బీఆర్ఎస్ సానుభూతితో ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తోంది: సీఎం రేవంత్

బీఆర్ఎస్ సానుభూతితో ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తోంది: సీఎం రేవంత్

శనివారం ( నవంబర్ 1 )  రెండో రోజు జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. ఈ క్రమంలో ఎర్రగడ్డ డివిజన్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. సానుభూతితో బీఆరెస్ ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తోందని అన్నారు.గత సంప్రదాయాలను తుంగలో తొక్కింది కేసీఆర్ అని అన్నారు సీఎం రేవంత్.సెంటిమెంట్ పేరుతో బీఆరెస్ నేతలు ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. 2007 లో పీజేఆర్ ఆకస్మికంగా చనిపోతే ఏకగ్రీవంగా చేయాలంటే అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కెసీఆర్ అంటూ మండిపడ్డారు సీఎం రేవంత్.

ఆనాడు పీజేఆర్ కుటుంబాన్ని మూడు గంటలు బయట నిలబెట్టి కేసీఆర్ అవమానించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్. పీజేఆర్ కుటుంబంపై పోటీ పెట్టి సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది కేసీఆర్ అని అన్నారు. కారు షెడ్డుకు పోయిందని బిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.జూబ్లీహిల్స్ లో సమస్యలు పేరుకుపోవడానికి కారణం నువ్వు మీ అయ్య కాదా కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సమస్యలు పరిష్కరించి ఉంటే జూబ్లీహిల్స్ కు ఈ పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మైనారిటీ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని అన్నారు. 

మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 70 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని అన్నారు. ఈ బస్తీల్లో రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నది కాంగ్రెస్ కాదా అని అన్నారు.ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సన్నబియ్యం ఇస్తున్నది.. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది నిజం కాదా అని అన్నారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి పంపిన కేటీఆర్.. సునీతమ్మను మంచిగా చూసుకుంటాడా ఎద్దేవా చేశారు సీఎం రేవంత్. సొంత చెల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మ కూతురికి బంగారు గాజులు పెడతారంటే నమ్ముతారా అని ప్రశ్నించారు. 

►ALSO READ | కారు షెడ్డుకు పోయింది.. బిల్లా రంగాలు ఆటోల్లో తిరుగుతున్నారు: సీఎం రేవంత్

జూబ్లీహిల్స్ లో అభివృద్ధి జరగాలంటే నవీన్ యాదవ్ ను గెలిపించాలని అన్నారు సీఎం రేవంత్. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డి జాగీర్ ఏమైనా పోతుందా.. ఎందుకు అడ్డుకోవాలని చూశారని ప్రశ్నించారు. అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆరెస్ పనిచేసిందని.. ఇప్పుడు బీజేపీ వాళ్లు బీఆరెస్ ను గెలిపించేందుకు పనిచేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మైనారిటీలకు మేలు జరుగుతుందని.. నవీన్ యాదవ్ ను గెలిపించాలని అన్నారు.