రైతుబంధు పైసలు పదిరోజుల్లో ఎప్పుడేసినవ్ కేసీఆర్: కడిగిపారేసిన సీఎం రేవంత్

రైతుబంధు పైసలు పదిరోజుల్లో ఎప్పుడేసినవ్ కేసీఆర్: కడిగిపారేసిన సీఎం రేవంత్

కాంగ్రెస్​తో కరువు వచ్చిందంటూ కేసీఆర్​ చేసిన కామెంట్లకు సీఎం రేవంత్​ కౌంటర్​ ఇచ్చారు. కరువుతోపాటు రూ.7లక్షల కోట్ల అప్పును వారసత్వంగా కేసీఆర్​ ఇచ్చిపోయారని మండిపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో వందేండ్ల విధ్వంసం జరిగిందని అన్నారు.ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్​ జన జాతర సభ ఏర్పాట్లను మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి సీఎం రేవంత్​రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వందరోజులకే మీరు అది చేయలేదు ఇది చేయలేదని తమను కేసీఆర్​ అంటున్నారని, పదేండ్లలో ఆయన చేసింది ఏమిటని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. 

also read : పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తు: కేటీఆర్

‘‘పదిరోజుల్లోనే రైతుబంధు డబ్బులు జమజేసినట్లు కేసీఆర్​ చెప్పుకుంటున్నడు. వాళ్ల పాలనలో డిసెంబర్​లో మొదలు పెట్టి సెప్టెంబర్​ వరకు పదినెలల వరకు రైతుబంధు పైసలను రైతుల ఖాతాల్లో వేస్తూ వచ్చిన్రు. అసెంబ్లీలోనే ఈలెక్కలన్నీ బయటపెడితే కేసీఆర్​ సభకు రాకుండా పారిపోయిండు. 2018 ఎన్నికలప్పుడు తప్ప రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడానికి నాలుగు నెలల నుంచి పదినెలలు టైమ్​తీసుకున్నడు. ఆయన ఇప్పుడు మా గురించి మాట్లాడుతున్నడు. కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా...మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 64 లక్షల 75 వేల 581 మంది రైతు ఖాతాల్లో రైతు బంధు వేసినం. ఇంకా 4 లక్షల మంది రైతులకు రైతు బంధు వేయాల్సి ఉంది.   ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన వారికీ వేస్తం. మొత్తం రైతు బంధు ఖాతాలు 69 లక్షలు ఉన్నయ్​. ఈ లెక్కలు తప్పు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా సిద్ధమే” అని తేల్చిచెప్పారు. తాము చెప్పిన లెక్కలు వాస్తవమైతే తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.