మోదీ, చంద్రబాబు, నేను.. ప్రభుత్వ బడుల్లోనే చదివాం: సీఎం రేవంత్ రెడ్డి

మోదీ, చంద్రబాబు, నేను.. ప్రభుత్వ బడుల్లోనే చదివాం: సీఎం రేవంత్ రెడ్డి

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, తాను ప్రభుత్వ బడుల్లోనే చదివామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పదవ తరగతిలో 10జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో సీఎం రేవంత్ ఇంటరాక్ట్ అయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆశయాలను విద్యార్థులు నెరవేర్చాలన్నారు. నారాయణ, చైతన్య స్కూల్స్ లో చదివితే ఫోటో దిగి నా పిల్లలని చెబుతారని.. కానీ, ప్రభుత్వ స్కూల్స్ లో చదివి రాణిస్తే నా పిల్లలని చెబుతానన్నారు.    90 శాతం ఐఏస్, ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు ప్రభుత్వ బడుల్లో చదువుకున్నవారేనని చెప్పారు. 

ప్రభుత్వ పాఠశాలలో సెమీ రెసిడెన్షియల్ విద్యావిధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. 2024, జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభమైన జయశంకర్ బడి బాట కార్యక్రమం.. 20వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వాహణ మహిళా సంఘాలకే ఇచ్చామన్నారు.  విద్యకు కేటాయించే నిధుల్లో ఎక్కువ శాతం జీతాలకే అవుతోందన్నారు. విద్యపై చేసేది ఖర్చు కాదని.. అది, పెట్టబడని చెప్పారాయన.  

విద్యపై నిరంతరం పర్యవేక్షించేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు సీఎం.  గత పాలనలో ప్రభుత్వ బడులు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని... విద్యార్థులు లేరనే నేపంతో బడులను మూసేశారని తెలిపారు. ప్రైవేటు స్కూల్స్ కు పంపిస్తే.. అప్పుల పాలవుతారని చెప్పారు. గ్రామాల్లో స్కూల్స్ పై నిర్లక్ష్యం వహిస్తే.. భవిష్యత్ లో తీవ్ర నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ అన్నారు.