
- 18న అచ్చంపేటలో స్కీమ్‌ను ప్రారంభించనున్న సీఎం
- ఈ ఏడాది 10 వేల మందికి లబ్ధి
- బడ్జెట్లో రూ. 600 కోట్లు కేటాయింపు
- 27 జిల్లాల్లోని గిరిజన రైతులకు వర్తింపు
- ఐదేళ్లలో 2.30 లక్షల మంది రైతులకు స్కీమ్ అమలు
హైదరాబాద్, వెలుగు: గిరిజన రైతులకు వంద శాతం సబ్సిడీతో ఉచితంగా సోలార్ పంపు సెట్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుంది. ఈ స్కీంను ఈ నెల 18న నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆర్వోఎఫ్ఆర్ (రికగ్నిషన్ ఆఫ్‌ఫారెస్ట్ రైట్స్) చట్టం కింద 4 ఎకరాల లోపు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ఈ స్కీం వర్తించనుంది. రాష్ట్రంలో ఆర్వోఎఫ్ఆర్ చట్టానికి అనుగుణంగా 27 జిల్లాల్లో మొత్తం 2,30,735 మంది రైతులు 6.69 లక్షల ఎకరాలను సాగు చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ ఏడాది 10 వేల మంది లబ్ధిదారులకు స్కీంను అమలు చేయనున్నారు.
ఇందుకోసం బడ్జెట్ లో రూ. 600 కోట్లు కేటాయించారు. వచ్చే ఐదేండ్లలో మిగతా వారందరికీ స్కీంను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ స్కీం కింద బోరు వేసేందుకు అయ్యే ఖర్చుతో పాటు మోటారు, సోలార్ ప్యానల్ ద్వారా ఉచిత విద్యుత్ కూడా ఇవ్వనున్నారు. గిరిజన ప్రాంతాల్లోని భూములను సాగు యోగ్యంగా మార్చి గిరిజన రైతు కుటుంబాల ఆదాయం రెట్టింపు చేయటమే లక్ష్యంగా ఈ స్కీంను ప్రభుత్వం అమలు చేయనుంది.
ఇవీ అర్హతలు
రెండున్నర ఎకరాలు లేదా ఒక హెక్టారు కంటే ఎక్కువ భూమి ఉన్న గిరిజన రైతులకు ఒక యూనిట్ ను అందజేస్తారు. ఇంతకంటే తక్కువ భూమి ఉంటే గనక.. సమీపంలోని 2 నుంచి 5 మంది ట్రైబల్ రైతులతో గ్రూప్ గా ఏర్పాటు చేసి యూనిట్ శాంక్షన్ చేయనున్నారు. ఒకవేళ తక్కువ భూమి ఉండి సమీపంలో ట్రైబల్ రైతులు లేకపోతే ఆ రైతులకు వ్యక్తిగతంగా యూనిట్ శాంక్షన్ చేస్తారు. అలాగే ఉపాధి హామీ స్కీమ్ కింద భూమిని అభివృద్ధి చేయటం, బోర్ వేసేందుకు సర్వే, బోరు బావుల తవ్వకం, 5 హెచ్ పీ లేదా 7.5 హెచ్ పీ సోలార్ పంప్ సెట్లు, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా సాగునీటి సౌకర్యం కల్పించటం, వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు, యంత్రాలు, హార్టికల్చర్ శాఖ ద్వారా డ్రిప్ సౌకర్యం, స్ర్పింక్లర్స్ ఏర్పాటు చేయటం వంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
స్కీమ్ గురించి పూర్తి వివరాలకు రాష్ర్ట స్థాయిలో మాసాబ్ ట్యాంక్ ట్రైబల్ కమిషనర్ లేదా ట్రైకార్ పీఎంయూ(ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్)లో సంప్రదించాలని.. జిల్లా స్థాయిలో అయితే జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో సంప్రదించాలని ప్రభుత్వం బ్రోచర్ల ద్వారా పబ్లిసిటీ చేస్తోంది.