా గాంధీ కుటుంబానికి, సోనియా, రాహుల్​కు అండగా నిలబడతామని స్పష్టం చేశారని తెలిపారు. ‘‘ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా మోదీ, అమిత్ షాతో ఎంతదాకైనా కొట్లాడుతాం.. పోరాడుతాం. ఈ సమావేశం ద్వారా ఆ ఇద్దరికీ ఈ సందేశాన్ని  పంపిస్తున్నాం’’ అని సీఎం చెప్పారు. 

దేశ స్వాతంత్ర్యం కోసం నేషనల్ హెరాల్డ్​అనే పత్రికను నెహ్రూ ప్రారంభించి, దానిని నడిపేందుకు సొంత ఆస్తులను ఖర్చు పెట్టారని, కాలక్రమంలో ఆ పత్రిక మూతపడితే అందులో పనిచేసే ఉద్యోగులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నిధులను అందులో పెట్టిందని, ఇది వాస్తవమని తెలిపారు. కానీ, దేశ ప్రజలను మోదీ, అమిత్ షా తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లను బీజేపీ గెలుపు కోసం తొలగించారని సీఎం ఆరోపించారు. మహారాష్ట్రలో కోటి,  బిహార్​లో 68 లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్నారు.

కేసీఆర్​ ఇచ్చిన చీరలు పొలాలకు కట్టెటోళ్లు

రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఇందిరమ్మ చీరలు ప్రతి ఆడబిడ్డకు అందేలా చూడాల్సిన బాధ్యత డీసీసీ అధ్యక్షులపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తం కోటి చీరలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఇందులో ఇప్పటికే 65 లక్షల చీరలు గ్రామీణ ప్రాంత మహిళల కోసం పంపించామని, వాటిని ఈ డిసెంబర్​లోగా అందించాల న్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మం ది మహిళలకు మార్చిలోగా అందుతాయని తెలిపా రు. 

‘‘ఇందిరమ్మ చీరల గురించి ఓ అక్క నాకుఒక మంచి మాట చెప్పింది. అందులో చాలా లాజిక్  కనిపించింది. మీరందరూ కూడా ఆ విషయం మీద దృష్టి పెట్టాలి. ‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బతుకమ్మ చీర ఇస్తే.. వాటి క్వాలిటీని చూసి మహిళలు బండ బూతు లు తిట్టేది. వాటిని తీసుకెళ్లి పంట పొలాలు, చేన్ల వద్ద పిట్టలు రాకుండా కట్టేది. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చీర లు వచ్చినోళ్లు ఆనందంగా ఉన్నారు. రానోళ్లు ఇంకా ఎప్పుడిస్తరని అడుగుతున్నరు’ అని ఆ అక్క చెప్పింది. అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులకు నా సూచన.. ప్రతి ఒక్క డీసీసీ చీఫ్​కు ఇది మొదటి టాస్క్, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందేలా చూడాల్సిన బాధ్యత మీదే’’ అని సీఎం స్పష్టం చేశారు. ఏ మహిళకైనా చీర అందలేదంటే మీ పనితీరు బాగాలేనట్లే అనుకో వాల్సి వస్తుందని డీసీసీ అధ్యక్షులకు తేల్చిచెప్పారు.  

హిందూ దేవుళ్ల లాగే కాంగ్రెస్​లో స్వేచ్ఛ ఎక్కువ..

కాంగ్రెస్​లో స్వేచ్ఛ ఉంది కాబట్టే 140 ఏండ్లుగా ఈ పార్టీ బతికి బట్టకడ్తున్నదని, స్వేచ్ఛ లేకుంటే ఓ జనతా పార్టీలాగా, ఇతర రీజినల్​ పార్టీల్లాగా ఎప్పుడో మూతపడేదని సీఎం రేవంత్​ అన్నారు. డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్​పార్టీలో అన్ని రకాల మనస్తత్వాలున్నోళ్లుంటరు. హిందువులళ్ల మూడు కోట్ల మంది దేవుళ్లున్నరు కదా! ఎందుకున్నరు. పెండ్లి చేసుకోనోనికి హనుమంతుడున్నడు. రెండు పెండ్లిళ్లు చేసుకునోటోనికి ఒకాయన దేవు డున్నడు. మందు తాగేటోనికి ఓ దేవుడున్నడు. కళ్లు పొయ్యాలే, కోడిని గొయ్యాలే అనేటోళ్లకో దేవుడున్నడు. పప్పన్నం తినేటోళ్లకు కూడా ఉన్నడు. ఒకాయన ఆంజనేయస్వామికి మొక్కుతడు. ఒకాయన అయ్యప్పమాల వేసుకుంటే.. ఇంకొకాయన శివ మాలేస్తడు. అలానే, కాంగ్రెస్​లో కూడా ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది’’ అని తెలిపారు. 

డీసీసీ చీఫ్​లతో విడివిడిగా సమావేశం 

పీసీసీ కార్యవర్గ సమావేశం అనంతరం డీసీసీ కొత్త అధ్యక్షులతో పార్టీ ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వేర్వేరుగా సమావేశం అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై వారికి పలు సూచనలు చేశారు. పార్టీలోని పాత అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలను కలుపుకొని పోవాలని, మంత్రులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు. మండల, గ్రామ కమిటీలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలను గెలిపించుకోవాలని తెలిపారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న డీసీసీ చీఫ్ లు పంచాయతీ ఎన్నికలను చాలెంజ్​గా తీసుకోవాలని, ఆ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలపై రచ్చబండలపై చర్చకు పెట్టాలి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల గురించి గ్రామాల్లో రచ్చబండల వద్ద చర్చకు పెట్టాలని డీసీసీ కొత్త అధ్యక్షులకు సీఎం రేవంత్ ​రెడ్డి సూచించారు. ఈ రెండేండ్లలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని, వాటన్నింటినీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత డీసీసీ కొత్త అధ్యక్షులపైన ఉందన్నారు. 

‘‘మనం అభివృద్ధి  చేయడమే కాదు.. చేసింది చెప్పుకోవడం కూడా చాలా అవసరం. ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు,  200 యూనిట్లు ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ,  రైతు భరోసా, 65 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రూ. 500కే గ్యాస్  సిలిండర్ .. వంటివి చేపట్టాం. వీటన్నింటి మీద రచ్చబండ కాడనే కాదు.. ఏ కార్యక్రమంలోనైనా సరే చర్చ పెట్టాలి. ప్రజలకు తెలియజెప్పాలి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులకు చెప్తారు.. జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులకు, వారు గ్రామ అధ్యక్షులకు, అక్కడి నుంచి వార్డులో ఉండే అధ్యక్షులకు చెప్పాలి.. ఇది మన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం. ఇందుకోసం మీరందరూ కష్టపడి పని చేయాలి” అని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. 

పనితీరు నిరూపించుకోకపోతే తప్పుకోవాల్సిందే: మీనాక్షి

డీసీసీ కొత్త అధ్యక్షులు మూడు నెలల్లో తమ పనితీరును నిరూపించుకోవాలని, లేదంటే తప్పుకోవాల్సిందేనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. ‘‘కాదు, కుదరదు అంటే మేమే తప్పించాల్సి ఉంటుంది” అని తేల్చిచెప్పారు. గుజరాత్​లోనూ ఇదే  చేశామ ని, పంచాయతీ ఎన్నికలు ఉన్నందున సమన్వ యంతో ముందుకు సాగాలన్నారు. పార్టీలోని అన్ని స్థాయిల్లోని నేతలను కలుపుకొని పోవాల ని ఆమె సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. ఇంతలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఆరు నెలల గడువు ఇద్దామని కోరగా.. అందుకు ఆమె సరే అని అంగీకరించారు.

పది రోజుల్లో నామినేటెడ్​, పదవులు: మహేశ్​ గౌడ్​

మరో వారం, పది రోజుల్లో నామినేటెడ్ పదవులతో పాటు పెండింగ్​లో ఉన్న ఇతర అన్ని రకాల పార్టీ పదవులను భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. సీఎం రేవంత్ నేతృత్వంలో అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని, పీసీసీ చీఫ్​గా తనకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నానని చెప్పారు. డీసీసీ చీఫ్​ల నియామకంలో అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని, కాంగ్రెస్​లో కష్టపడితేనే పదవులు వస్తాయని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ నేతలు అందర్నీ కలుపుకొని పోవాలని, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, సీతక్క, అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, డీసీసీ కొత్త అధ్యక్షులు, పీసీసీ నేతలు, కార్పొరేషన్ చైర్​ పర్సన్లు పాల్గొన్నారు.