సోనియా, రాహుల్పై కేసులు పెడితే భయపడం: సీఎం రేవంత్ రెడ్డి

సోనియా, రాహుల్పై కేసులు పెడితే భయపడం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: మోదీ, అమిత్ షాలకు భయపడేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సోనియా, రాహుల్పై కేసులు పెడితే భయపడమని.. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణాలు, ఆస్తులు అర్పించిందని ఆయన చెప్పారు. సోనియా, రాహుల్ను ఇబ్బంది పెట్టేందుకే కొత్తకొత్త కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. 

నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ పోరాటంలో భాగమైందని ఆయన గుర్తుచేశారు. నేషనల్ హెరాల్డ్ ప్రారంభించింది, పెట్టుబడి పెట్టింది నెహ్రు అని సీఎం వివరించారు. పార్లమెంట్లో ఓట్ చోరీపై చర్చ జరగొద్దని కుట్రలు చేస్తున్నారని, బీహార్లో జరిగిన ఓట్ చోరీపై దృష్టి మరల్చే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ తెలిపారు.

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని సీఎం చెప్పారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు ఇస్తామని, ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర చేరేలా డీసీసీలు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. సంక్షోభ రాష్ట్రాన్ని కేసీఆర్ మన చేతిలో పెట్టాడని.. సంక్షోభ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా మార్చుతున్నామని.. నగరంలో పరిశ్రమలను బయటకు తరలిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. 

ORR, RRR మధ్య ఉన్న ప్రాంతాన్ని పెరీ జోన్ గా డెవలప్ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని మూడు సెక్టార్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని సీఎం వివరించారు. వరంగల్, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టులు వస్తున్నాయని.. హైదరాబాద్ నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ కోసం కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.