కష్ణా నీళ్లు,పాలమూరు ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం జరిగింది. ప్రాజెక్టులతో కేసీఆర్ ఏవిధంగా ప్రజాధనం దుర్వినియోగం చేశారు..ఏవిధంగా ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంచి దోచుకున్నాడో చెప్పే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అతడు సినిమా స్టోరీని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
రేవంత్ ఏమన్నారంటే.. అతడు సినిమాలో ఓ లీడర్ ను పై నుంచి ఎవడో కాలుస్తాడు. ఎంక్వైరీకి వచ్చే సీబీఐ ఆఫీసర్ .. ఎవడు హత్య చేసి ఉండొచ్చని జైలులో ఉన్న పాత క్రిమినల్స్ ను ఆరాదీస్తాడు. ప్రతి నేరగాడికి ఓ ప్యాటర్న్ ఉంటుంది. జేబులు కొట్టే వాడికి, చైన్ లు దోచేవాడికి , కేసీఆర్ లా ప్రాజెక్టుల అంచనాలు పెంచి దోచుకునే వాళ్లకు ఓ విధానం ఉంటుందని తెలిపారు.
పాలమూరు రంగారెడ్డి ద్వారా రూ. 55 వేల కోట్లు కొల్లగొట్టాలని కేసీఆర్ ప్లాన్ వేశారు. డీపీఆర్ లేకుండా 25 వేల కోట్లు ఖర్చు చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల కట్టకుండా మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం నిర్మించి అంచనాను రూ. 38,500 కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంచారు.అలాగే జూరాల దగ్గర కట్టాల్సిన పాలమూరును శ్రీశైలానికి మార్చి రూ. 32,800 కోట్ల నుంచి 90 వేల కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచారు. ఇలా కేసీఆర్ పంపులు, లిఫ్ట్ ల పేరుతో అంచనా వ్యయం పెంచి వేల కోట్లు దోచుకున్నాడు తప్ప కొత్తగా ఒక్క ఎకరానికి సాగునీరియ్యలేదని చెప్పారు రేవంత్ .
